బూట్ల లేసులు కట్టుకోలేనివారు ధోనీపై విమర్శలా: రవిశాస్త్రి ఘాటు వ్యాఖ్యలు

By telugu teamFirst Published Oct 26, 2019, 1:33 PM IST
Highlights

ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ పై విమర్శలు చేస్తున్నవారిపై టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ధోనీకి ఎప్పుడు రిటైర్ కావాలో తెలుసునని ఆయన అన్నారు. రవిశాస్త్రి ధనీకి బాసటగా నిలిచారు.

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై విమర్శలు చేస్తున్నవారిపై హెడ్ కోచ్ రవిశాస్త్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ధోనీపై విమర్శలు చేస్తున్నవారిలో సగం మందికి బూట్ల లేసులు కూడా కట్టుకోవడం రాదని ఆయన అన్నారు. ధోనీ భవిష్యత్తు మీద స్పష్టత రాకపోవడంపై పలు వైపుల నుంచి విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. 

రవిశాస్త్రి ఓ ఇంటర్వ్యూలో ఆ వ్యాఖ్యలు చేశారని ఐఎఎన్ఎస్ రాసింది. పదిహేనేళ్ల పాటు భారత్ కోసం ఆడిన ధోనీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం అగౌరవపరచడమేనని అన్నారు. ఎప్పుడు రిటైర్ కావాలో ధోనీకి తెలుసునని, ధోనీ రిటైర్ మెంట్ పై చర్చకు అంతం పలకాలని ఆయన అన్నారు. 

Also Read: ధోనీ ఖేల్ ఖతమ్: ఎమెస్కే ప్రసాద్ మాటల ఆంతర్యం ఇదీ..

దేశం కోసం దోనీ ఏం చేశారో చూడాలని, ఆయన రిటైర్మెంట్ ను చూడాలని ఎందుకు తొందరపడుతున్నారని రవిశాస్త్రి అన్నారు. వారికి మాట్లాడేందుకు తగిన విషయాలు దొరికి ఉండకపోవచ్చునని అన్నారు. టెస్టు క్రికెట్ కు సరైన సమయంలో ధోనీ గుడ్ బై చెప్పాడని రవిశాస్త్రి అన్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్ విషయంలో కూడా ధోనీ సమయం చూసుకుంటాడని ఆయన అన్నారు. 

టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్నప్పుడు ధోనీ ఏం చెప్పాడో చూడాలని, తన వికెట్ కీపింగ్ గ్లౌస్ లను తీసుకోవడానికి వృద్ధిమాన్ సాహా సరైనవాడని చెప్పారని, ధోనీ కరెక్ట్ అని, ధోనీ తన అభిప్రాయాలనూ ఉద్దేశ్యాలనూ ఎల్ల వేళలా పంచుకుంటున్నారని చెప్పారు. 

Also Read: ధోనీతో పంత్... మరి కుక్కతో ఏం చేస్తున్నావు..?

ప్రపంచ కప్ విజయాన్ని ఇండియాకు అందించిన ధోనీ త్వరలోనే రిటైర్ అవుతాడని, ఆ విషయం ధోనీ నుంచి వచ్చే దాకా ఆగాలని ఆయన అన్నారు. బంగ్లాదేశ్ తో జరిగే పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టుకు ధోనీ ఎంపిక కాలేదు. సెలెక్షన్ కు సిద్ధంగా ఉన్నట్లు గానీ లేనట్లు గానీ ధోనీ చెప్పకపోవడంతో బంగ్లాదేశ్ సిరీస్ కు ఆయనను ఎంపిక చేయలేదు. 

click me!