కివీస్ సారథి అరుదైన ఘనత.. న్యూజిలాండ్ తరఫున తొలి బౌలర్‌గా రికార్డు..

Published : Mar 10, 2023, 08:33 PM IST
కివీస్  సారథి అరుదైన ఘనత.. న్యూజిలాండ్ తరఫున తొలి బౌలర్‌గా రికార్డు..

సారాంశం

Tim Southee:  న్యూజిలాండ్ టెస్ట్ జట్టు సారథి  టిమ్ సౌథీ అరుదైన ఘనతను అందుకున్నాడు.  డేనియల్ వెటోరీ పేరిట ఉన్న రికార్డును చెరిపేసి  ఆ జట్టు తరఫున  అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అవతరించాడు. 

న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌథీ  అరుదైన ఘనత సాధించాడు.  శ్రీలంకతో క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఐదు వికెట్లు తీసిన   సౌథీ.. న్యూజిలాండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన  బౌలర్ గా రికార్డులు సృష్టించాడు. గతంలో   మాజీ బౌలర్ డేనియల్ వెటోరి పేరిట ఉన్న   రికార్డును   సౌథీ చెరిపేశాడు.    

కొద్దిరోజుల క్రితమే కేన్ విలియమ్సన్ నుంచి టెస్టు సారథ్య పగ్గాలు అందుకున్న టిమ్ సౌథీ..  శ్రీలంకతో మ్యాచ్ లో  ఐదు వికెట్లు తీశాడు. తద్వారా  అతడు 708 వికెట్లు సాధించాడు. గతంలో ఈ రికార్డు  వెటోరి  (705 వికెట్లు) తీసుకుని ప్రథమ స్థానంలో ఉండేవాడు. ఇప్పుడు  ఆ రికార్డును సౌథీ  చెరిపేశాడు. 

వెటోరీ తన కెరీర్ లో   442 అంతర్జాతీయ (అన్ని ఫార్మాట్లలో కలిపి)  మ్యాచ్ లలో  705 వికెట్లు తీశాడు.  సౌథీ .. 354 మ్యాచ్ లలోనే ఈ ఘనతను అందుకున్నాడు.  సౌథీ తన కెరీర్ లో  93 టెస్టులు,  154 వన్డేలు,  107 టీ20లు ఆడాడు. టెస్టులలో  364, వన్డేలలో 210, టీ20లలో 134 వికెట్లు పడగొట్టాడు.  టీ20లలో అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక వికెట్లు తీసిన ఘనత సౌథీ పేరుమీదే ఉంది. బంతితోనే గాక బ్యాట్ తో కూడా సౌథీ కివీస్ కు ఉపయుక్తకరమైన ఇన్నింగ్స్ లు ఆడాడు. టెస్టులలో అతడు   1,950 పరుగులు చేయడం విశేషం.  

కివీస్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు : 

- టిమ్ సౌథీ :  354 మ్యాచ్  లు 708 వికెట్లు 
- డేనియల్ వెటోరీ : 437 మ్యాచ్ లు 705 వికెట్లు 
- సర్ రిచర్డ్ హ్యాడ్లీ : 201 మ్యాచ్ లు 589 వికెట్లు 
- ట్రెంట్ బౌల్ట్ :  232 మ్యాచ్ లు  578 వికెట్లు 
- క్రిస్ కెయిన్స్ : 278 మ్యాచ్ లు  419 వికెట్లు 

ఇక లంకతో మ్యాచ్ విషయానికొస్తే.. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో  355 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.  ఆ జట్టులో సారథి కరుణరత్నె (50) హాఫ్ సెంచరీతో రాణించగా కుశాల్ మెండిస్ (87),  ఏంజెలో మాథ్యూస్ (47), ధనుంజయ డిసిల్వ  (46) లు  మెరుగ్గా ఆడారు.  కివీస్ సారథి టిమ్ సౌథీ ఐదు వికెట్లు తీయగా మాట్ హెన్రీ నాలుగు వికెట్లు తీశాడు. 

 

అనంతరం  తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు వచ్చిన  న్యూజిలాండ్.. రెండో  రోజు ఆట ముగిసే సమయానికి   ఐదు వికెట్ల నష్టానికి  162 పరుగులే చేసింది.   ఓపెనర్ టామ్ లాథమ్ (67), డెవాన్ కాన్వే (30) లు తొలి వికెట్ కు  67 పరుగులు జోడించారు.  కానీ  కాన్వేను ఫెర్నాండో ఔట్ చేసిన తర్వాత  కివీస్ వరుసగా మరో రెండు కీలక వికెట్లను కోల్పోయింది. ఇంగ్లాండ్ తో గత మ్యాచ్ లో సెంచరీ చేసిన కేన్ విలిమయ్సన్.. ఒక్క పరుగే చేసి లాహిరు కుమార బౌలింగ్ లో కరుణరత్నెకు క్యాచ్ ఇవ్వగా  హెన్రీ నికోలస్  రెండు పరుగులు చేసి  అదే కుమార బౌలింగ్ లో రజిత చేతికి చిక్కాడు.  వికెట్ కీపర్ టామ్ బ్లండెల్  (7) కూడా విఫలమయ్యాడు. ప్రస్తుతం కివీస్ జట్టులో మిడిలార్డర్ బ్యాటర్  డారిల్ మిచెల్  (89 బంతుల్లో 40 నాటౌట్, 2 ఫోర్లు, 1 సిక్సర్) తో పాటు  మైఖేల్ బ్రాస్‌వెల్  (9 నాటౌట్) లు  క్రీజులో ఉన్నారు. 

 

PREV
click me!

Recommended Stories

RCB : ఆర్సీబీ మాస్ బ్యాటింగ్.. యూపీ బౌలర్లకు చుక్కలే ! గ్రేస్ హారిస్ సునామీ ఇన్నింగ్స్
Sophie Shine : రోహిత్ శర్మ నిద్ర చెడగొట్టిన ఆ అమ్మాయి ఈమేనా? ధావన్ లవ్ స్టోరీ మామూలుగా లేదుగా!