షెడ్యూల్ ప్రకారం యాషెస్ సిరీస్... షరతులకు అంగీకరిస్తే ఆస్ట్రేలియాకి వస్తామంటున్న ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు...

By Chinthakindhi RamuFirst Published Oct 9, 2021, 12:40 PM IST
Highlights

కరోనా ప్రోటోకాల్, క్వారంటైన్ నిబంధనలు మార్చకపోతే యాషెస్ సిరీస్ నుంచి తప్పుకుంటామని హెచ్చరించిన ఇంగ్లాండ్ క్రికెటర్లు... షరతులతో కూడిన అంగీకారాన్ని ఇచ్చిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు...

టెస్టు క్రికెట్‌లో అత్యంత క్రేజ్ ఉన్న సిరీస్‌లలో యాషెస్ సిరీస్ ఒకటి. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగే యాషెస్ సిరీస్ చూడడానికి స్టేడియానికి ప్రేక్షకులు వేల సంఖ్యలో క్యూ కడుతూ ఉంటారు... అయితే కరోనా నిబంధనల కారణంగా ఈ సారి యాషెస్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించడానికి ఇంగ్లాండ్ క్రికెటర్లు ఒప్పుకోలేదు.

కరోనా ప్రోటోకాల్, క్వారంటైన్ నిబంధనలు మార్చకపోతే యాషెస్ సిరీస్ నుంచి తప్పుకుంటామని హెచ్చరించారు... దీంతో ఈసారి యాషెస్ సిరీస్ జరుగుతుందా? లేదా? అనే అనుమానాలు రేగాయి. అయితే దీనిపై ఎట్టకేలకు ఓ క్లారిటీ వచ్చింది.

తమ షరతులకు అంగీకరిస్తే, ఆస్ట్రేలియాలో పర్యటించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ ‘కండీషనల్ అప్రూవల్’ ఇచ్చింది ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు... ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్‌తో పాటు మరికొందరు ఇంగ్లాండ్ క్రికెటర్లు కుటుంబానికి దూరంగా రెండు నెలలకు పైగా గడపడానికి, ఆస్ట్రేలియాలో పూర్తిగా గదులకే పరిమితమయ్యే కఠిన క్వారంటైన్ గడపడానికి సిద్ధంగా లేనట్టు ప్రకటించారు.

దీనిపై ఆస్ట్రేలియాతో పలువిధాలుగా చర్చలు జరిపిన ఇంగ్లాండ్ బోర్డు, ఈ సమస్యను ఓ కొలిక్కి తెచ్చే పనిలో పడింది. ఇంగ్లాండ్ వైస్ కెప్టెన్ జోస్ బట్లర్, తన భార్యాపిల్లలను వదిలేసి ఆస్ట్రేలియాలో రెండు నెలల పాటు క్రికెట్ ఆడేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. అతనితో పాటు క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, రోరీ బర్న్స్ వంటి చిన్నచిన్నపిల్లలున్న క్రికెటర్లు కూడా యాషెస్ సిరీస్ ఆడబోమని హెచ్చరించారు...

ఇంగ్లాండ్ క్రికెటర్ల డిమాండ్లకు దిగివచ్చిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు, కుటుంబాలతో పాటు ఆసీస్‌లో పర్యటించేందుకు, క్వారంటైన్ నిబంధనలను సరళీకృతం చేసేందుకు ఒప్పుకున్నట్టు సమాచారం. డిసెంబర్ 8న బ్రిస్బేన్‌లో జరిగే మొదటి టెస్టుతో యాషెస్ సిరీస్ మొదలుకానుంది...

భారత జట్టు గత ఆస్ట్రేలియా పర్యటనలో కూడా ఈ విధమైన ఇబ్బందులు తలెత్తాయి. కుటుంబాలను అనుమతిస్తారా? లేదా? అనే విషయంపై ఆఖరి నిమిషం వరకూ సందిగ్ధత నెలకొంది. అయితే కుటుంబంతో సహా వచ్చేందుకు భారత క్రికెటర్లకు ఆస్ట్రేలియా అనుమతించడంతో సమస్య సద్దుమణిగింది.

click me!