
ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చి, ఇంప్రెస్ చేసిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టీ20 ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు. మొదటి మ్యాచ్‌లోనే కళ్లు చెదిరే క్యాచ్ అందుకుని, క్రికెట్ విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు తిలక్ వర్మ..
టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. 7 బంతులు ఆడి 1 పరుగు మాత్రమే చేసిన కైల్ మేయర్స్, యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అయితే టీవీ రిప్లైలో బంతి, వికెట్లను మిస్ అవుతున్నట్టు క్లియర్‌గా కనిపించింది. అంపైర్ అవుట్‌గా ప్రకటించిన తర్వాత బ్రెండన్ కింగ్‌తో మాట్లాడిన కైల్ మేయర్స్, డీఆర్‌ఎస్ తీసుకోకుండానే పెవిలియన్ చేరడంతో వెస్టిండీస్ వికెట్ కోల్పోయింది..
ఆ తర్వాత రెండో బంతికే బ్రెండన్ కింగ్ కూడా అవుట్ అయ్యాడు. 19 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 28 పరుగులు చేసిన బ్రెండన్ కింగ్ కూడా యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లోనే ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఈసారి బ్రెండన్ కింగ్ డీఆర్‌ఎస్ తీసుకున్నా ఫలితం దక్కలేదు..
6 బంతుల్లో 3 పరుగులు చేసిన జాన్సన్ ఛార్లెస్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి తిలక్ వర్మ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌కి అవుట్ అయ్యాడు. దాదాపు 10 మీటర్ల దూరం నుంచి పరుగెత్తుకుంటూ వచ్చిన తిలక్ వర్మ, డైవ్ చేస్తూ సూపర్బ్ క్యాచ్ అందుకున్నాడు..
58 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది వెస్టిండీస్. ఛార్లెస్ అవుటైన తర్వాతి బంతికే రోవ్‌మన్ పావెల్ వికెట్ కోసం డీఆర్‌ఎస్ తీసుకుంది టీమిండియా. అయితే కుల్దీప్ యాదవ్ వేసిన బంతి, వికెట్లను మిస్ అవుతున్నట్టు క్లియర్‌గా కనిపించింది.
12 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది వెస్టిండీస్.