క్వారంటైన్ నిబంధనలు పాటిస్తూ ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా, త్వరలో షెడ్యూల్!

By Sree s  |  First Published May 9, 2020, 5:13 PM IST

క్వారంటైన్‌ నిబంధనలు పాటించి మరీ, కంగారూ గడ్డపై కాలుమోపేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు సై అనటంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా  దాదాపుగా 2000 కోట్ల ఆదాయం నష్టపోకుండా రక్షించనుంది. 


కరోనా వైరస్‌ మహమ్మారి ప్రళయంతో ప్రపంచ వ్యాప్తంగా క్రీడా రంగం కుదేలైన విషయం తెలిసిందే! కోవిడ్‌-19 విసిరిన పంజాతో క్రికెట్‌ విలవిల్లాడుతోంది. ఆట ఆగిపోవటంతో, ఆదాయం నిలిచిపోయి ఆర్థిక సంక్షోభం కోరల్లో క్రికెట్‌ బోర్డులు చిక్కుకున్నాయి. 

కరోనా వైరస్‌ అదుపులోకి వచ్చిన తర్వాత, ఆట ఆరంభమైతే మాత్రమే క్రికెట్‌ బోర్డులు ఆర్థికంగా ఊపిరీ తీసుకునే అవకాశం ఉంది. కోవిడ్‌-19 మూలంగా షేర్‌ మార్కెట్‌లో, క్రికెట్‌ గ్రౌండ్‌లో చావుదెబ్బ తిన్న క్రికెట్‌ ఆస్ట్రేలియాకు భారత్‌ అపన్నహస్తం అందిస్తోంది. 

Latest Videos

క్వారంటైన్‌ నిబంధనలు పాటించి మరీ, కంగారూ గడ్డపై కాలుమోపేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు సై అనటంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా  దాదాపుగా 2000 కోట్ల ఆదాయం నష్టపోకుండా రక్షించడానికి సిద్ధపడింది.

ఆర్థికంగా చితికిపోయిన సీఏ, రానున్న సెప్టెంబర్‌లో ప్రసార భాగస్వామి ఫోక్స్‌టెల్‌, చానల్‌ సెవెన్‌ నుంచి సుమారు రూ. 760 కోట్ల మొత్తం అందుకోవాల్సి ఉంది. మీడియా హక్కులు సొంతం చేసుకున్న సంస్థ, ఈ మొత్తం సీఏకు ఇవ్వాలంటే ఏడాది ఆఖర్లో భారత జట్టు పర్యటనపై కచ్చితమైన హామీ ఇవ్వాలని మెలిక పెట్టాయి. 

లేదంటే, ప్రసార హక్కుల రూపంలో దక్కాల్సిన 100 మిలియన్‌ డాలర్లు సహా మరో 150 మిలియన్‌ డాలర్ల వ్యాపారం సీఏ నష్టపోవాల్సిన ప్రమాదం పొంచి ఉంది. ఈ విషయమై క్రికెట్ ఆస్ట్రేలియా భారత క్రికెట్ బోర్డుతో భారీస్థాయిలో సంప్రదింపులు జరుపైతోంది. 

ఆస్ట్రేలియా పరిస్థితిని అర్థం చేసుకున్న బీసీసీఐ... ఆస్ట్రేలియాకు వెళ్ళడానికి ఓకే చెప్పింది. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌ సోదరుడు, బోర్డు కోశాధికారి అరుణ్‌ కుమార్‌ దుమాల్‌ ఆస్ట్రేలియా పర్యటనపై స్పందించాడు. 

క్వారంటైన్‌ నిబంధనలు పాటించి భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే అవకాశం ఉందని అరుణ్‌ కుమార్‌ వెల్లడించాడు. కరోనా వైరస్‌ పంజా విసురుతున్న సమయంలో భారత జట్టు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టాలంటే పలు నిబంధనలు పాటించాలి. కరోనా వైరస్‌ నిర్దారణకు (వ్యాధి లక్షణాలు బయటపడేందుకు పడుతున్న సమయం) ప్రస్తుతం పాటిస్తున్న 14 రోజుల క్వారంటైన్‌ను భారత జట్టుకు వర్తింపజేయనున్నారు. 

క్వారంటైన్‌తో పాటు ఇతర బయోసెక్యూరిటి నిబంధనలు ఏమైనా ఉన్నా భారత జట్టు పాటిస్తుందని అరుణ్‌ అన్నాడు. 'ప్రస్తుత పరిస్థితుల్లో మరో మార్గం లేదు. క్రికెట్‌ సీజన్‌ను పున ప్రారంభించేందుకు అందరూ క్వారంటైన్‌ను కచ్చితంగా ఆచరించాల్సిందే. రెండు వారాల లాక్‌డౌన్‌ (క్వారంటైన్‌) పెద్ద విషయం కాదు. 

ఏ క్రీడాకారుడికైనా ఇది మంచిదే. ఇప్పటికే ఎన్నో రోజులుగా లాక్‌డౌన్‌లో ఉన్న క్రికెటర్లు ఇప్పుడే వేరే దేశం వెళ్లేందుకు రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉండటం మంచి విషయమే. క్రికెటర్ల క్వారంటైన్‌పై లాక్‌డౌన్‌ అనంతరం నియమ నిబంధనలు ప్రకటిస్తాం' అని అరుణ్‌ కుమార్‌ తెలిపాడు.

click me!