Ind Vs SA: ఫ్రీడమ్ సిరీస్ ప్రోమో విడుదల చేసిన సీఎస్ఏ.. వీడియోలో మహాత్మా గాంధీ, మదర్ థెరిస్సా

By Srinivas MFirst Published Dec 24, 2021, 2:05 PM IST
Highlights

India Tour Of South Africa: భారత జాతిపిత మహాత్మా గాంధీ, శాంతి దూత మదర్ థెరిసా, నెల్సన్ మండేలా లతో పాటు పలువురు  టీమిండియా, దక్షిణాఫ్రికాకు చెందిన ఆటగాళ్లు కనిపించిన ఈ ప్రోమో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది.  

మరో రెండ్రోజుల్లో టీమిండియా-దక్షిణాఫ్రికాల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ) ఫ్యాన్స్ ను ఖుషీ చేసింది. ఫ్రీడమ్ సిరీస్ గా పిలువబడుతున్న ఈ సిరీస్  కు సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది. ఈ వీడియోలో మహాత్మా గాంధీతో పాటు శాంతికి చిహ్నమైన  మదర్ థెరిస్సా, నెల్సన్ మండేలాలు కూడా కనిపించారు. ఒక నిమిషం పాటు నిడివి ఉన్న ఈ వీడియోలో  భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు దక్షిణాఫ్రికా సారథి డీన్ ఎల్గర్, టీమిండియా మాజీ దిగ్గజం  సచిన్ టెండూల్కర్ ను కూడా చూడొచ్చు. 

1992 నుంచి భారత జట్టు.. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్తున్నది. అప్పటినుంచి ఇప్పటిదాకా ఆఫ్రికా గడ్డపై ఏడు సార్లు సిరీస్ లు జరిగాయి.  ముప్పై ఏండ్లుగా అక్కడికి వెళ్తున్న భారత్.. ఒక్కసారి కూడా  సిరీస్ గెలువలేదు. ఆరు సిరీస్ లు సౌతాఫ్రికా గెలవగా.. ఒక్కటి డ్రా అయింది. ఇక తాజా సిరీస్ ను ఎలాగైనా నెగ్గాలని విరాట్ కోహ్లీ సేన భావిస్తున్నది. ఆ మేరకు నెట్స్ లో కూడా తీవ్రంగా శ్రమిస్తున్నది. 

 

This is what it's all about 🇿🇦🤝🇮🇳 pic.twitter.com/cxQSEwgZ7z

— Cricket South Africa (@OfficialCSA)

ఇక ఈ వీడియోలో మహామహులైన మహాత్మ గాంధీ, నెల్సన్ మండేలా, మదర్ థెరిస్సా లతో పాటుగా రెండు జట్లకు సంబంధించిన అప్పటి కెప్టెన్లు, ఆటగాళు, అభిమానుల భావోద్వేగాలను కూడా చూపించారు. ఫ్రీడమ్ సిరీస్ మొదలై 30 ఏండ్లు గడిచినా.. మరో 30 ఏండ్లైనా ఇది ఇలాగే కొనసాగాలని సీఎస్ఏ ఆశించింది. సీఎస్ఏ విడుదల చేసిన ఈ ప్రోమో.. నెట్టింట వైరల్ గా మారింది. 

టెస్టు సిరీస్ షెడ్యూల్ ఇది : 
- తొలి టెస్టు : డిసెంబర్ 26-29 - సెంచూరియన్ 
- రెండో టెస్టు : జనవరి 03-07  - జోహన్నస్బర్గ్ 
- మూడో టెస్టు : జనవరి 11-15 - కేప్ టౌన్ 

వన్డే సిరీస్ షెడ్యూల్ : 
- తొలి వన్డే : జనవరి 19 - పార్ల్
- రెండో వన్డే : జనవరి 21 - పార్ల్ 
- మూడో వన్డే : జనవరి 23 - కేప్ టౌన్ 

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 9 నే భారత జట్టు  దక్షిణాఫ్రికాకు వెళ్లాల్సి ఉండగా వారం రోజుల పాటు ఆలస్యంగా  ఇక్కడకు వచ్చింది.  ఒమిక్రాన్ నేపథ్యంలో  టెస్టు సిరీస్ ను ప్రేక్షకుల్లేకుండానే ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహించనున్నారు. టీ20 సిరీస్ ను కూడా ప్రస్తుతానికి వాయిదా వేశారు.

click me!