యువ మహిళా క్రికెటర్ ఆత్మహత్య

By telugu news teamFirst Published Jun 18, 2020, 9:22 AM IST
Highlights

త్రిపుర జట్టుకి గత ఏడాదికాలంగా ప్రాతినిథ్యం వహిస్తున్న అయాంతి రియాంగ్.. ఇటీవల అండర్-23 టీమ్‌తో కలిసి టీ20 టోర్నమెంట్‌లో కూడా ఆడినట్లు త్రిపుర క్రికెట్ అసోషియేషన్ తెలిపింది.

మహిళా క్రికెటర్ అయాంతి రియాంగ్ సూసైడ్ చేసుకుంది. 16 ఏళ్ల అయాంతి మంగళవారం అర్ధరాత్రి తన ఇంట్లోని ఫ్యాన్‌కి ఉరివేసుకుని ఆత్మహత్యకి పాల్పడినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె సూసైడ్‌కి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

త్రిపుర జట్టుకి గత ఏడాదికాలంగా ప్రాతినిథ్యం వహిస్తున్న అయాంతి రియాంగ్.. ఇటీవల అండర్-23 టీమ్‌తో కలిసి టీ20 టోర్నమెంట్‌లో కూడా ఆడినట్లు త్రిపుర క్రికెట్ అసోషియేషన్ తెలిపింది. ‘‘అయాంతి రియాంగ్.. త్రిపుర అండర్-16 జట్టులో రెగ్యులర్ ప్లేయర్. చాలా టాలెంట్ ఉన్న అమ్మాయి. అలాంటి క్రికెటర్ సూసైడ్ చేసుకుందంటే మేము నమ్మలేకపోతున్నాం’’ అని త్రిపుర క్రికెట్ అసోషియేషన్ సెక్రటరీ తిమీర్ చందా వెల్లడించాడు.

క్రికెట్ ఆడే సమయంలో ఆమె కుంగుబాటుకి గురవుతున్నట్లు ఏవైనా సూచనలు కనిపించాయా..? అని తిమీర్ చందాని ప్రశ్నించగా.. ‘‘లాస్ట్ సీజన్ వరకూ ఆమె పర్‌ఫెక్ట్‌గా కనిపించింది. కానీ.. మార్చి నుంచి లాక్‌డౌన్ కారణంగా స్టేడియాలు మూసివేశారు. దాంతో మ్యాచ్‌లు జరగలేదు. అయితే.. మా క్రికెటర్లకి ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వహించాం. కానీ.. ఆమె ఏ సమస్యనీ మాతో పంచుకోలేదు. బహుశా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌ ఏమైనా ఉన్నాయోమో..? మాకు తెలియదు’’ అని అతను వెల్లడించాడు.

click me!