
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తీసుకొచ్చిన ‘పరస్పర విరుద్ధ ప్రయోజనాలు’ నిబంధనపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అదో పనికిమాలిన నిబంధన అని అభివర్ణించాడు. గతంలో టీమిండియా మ్యాచులతో పాటు ఐపీఎల్ కు కూడా 11 ఏండ్ల పాటు కామెంటేటర్ గా వ్యవహరించిన రవిశాస్త్రి.. బీసీసీఐ తీసుకొచ్చిన ఈ నిబంధన కారణంగా ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో శాస్త్రి అభిమానులు.. ఇన్నాళ్లు అతడి కామెంట్రీని ఎంతో మిస్ అయ్యారు. అయితే తిరిగి ఈ సీజన్ నుంచి శాస్త్రి మళ్లీ మైక్ అందుకోబోతున్నాడు.
ఈ నేపథ్యంలో స్టార్ నెట్వర్క్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో రవిశాస్త్రి బీసీసీఐ నిబంధనపై తీవ్ర విమర్శలు చేశాడు. శాస్త్రి మాట్లాడుతూ..‘ఇది ఐపీఎల్ కు 15వ ఎడిషన్. పదకొండేండ్ల పాటు ఐపీఎల్లో నిరాటంకంగా నేను కామెంట్రీ చెప్పాను. కానీ పనికిమాలిన పరస్పర విరుద్ధ ప్రయోజనాల క్లాస్ నన్ను బంధించింది. దీనివల్ల నేను కొన్ని సీజన్ల పాటు కామెంట్రీ చేయలేకపోయాను...’ అని చెప్పాడు.
బీసీసీఐ తీసుకొచ్చిన ఈ నిబంధన ప్రకారం.. బోర్డులో ఉన్న ఓ వ్యక్తికి ఒక్క పదవే దక్కుతుంది. ఒక వ్యక్తి రెండు పదవులు ఆశించడానికి వీళ్లేదు. ఈ నిబంధన కారణంగా రవిశాస్త్రి టీమిండియాకు హెడ్ కోచ్ గా ఉన్న నేపథ్యంలో ఆయన కామెంట్రీ చెప్పడానికి వీళ్లేకుండా పోయింది. ఒక్క రవిశాస్త్రి విషయంలోనే కాదు.. బీసీసీఐ చీఫ్ గంగూలీ, ఎన్సీఏ అధ్యక్షుడు వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఇందుకు అతీతులేమీ కాదు.
బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ.. ప్రముఖ ఫుట్బాల్ టీమ్ ఏటీకే మోహన్ బగాన్ (లక్నో సూపర్ జెయింట్స్ అధినేత సంజీవ్ గొయెంకాది) లో ఒక పదవి నిర్వహించాడు. అయితే అది కూడా పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకే వస్తుందని ఆరోపణలు రావడంతో అతడు ఆ పదవి నుంచి తప్పుకున్నాడు. ఇక ఎన్సీఏ అధ్యక్షుడయ్యాక లక్ష్మణ్.. సన్ రైజర్స్ హైదరాబాద్ కు స్ట్రాటజికల్ అడ్వైజర్ తో పాటు బెంగాల్ రంజీ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
కాగా.. రవిశాస్త్రి ఈ ఐపీఎల్ సీజన్ లో టీమిండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనాతో కలిసి హిందీ కామెంటరీ చెప్పబోతున్నాడు. ఈ మేరకు రైనాతో కామెంట్రీ చేయడంపై మాట్లాడుతూ.. ‘మీరు అతడి(రైనా)ని మిస్టర్ ఐపీఎల్ అని పిలుస్తారు. అందుకు నేనేమీ విభేదించనుు. రైనా ఐపీఎల్ లో ఎంతో సాధించాడు. మ్యాచులను కోల్పోకుండా జట్టు కోసం విలువైన పరుగులు చేశాడు. వరుస సీజన్లలో ఒకే ఫ్రాంచైజీ తరఫున ఎన్నో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో రైనా కూడా ఒకడు. అతడితో కామెంట్రీ చెప్పేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా....’ అని శాస్త్రి చెప్పాడు. రైనా ఐపీఎల్ కెరీర్ లో 205 మ్యాచులాడి 5,528 పరుగులు చేయడం గమనార్హం.