Team India : వరుస విజయాలతో ఒక్క ఓటమి లేకుండా భారత జట్టు టీ20 ప్రపంచకప్ 2024 ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఈ విజయంలో కెప్టెన్ రోహిత్ శర్మ, రన్ మిషన్ విరాట్ కోహ్లీ కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు వీరిముందు మరో కొత్త టార్గెట్ వచ్చి చేరింది.
Rohit Sharma Virat Kohli : హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా అద్బుత విజయంతో టీ20 ప్రపంచ కప్ 2024 లో టైటిల్ ను సొంతం చేసుకుంది. దాదాపు 17 ఏళ్ల తర్వాత రెండో టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని అందుకుంది. 2007లో ఎంఎస్ ధోని సారథ్యంలోని టీమిండియా తొలి టీ20 ప్రపంచ కప్ ను అందుకోగా, ఇప్పుడు రోహిత్ శర్ కెప్టెన్సీలో రెండో సారి టీ20 క్రికెట్ ఛాంపియన్ గా నిలిచింది. ఈ క్రమంలోనే ఐసీసీ టోర్నమెంట్ లో సరికొత్త చరిత్రను సృష్టించింది. ఐసీసీ టీ20 టోర్నమెంట్ లో ఒక్క ఓటమి లేకుండా భారత జట్టు ఛాంపియన్ గా నిలిచింది. మెగా ట్రోఫీ అందుకున్న తర్వాత భారత జట్టు సీనియర్ స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు, రవీంద్ర జడేజాలు టీ20 క్రికెట్ కు వీడ్కోలు పలికారు. కానీ, వీరి ముందు మరో కొత్త టార్గెట్ ను ఉంచింది బీసీసీఐ.
టీమిండియా ఇప్పుడు 2024 టీ20 క్రికెట్ ఛాంపియన్ గా నిలిచింది. వచ్చే ఏడాది రెండు పెద్ద ఐసీసీ టోర్నమెంట్ లను గెలుచుకోవడమే తదుపరి లక్ష్యం. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టీ20 క్రికెట్ వీడ్కోలు పలికారు కానీ, వన్డే, టెస్ట్ క్రికెట్ లో కొనసాగనున్నారు. దీంతో బీసీసీఐ రాబోయే ఈ రెండు ఫార్మాట్ లకు సంబంధించిన ఐసీసీ ఈవెంట్ ట్రోఫీలను గెలుచుకోవడం కోసం సన్నాహాలు చేస్తోంది. టీ20 ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్ తీసుకున్న ఆటగాళ్లు ఇప్పుడు 2025లో జరగనున్న రెండు పెద్ద టోర్నీలను గెలవడానికి సిద్ధమవుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో విజయం సాధించడమే టీమ్ ఇండియా తదుపరి లక్ష్యమని బీసీసీఐ సెక్రటరీ జై షా అన్నారు.
టీమిండియా సీనియర్ ఆటగాళ్లతో కూడిన బలమైన జట్టు ప్రాముఖ్యతను ఎత్తిచూపుతూ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్, ఛాంపియన్స్ ట్రోఫీని గెలవాలని జై షా ఉద్ఘాటించారు. రాబోయే రెండు ఐసీసీ టోర్నీలకు సీనియర్ ప్లేయర్లు అందుబాటులో ఉంటారనీ, వారు తప్పకుండా భారత్ తరఫున ఆడతారని తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో పాకిస్థాన్ గడ్డపై ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించనున్నారు. ఆ తర్వాత, జూన్ 2025లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లండన్‌లోని లార్డ్స్‌లో జరుగుతుంది.ఈ రెండు ఐసీసీ టోర్నీలను గెలవాలని భారత్ చూస్తోంది.