
ఆసీస్ మాజీ క్రికెటర్ స్టువర్ట్ మెక్ గిల్ ను గతేడాది మార్చిలో పలువురు దుండగులు సిడ్నీలోని తన ఇంటి నుంచి కిడ్నాప్ చేశారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే ఇన్నాళ్లు దాని గురించి నోరు విప్పని మెక్ గిల్ తాజాగా.. అందుకు సంబంధించిన సంచలన విషయాలు వెల్లడించాడు. కిడ్నాపర్లు తన పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి బెదిరించడమే గాక.. బట్టలన్నీ విప్పించి.. దారుణంగా కొట్టారని తెలిపాడు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
‘ఆ ఘటనను తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తున్నది. మనం అత్యంత అసహ్యించుకునే శత్రువులకు కూడా అలా జరుగకూడదు. ఆరోజు (మెక్ గిల్ కిడ్నాప్ అయినరోజు) పలువురు సిడ్నీలోని నా ఇంటికి వచ్చి నన్ను కిడ్నాప్ చేశారు. వాళ్లు నన్నెక్కడికి తీసుకెళ్లారో నాకు తెలియదు..
నా కళ్లకు గంతలు కట్టి కార్ లో పడేశారు. నేను కార్లోకి ఎక్కనంటే వాళ్ల దగ్గర ఉన్న ఆయుధాలతో నన్ను బెదరించారు. కార్లో మేము సుమారు గంటన్నర ప్రయాణం చేశాం. అయితే వాళ్లు నన్ను ఎక్కడికి తీసుకెళ్లారనేదానిపై నాకు అంత స్పష్టత లేదు. ఒక చోటుకు తీసుకెళ్లిన తర్వాత వాళ్లు నా పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి బెదిరించారు. నా బట్టలన్నీ విప్పేసి నన్ను నగ్నంగా మార్చారు. అంతేగాక తీవ్రంగా కొట్టారు...’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.
గతేడాది మార్చిలో మెక్ గిల్ ను కిడ్నాప్ చేసిన దుండగులు చేయడంతో ఇది అపహరణ కేసు అనుకున్నారంతా. కానీ ఈ కేసులో మెక్ గిల్ భార్య తమ్ముడి హస్తం ఉందని తేలింది. డ్రగ్ డీల్ విషయంలో మెక్ గిల్ ఇన్వాల్వ్ అయ్యాడని, అందుకే దుండగులు అతడిని కిడ్నాప్ చేసి వార్నింగ్ ఇచ్చారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.
ఇంకా ఈ ఘటన గురించి మెక్ గిల్ స్పందిస్తూ.. ‘అప్పుడు నేను చాలా భయపడ్డాను. నేను తీవ్రంగా గాయాలపాలై ఉన్నాను. నన్ను తీవ్రంగా కొట్టిన దుండగులు ఆ తర్వాత కార్ డిక్కీలో కుక్కి.. నన్ను బెల్మోర్ లో పడేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత నేను కొద్దిరోజుల పాటు ఇంటికి వెళ్లలేదు. ఒక మిత్రుడు నన్ను మూడు వారాల పాటు ఓ హోటల్ లో ఉంచాడు.ఆ సమయంలో నేను కనీసం రెండు నెలల పాటు భయంతో ఇంటికే రాలేదు. ఆ తర్వాత పోలీసులు ఈ కేసుతో సంబంధమున్న నలుగురిని అరెస్ట్ చేశారు. అప్పుడే నేను ప్రశాంతంగా ఇంటికొచ్చా..’ అని తెలిపాడు.
1998-2008 మధ్య ఆసీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మెక్ గిల్.. టెస్టు, వన్డే ఫార్మాట్లలో ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 44 టెస్టులాడిన మెక్‌గిల్ 208 వికెట్లు సాధించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో మూడు మ్యాచ్‌లాడి 6 వికెట్లను తీశాడు.