ఫ్రాంచైజీల మోజులో అంతర్జాతీయ క్రికెట్‌కు కష్టకాలం.. ఐపీఎల్ ఒక్కటే.. : ఎంసీసీ కీలక వ్యాఖ్యలు

Published : Mar 10, 2023, 08:00 PM IST
ఫ్రాంచైజీల మోజులో అంతర్జాతీయ క్రికెట్‌కు కష్టకాలం..  ఐపీఎల్ ఒక్కటే.. : ఎంసీసీ కీలక వ్యాఖ్యలు

సారాంశం

ICC-MCC: అంతర్జాతీయ  క్రికెట్ లో చట్టాలను రూపొందించే మెరిల్‌బోర్న్ క్రికెట్ క్లబ్.. అంతర్జాతీయ క్రికెట్ భవితవ్యంపై ఆందోళన వ్యక్తం చేసింది.  ఫ్రాంచైజీ క్రికెట్ మోజులో పడి  ఆటకు ఆయువు పట్టైన టెస్టులను నిర్లక్ష్యం చేయరాదని కోరింది.   

క్రికెట్‌లో చట్టాలను రూపొందించే  మెరిల్‌బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)  అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్ గురించి ఆందోళన వ్యక్తం చేసింది.   క్రికెట్ ఆడే ప్రతీ దేశంలో   ఫ్రాంచైజీ లీగ్ లు  పుట్టుకొస్తున్న వేళ  వాటిని నియంత్రించాల్సిన అవసరముందని.. ఇదిలాగే కొనసాగితే  ఇంటర్నేషనల్ క్రికెట్ ఉనికే ప్రశ్నార్థకమవుతుందని   ఎంసీసీ  తెలిపింది.  దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని  అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ని కోరింది.  

ఎంసీసీకి చెందిన ఓ కమిటీ ఇటీవలే దుబాయ్ వేదికగా ముగిసిన ఓ  కార్యక్రమంలో  కీలక చర్చ చేసింది.  ఈ చర్చలో పాల్గొన్న వక్తలందరూ టెస్టు క్రికెట్ ను కాపాడుకోవాలని ముక్తకంఠంతో వాదించారు.   ఫ్రాంచైజీ క్రికెట్ - ఇంటర్నేషనల్ క్రికెట్ మధ్య సమతూకం ఉండేలా షెడ్యూల్స్ రూపొందించుకోవాలని  సూచించారు. 

ఈ కమిటీలో   భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీ, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్, ఆస్ట్రేలియా మాజీ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్, శ్రీలంక  దిగ్గజం కుమార సంగక్కరలు సభ్యులుగా ఉన్నారు.   చర్చ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ.. ‘ఎవరెన్ని చెప్పినా ఇప్పటికీ ఆటలో టెస్టు క్రికెటే సుప్రీం.  ఈ ఫార్మాట్ లోనే మనం గొప్ప ఆటగాళ్లను చూడొచ్చు. మీ ఆట, నైపుణ్యాలకు ఇది పరీక్ష కాబట్టే దీనిని టెస్టు అని అంటున్నారు. దేశాలు కూడా టెస్టు క్రికెట్ కు ప్రాధాన్యత ఇవ్వాలి.  రాబోయే రోజుల్లో దేశాలు ఫ్రాంచైజీ క్రికెట్, టెస్టు క్రికెట్ కు సమ ప్రాధాన్యమిస్తాయని నేను ఆశిస్తున్నా..’అని  చెప్పాడు. 

ఈ చర్చలో భాగంగా వక్తలు ఇండియన్ ప్రీమియర్ లీగ్ పై ప్రశంసలు కురిపించారు.  ప్రపంచంలోని వివిధ లీగ్ లు అంతర్జాతీయ షెడ్యూల్స్ ఉన్నప్పుడు  జరుగుతున్నా ఐపీఎల్ ఒక్కటే  ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్స్ కు అనుగుణంగా షెడ్యూల్ ను కలిగిఉందని   కొనియాడారు. ఆటగాళ్లు తమ దేశాలకు  అంతగా మ్యాచ్ లు లేని సమయంలోనే ఈ లీగ్ కొనసాగుతుందని తెలిపారు. 

కొద్దిరోజుల క్రితం ఐసీసీ విడుదల చేసిన ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (ఎఫ్‌టీపీ) లో భాగంగా విడుదల చేసిన షెడ్యూల్ పట్ల ఎంసీసీ సంతృప్తి వ్యక్తం చేసింది. ‘ఈ ఏడాది పురుషుల  క్రికెట్ లో  తీరికలేని షెడ్యూల్ ఉంది. ద్వైపాక్షిక సిరీస్ లు, ఐసీసీ టోర్నీలతో వచ్చే నాలుగేండ్లు బిజీ షెడ్యూల్ ఉంది. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ లలో  భారత్ లో వన్డే వరల్డ్ కప్ జరగాల్సి ఉంది.. అంతర్జాతీయ క్రికెట్, దేశవాళీ టోర్నీలు, ఇతరత్రా టోర్నీల మధ్య  ఐపీఎల్ ఒక్కటే అంతర్జాతీయ మ్యాచ్ షెడ్యూల్ లకు దూరంగా ఉంది..’అని తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?