IPL 2021 RCB vs DC: శ్రీకర శుభకర భరత్.. ప్లేఆఫ్స్ కు ముందు ఢిల్లీకి షాకిచ్చిన బెంగళూరు..

By team teluguFirst Published Oct 8, 2021, 11:23 PM IST
Highlights

IPL 2021 RCB vs DC: ఐపీఎల్ చివరి లీగ్ మ్యాచ్ లో  విరాట్ కోహ్లి సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. చివరి బంతి దాకా ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో ఓపెనర్లు తడబడినా మిడిలార్డర్ రాణించడంతో బెంగళూరు.. ఫ్లే ఆఫ్స్ ముందు ఘన విజయాన్ని అందుకుంది.

ఐపీఎల్ లీగ్ దశను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయంతో ముగించింది. ఢిల్లీ నిర్దేశించిన 164 పరుగుల లక్ష్యాన్ని చివరి బంతిదాకా పోరాడి  ఛేదించింది. ఛేదనలో ఓపెనర్లిద్దరూ త్వరత్వరగానే ఔటైనా.. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ శ్రీకర్ భరత్, మ్యాక్స్వెల్ లు రాణించడంతో ఆ జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలుపును అందుకుంది.

165 పరుగుల లక్ష్యంతో ఛేదన ప్రారంభించిన Royal Challengers Bangloreకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్ సెకండ్ ఫేజ్ లో బెంగళూరుకు పుంజుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్లు విరాట్ కోహ్లి (3),  త్వరగానే ఔటవ్వగా.. దేవదత్ పడిక్కల్ (0) డకౌట్ అయ్యాడు. తొలి ఓవర్ చివరి బంతికే పడిక్కల్ ను ఔట్ చేసిన నార్త్జ్.. రెండో ఓవర్లో కోహ్లిని ఔట్ చేసి మ్యాచ్ ను ఢిల్లీ వైపునకు లాగేశాడు. 

ఓపెనర్లిద్దరూ వెంటవెంటనే నిష్క్రమించడంతో వచ్చిన కీపర్ శ్రీకర్ భరత్ (52 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 72 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఏబీ డివిలియర్స్ (26 బంతుల్లో 26), గ్లెన్ మ్యాక్స్వెల్ (33 బంతుల్లో51 నాటౌట్) సాయంతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిరువురూ  కలిసి అబేధ్యమైన నాలుగో వికెట్ కు  109 పరుగులు జోడించారు. 

తొలి ఏడు ఓవర్లలో రెండు కీలక వికెట్లు కోల్పోయి 37 పరుగులు మాత్రమే చేసిన బెంగళూరు.. అసలు మ్యాచ్ లో గెలవడానికే ఆడుతుందా అనిపించింది. కానీ 13వ ఓవర్ తర్వాత మ్యాక్స్వెల్, భరత్ గేరు మార్చి స్కోరుబోర్డు వేగాన్ని పెంచారు. ఇదే క్రమంలో భరత్ ఐపీఎల్ లో రెండో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భరత్, మ్యాక్స్వెల్ కలిసి ఫోర్లతో విజృంభించడంతో 15 ఓవర్లు ముగిసేసరికి  ఆర్సీబీ 108 పరుగులు చేసింది.  అప్పటికి బెంగళూరు  లక్ష్యం 30 బంతుల్లో 55 పరుగులుగా ఉంది. 

17వ ఓవర్ వేసిన రబాడా.. ఓ సిక్స్, ఫోర్ తో పాటు 15 పరుగులిచ్చాడు. ఆ తర్వాత అవేశ్ ఖాన్ ఓవర్లో 12 పరుగులు రాగా.. చివరి 2 ఓవర్లలో 12 బంతుల్లో 19 పరుగులు అవసరమయ్యాయి. 19వ ఓవర్ వేసిన నార్త్జ్.. నాలుగే పరుగులియ్యడంతో ఉత్కంఠ మరింతగా పెరిగింది. చివరి ఓవర్ లో బెంగళూరు విజయానికి 15 పరుగులు అవసరం కాగా..  భరత్ ఆఖరు బంతికి సిక్సర్ బాది తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

ఢిల్లీ బౌలర్లలో గత రెండు మ్యాచుల్లో రాణించిన అక్షర్ పటేల్ ఒక వికెట్ తీసినా పెద్దగా ఆకట్టుకోలేదు. నార్త్జ్ 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఇక రబాడ, రిపల్ పటేల్, అవేశ్ ఖాన్, అశ్విన్ లకు వికెట్ దక్కలేదు.  

click me!