అండర్‌19 ఆసియా కప్ 2021: పాక్ చేతుల్లో టీమిండియా ఓటమి... ఆఖరి బంతి వరకూ సాగిన థ్రిల్లర్‌లో...

By Chinthakindhi RamuFirst Published Dec 25, 2021, 7:07 PM IST
Highlights

Under19 Asia cup 2021: ఆఖరి ఓవర్, ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో పాక్‌కి విజయం... 2 వికెట్ల తేడాతో వరుసగా రెండో విజయాన్ని అందుకున్న పాక్...

అండర్-19 ఆసియా కప్ 2021 టోర్నీలో భారత జట్టుకి పాకిస్తాన్ చేతుల్లో ఓటమి ఎదురైంది. ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత యువ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి... 49 ఓవర్లలో 237 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ అంగ్‌క్రిష్ రఘువంశీ, కెప్టెన్ యశ్ దుల్ డకౌట్ కాగా, షేక్ రషీద్ 6 పరుగులు, నిశాంత్ సంధు 8 పరుగులు చేసి పెవిలియన్ చేరడంతో 41 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది భారత జట్టు...

ఈ దశలో ఓపెనర్ హర్నూర్ సింగ్ 59 బంతుల్లో 6 ఫోర్లతో 46 పరుగులు, రాజ్ భవా 59 బంతుల్లో ఓ ఫోర్‌తో25 పరుగులు, వికెట్ కీపర్ అరాధ్య యాదవ్ 83 బంతుల్లో 3 ఫోర్లతో 50 పరుగులు చేసి ఆదుకున్నారు. 184 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది యువ భారత జట్టు. 

అయితే ఆఖర్లో కుశాల్ తంబే 38 బంతుల్లో 4 ఫోర్లతో 32 పరుగులు, రాజ్‌వర్థన్ హంగర్కకర్ 20 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేసి మెరుపులు మెరిపించడంతో ఈ మాత్రం స్కోరు అయినా చేయగలగింది టీమిండియా. ఎక్స్‌ట్రాల రూపంలో భారత జట్టుకి 30 పరుగులు రావడం మరో విశేషం. పాక్ బౌలర్లు వైడ్ల రూపంలో 19, 7 లెగ్ బైస్, 4 నో బాల్స్ వేశారు...

పాకిస్తాన్ బౌలర్ జీశన్ జమీర్ 60 పరుగులిచ్చి 5 వికెట్లు తీయగా, అవైస్ ఆలీకి రెండు, కెప్టెన్ ఖాసీం అక్రమ్, మాజ్ సదావత్‌లకు చెరో వికెట్ దక్కాయి. 

238 పరుగుల టార్గెట్‌లో బరిలో దిగిన పాకిస్తాన్‌కి మొదటి ఓవర్‌లోనే షాక్ తగిలింది. ఓపెనర్ అబ్దుల్ వహీద్ డకౌట్ అయ్యాడు. అయితే మాజ్ సదావత్, మహ్మద్ షాబజ్ కలిసి రెండో వికెట్‌కి 64 పరుగులు జోడించారు. సదావత్ 29 పరుగులు చేసి అవుట్ కాగా, మహ్మద్ సాబజ్ 105 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 81 పరుగులు చేశాడు.

115/3 స్కోరుతో ఉన్న పాకిస్తాన్, ఈజీగా విజయాన్ని అందుకునేలా కనిపించింది. అయితే కీలక దశలో విజృంభించిన భారత బౌలర్లు వెంటవెంటనే వికెట్లు తీశారు. అయితే ఖాసీం అక్రమ్ 22, ఇర్ఫాన్ ఖాన్ 32, రిజ్వాన్ మహ్మద్ 29 పరుగులు చేసి పాక్‌ను విజయతీరాలకు చేర్చారు...

ఆఖరి 7 బంతుల్లో 14 పరుగులు కావాల్సిన దశలో ఉత్కంఠ రేగింది. అయితే 49వ ఓవర్ ఆఖరి బంతికి సిక్సర్ బాదిన అహ్మద్ ఖాన్, 6 బంతుల్లో 8 పరుగులు కావాల్సిన స్థితికి చేర్చాడు. ఆఖరి ఓవర్ మొదటి బంతికి జీశన్ జమీర్‌ను అవుట్ చేశాడు రవికుమార్. ఆ తర్వాత రెండు బంతులకు సింగిల్స్ మాత్రమే వచ్చాయి...

దీంతో ఆఖరి మూడు బంతుల్లో 6 పరుగులు కావాల్సి వచ్చింది. నాలుగు, ఐదో బంతికి రెండేసి పరుగులు తీశాడు అహ్మద్ ఖాన్. ఆఖరి బంతికి విజయానికి 2 పరుగులు కావాల్సిన దశలో ఫోర్ బాది, పాకిస్తాన్‌కి టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని అందించాడు అహ్మద్ ఖాన్...

19 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 29 పరుగులు చేసిన అహ్మద్ ఖాన్, పాకిస్తాన్‌కి మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. భారత బౌలర్ రాజ్ భవ 10 ఓవర్లలో 54 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అండర్19 టోర్నీల్లో మొట్టమొదటి వన్డే మ్యాచ్ ఆడుతూ అత్యుత్తమ గణాంకాలు నమోదుచేసిన బౌలర్‌గా నిలిచాడు రాజ్.

భారత జట్టు తన తర్వాతి మ్యాచ్‌ డిసెంబర్ 27న ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడనుంది. రెండు విజయాలతో జోరు మీదున్న పాకిస్తాన్, అదే రోజున యూఏఈతో మ్యాచ్ ఆడుతుంది. భారత జట్టు ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించాలంటే ఆఫ్ఘాన్‌పై తప్పక విజయం సాధించాల్సి ఉంటుంది.

click me!