ఐపీఎల్ మేం నిర్వహిస్తామంటూ బీసీసీఐకి యూఏఈ ఆఫర్

By Siva KodatiFirst Published May 10, 2020, 5:51 PM IST
Highlights

ఐపీఎల్ నిర్వహిస్తామంటూ పలు దేశాలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే శ్రీలంక క్రికెట్ బోర్డు తన ఆసక్తిని బీసీసీఐకి తెలపగా.. తాజాగా ఈ జాబితాలోకి యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు  వచ్చింది

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల క్రీడలు వాయిదాపడటమో, రద్దవ్వడమో కానీ జరిగింది. ప్రస్తుత పరిస్ధితుల్లో ఏ టోర్నీ ఎప్పుడు మొదలవుతుందో కూడా చెప్పలేని పరిస్ధితి.

కోవిడ్ 19 కారణంగా క్రికెట్ అభిమానులకు అసలు సిసలు మజాను అందించే ఐపీఎల్ కూడా వాయిదా పడింది. ఈ క్రమంలో తాము ఐపీఎల్ నిర్వహిస్తామంటూ పలు దేశాలు ముందుకొస్తున్నాయి.

#Also Read:ఐపీఎల్ కి లైన్ క్లియర్: బీసీసీఐ దెబ్బకు ప్రపంచ కప్ కూడా వెనక్కి!

ఇప్పటికే శ్రీలంక క్రికెట్ బోర్డు తన ఆసక్తిని బీసీసీఐకి తెలపగా.. తాజాగా ఈ జాబితాలోకి యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు  వచ్చింది. భారత్‌లో వాయిదాపడిన ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశ బోర్డు తెలిపింది.

దీనిపై బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ స్పందిస్తూ...ఐపీఎల్ నిర్వహణకు యూఏఈ ముందుకు వచ్చిందని, అయితే ప్రస్తుత పరిస్ధితుల్లో అంతర్జాతీయ ప్రయాణాలకు పూర్తి స్థాయిలో అనుమతులు లేని నేపథ్యంలో దాని గురించి మాట్లాడలేమన్నారు.

మరోవైపు యూఏఈకి గతంలోనే ఐపీఎల్‌ నిర్వహించిన అనుభవం వుంది. 2014లో భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో అక్కడ 20 మ్యాచ్‌లు జరిగిన సంగతి తెలిసిందే.

Also Read:ఐపీఎల్,టి20 వరల్డ్ కప్ నిర్వహణకు గవాస్కర్ సూపర్ ఐడియా!

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను అక్టోబర్, నవంబర్ నెలల్లో భారత్‌లోనే నిర్వహించేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే బయో సెక్యూర్ స్టేడియాలపై కసరత్తులు ప్రారంభించింది.

అయితే ప్రస్తుతం దేశంలోని అనేక ప్రాంతాల్లో రెడ్ జోన్లు ఉండటంతో అధి సాధ్యపడే అవకాశాలు కనిపించడం లేదు. ఆటగాళ్లు, టోర్నీలో పాల్గొనే వ్యక్తుల ఆరోగ్యం, భద్రతకే తమ మొదటి ప్రాధాన్యమని, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రాకపోకలు నిలిచిపోయాయని, ఇలాంటి పరిస్ధితుల్లో తాము ఏ నిర్ణయమూ తీసుకోలేమని అరుణ్ ధుమాల్ చెప్పారు. 

click me!