సచిన్ ఓ పుస్తకమైతే కోహ్లీ అందులో ఓ పేజి మాత్రమే: విండీస్ దిగ్గజం లారా

By Arun Kumar PFirst Published Jul 4, 2019, 8:25 PM IST
Highlights

వెస్టిండిస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా టీమిండియా మాజీ క్రికెటర్  సచిన్ టెండూల్కర్ ను ఆకాశానికెత్తేశాడు. అసలు విరాట్ కోహ్లీని సచిన్ తో పోలికే లేదంటటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అభిమానులు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తో పోలుస్తుంటారు. క్లాస్ బ్యాటింగ్, బంతిని ఎక్కువగా గాల్లోకి లేకపోకుండా బౌండరీలు బాదడం, సింగిల్స్, డబుల్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వీరిద్దరి బ్యాటింగ్ కామన్ గా కనిపిస్తుంది. అంతేకాకుండా ఎవరికీ సాధ్యం కావనుకున్న సచిన్ రికార్డులను సైతం కోహ్లీ బద్దలుగొడుతూ వస్తున్నాడు. ఒకప్పుడు సచిన్ కెరీర్ ఎలా సాగిందో  సేమ్ టు సేమ్ ప్రస్తుతం కోహ్లీ కెరీర్ కూడా అలాగే సాగుతోంది. దీంతో అభిమానులు వీరిద్దరిని పోల్చి చూడటం ఆరంభించారు. అయితే క్రికెట్ దిగ్గజం సచిన్ కు కోహ్లీకి అసలు పోలికలే లేవని వెస్టిండిస్ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

మహారాష్ట్రలోని  డివై పాటిల్  యూనివర్సీటీలో జరిగిన ఓ కార్యక్రమంలో లారా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. మీ దృష్టిలో టీమిండియా ఆటగాళ్ళు సచిన్, కోహ్లీలలో ఎవరు అత్యుత్తమ ఆటగాళ్లు అన్న ప్రశ్నకు లారా ఆసక్తికరమైన జవాభిచ్చాడు.

ఖచ్చితంగా నా దృష్టిల్లో సచినే అత్యుత్తమ ఆటగాడంటూ లారా తేల్చిచెప్పాడు. అతడితో మరే ఆటగాడికి పోల్చలేమని పేర్కొన్నాడు. భారత జట్టు క్రికెట్ స్టైల్ నే మార్చిన గొప్ప ఆటగాడు సచిన్ అని కొనియాడారు. గతంలో విదేశీ పిచ్ లంటే బెంబేలెత్తిపోయే టీమిండియా ప్రస్తుతం అదే పిచ్లపై చెలరేగుతోందంటే అది సచిన్ చలవేనని పేర్కొన్నాడు. 

సచిన్ ఓ పుస్తకమైతే అందులో కోహ్లీ  కేవలం ఓ పేజీ మాత్రమేనని అన్నాడు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ క్రికెట్లో సచిన్ స్థాయికి ఎవరూ చేరుకోలేరని...అతడో ఆల్ టైమ్ ఫేవరెట్ క్రికెటర్ అని అన్నాడు. ఇండియన్ క్రికెట్ పైనే కాదు అంతర్జాతీయ క్రికెట్ పై కూడా సచిన్ చెరగని ముద్ర వేశాడని...అందువల్లే అతడు మాస్టర్ బ్లాస్టర్ గా మారాడని లారా తెలిపాడు. 

click me!