IND vs SA: అవేశ్ ఖాన్ సూపర్ స్పెల్.. రాజ్‌కోట్ టీమిండియాదే.. సిరీస్ సమం

Published : Jun 17, 2022, 10:31 PM IST
IND vs SA: అవేశ్ ఖాన్ సూపర్ స్పెల్.. రాజ్‌కోట్ టీమిండియాదే.. సిరీస్ సమం

సారాంశం

IND vs SA T20I: దక్షిణాఫ్రికాపై వరుసగా రెండు మ్యాచులు ఓడిన భారత జట్టు తర్వాత అద్భుతంగా పుంజుకుంది. వైజాగ్ లో  సఫారీలను చిత్తు చేసిన టీమిండియా కుర్రాళ్లు.. రాజ్‌కోట్‌లో కూడా దానిని కొనసాగించారు. 

వరుసగా రెండు టీ20లు ఓడిన అవమనమో..  స్వదేశంలో సిరీస్ కోల్పోకూడదన్న పట్టుదలో గానీ టీమిండియా  పోయిన చోటే వెతుక్కున్నది. ఢిల్లీ, కటక్ లలో సఫారీలతో ఎదురైన పరాబవానికి  బదులు చెప్పింది. వైజాగ్ లో దక్షిణాఫ్రికాకు ఓటమి రుచి చూపించిన టీమిండియా.. రాజ్‌కోట్‌లో కూడా ఆ విజయాన్ని కొనసాగించి సిరీస్ ను 2-2 తో సమం చేసింది.  ఈ మ్యాచ్ లో భారత్ నిర్దేశించిన 170 పరుగులను ఛేదించే క్రమంలో సఫారీలు.. 16.5 ఓవర్లలో 87-9 పరుగులకే చాపచుట్టేశారు. ఫలితంగా టీమిండియా.. 82 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక బెంగళూరు లో ఆదివారం (జూన్ 19) సిరీస్ లో నిర్ణయాత్మక, చివరి టీ20 జరగనుంది. 

భారీ లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా కు శుభారంభమేమీ దక్కలేదు.  ఇన్నింగ్స్ తొలి బంతి నుంచి ఇబ్బంది పడ్డ టెంబ బవుమా (8 రిటైర్డ్ హర్ట్)  గాయంతో గ్రౌండ్ నుంచి వెళ్లిపోయాడు.  అనంతరం క్వింటన్ డికాక్ (14) ను హర్షల్ పటేల్ ఐదో ఓవర్లో  రనౌట్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లోనే అవేశ్ ఖాన్.. దక్షిణాఫ్రికాకు మరో షాకిచ్చాడు.  హిట్టర్ ప్రిటోరియస్ (0) ను డకౌట్ చేశాడు.  దీంతో సౌతాఫ్రికా 6 ఓవర్లలో 35 పరుగులే చేసి 2 వికెట్లు కోల్పోయింది.  

ఈ క్రమంలో గత రెండు మ్యాచులలో దక్షిణాఫ్రికాను ఆదుకున్న క్లాసెన్ (8) ఆదుకుంటాడని ఆ జట్టు అభిమానులు అనుకున్నా.. చాహల్ అతడి ఆటలు సాగనివ్వలేదు. అతడు వేసిన 9వ ఓవర్లో రెండో బంతికి క్లాసెన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అతడి స్థానంలో వచ్చిన ప్రమాదకర డేవిడ్ మిల్లర్ (8) ను హర్షల్ పటేల్.. 12వ ఓవర్లో రెండో బంతికి క్లీన్ బౌల్డ్ చేశాడు. అప్పుడే దక్షిణాఫ్రికా ఓటమి ఖరారైంది.  అప్పటికీ దక్షిణాఫ్రికా స్కోరు  59-4. 

 

అ(గ్ని)వేశ్.. 

ఆ తర్వాత దక్షిణాఫ్రికా జట్టులో సంచలనాలేమీ నమోదు కాలేదు.  14వ ఓవర్ వేసిన అవేశ్ ఖాన్.. ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసిన  సఫారీని కోలుకోలేని దెబ్బతీశాడు. ఆ ఓవర్లో తొలి బంతికి  డసెన్ (20) ను ఔట్ చేసిన అవేశ్.. నాలుగో బంతికి జాన్సేన్ (12) ను బోల్తా కొట్టించాడు. ఇక అదే ఓవర్లో చివరి బంతికి కేశవ్ మహారాజ్ ను కూడా  పెవిలియన్ కు పంపి సౌతాఫ్రికా కోలుకోకుండా చేశాడు. 

ఒకే ఓవర్లో మూడు వరుస వికెట్లు కోల్పోయిన తర్వాత దక్షిణాఫ్రికా.. మిగిలిన రెండు వికెట్లు కూడా వెంటవెంటనే కోల్పోయింది. యుజ్వేంద్ర చాహల్ వేసిన 15వ ఓవర్లో చివరి బంతికి నోర్త్జ్.. ఇషాన్ కిషన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 18వ ఓవర్ వేసిన అక్షర్.. ఎంగిడిని ఔట్ చేసి భారత్ కు విజయాన్ని ఖాయం చేశాడు. భారత జట్టులో అవేశ్ ఖాన్ (4-0-18-4) కెరీర్ లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.  చాహల్ రెండు వికెట్లు తీయగా.. అక్షర్, హర్షల్ లు తలో వికెట్ పడగొట్టారు. 

టాస్ ఓడి తొలుత  బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ (55), హార్ధిక్ పాండ్యా (46),  ఇషాన్ కిషన్ (27) లు రాణించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?