Virat Kohli: ఉంచుతారా..? దించుతారా..? ఆ విషయంలో విరాట్ భవితవ్యం తేలేది మరో వారం రోజుల్లోనే..

By team teluguFirst Published Dec 2, 2021, 1:21 PM IST
Highlights

India Tour Of South Africa: ఇప్పటికే టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ.. త్వరలోనే వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోనున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. 

టీమిండియా సారథి భవితవ్యం మరో వారం రోజుల్లో తేలనుంది. ఇప్పటికే టీ20 సారథ్య బాధ్యతల  నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ.. వన్డే కెప్టెన్సీకీ గుడ్ బై చెప్పనున్నాడా..? ఆ మేరకు  భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కూడా విరాట్ మీద ఒత్తిడి తెస్తుందా..? దక్షిణాఫ్రికా పర్యటనకు ముందే భారత వన్డే సారథిపై ఓ స్పష్టత రానున్నదా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. త్వరలో జరుగబోయే దక్షిణాఫ్రికా పర్యటనలోనే విరాట్ కోహ్లీ  వన్డే సారథ్య విషయమై కీలక నిర్ణయం వెలువడే అవకాశమున్నట్టు బీసీసీఐ వర్గాలు  అంటున్నాయి. 

న్యూజిలాండ్ తో స్వదేశంలో జరుగుతున్న  టెస్టు సిరీస్ ముగియగానే టీమిండియా దక్షిణాఫ్రికాకు వెళ్లాల్సి ఉంది. అయితే సౌతాఫ్రికాలో ఒమిక్రాన్ వైరస్ విజృంభణ నేపథ్యంలో ఈ సిరీస్ ఉంటుందా..? లేదా..? అన్నదానిపై సందిగ్దత నెలకొంది. అయినప్పటికీ  కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే టూర్ కు వెళ్లడానికి బీసీసీఐ.. జట్టును పంపడానికి సిద్ధంగా ఉంది.  ఈ మేరకు  సెలెక్షన్ కమిటీ కూడా కేంద్రం అనుమతిస్తే వెళ్లడానికి జట్టును కూడా ఎంపిక చేసే పనిలో పడింది.  మరో వారం రోజుల్లోపే టీమ్ ను ఎంపికచేసి వారిని పర్యటనకు సిద్ధం చేయాలని బీసీసీఐ భావిస్తున్నది.

మరో రెండు, మూడు రోజుల్లో.. సౌతాఫ్రికాకు వెళ్లే సభ్యుల పేర్లను బీసీసీఐ ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో విరాట్ ను వన్డే సారథిగా కొనసాగిస్తారా..? లేదా..? అన్న అంశం చర్చనీయాంశమైంది. ఈ విషయమై  బీసీసీఐలోని ఓ వర్గం విరాట్ ను కొనసాగించాలని వాదిస్తుండగా.. మరో వర్గం మాత్రం అతడిని తప్పించాలని పట్టుబడుతున్నట్టు తెలుస్తున్నది. 

2023లో వన్డే ప్రపంచకప్ ఉంది. అంతకుముందే వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ కూడా జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వన్డే ప్రపంచకప్ నాటికి రోహిత్ శర్మను సిద్ధం చేయడానికి ఇదే మంచి తరుణమని  అతడికి మద్దతిస్తున్న వర్గం వాదనగా ఉంది. పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్సీ బాధ్యతలను పూర్తిగా అతడికి అప్పగించాలని, కోహ్లీని టెస్టు కెప్టెన్ గా కొనసాగించాలని చెబుతున్నారు.  అయితే చేతన్ శర్మ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ  త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది. 

‘అతి త్వరలోనే దక్షిణాఫ్రికాకు వెళ్లే భారత జట్టును ప్రకటిస్తాం. మా వైపు నుంచి మేం అన్ని రకాలుగా సిద్ధమయ్యాం. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నాం. ఒకవేళ కేంద్రం మాకు అనుమతులిస్తే.. అక్కడికి వెళ్లడానికి  మేము బృందాన్ని సిద్ధం చేసి పెట్టుకోవాలి. కాబట్టి ఎంపిక ప్రక్రియను ప్రారంభిస్తాం..’ అని బీసీసీఐకి చెందిన ఒక అధికారి తెలిపాడు.  ఈ ఎంపికలోనే కోహ్లీని వన్డేలకు కెప్టెన్ గా కొనసాగిస్తారా..? లేదా..? అనే విషయం తేలిపోనుంది.  

ఆటగాడిగానే గాక సారథిగా కూడా విజయవంతమైన కోహ్లీ.. ఐసీసీ ఈవెంట్లలో మాత్రం తేలిపోతున్నాడు. అతడి సారథ్యంలో భారత్ ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా నెగ్గలేదు.  ఇటీవలే ముగిసిన  టీ20 ప్రపంచకప్ లో కూడా భారత జట్టు సెమీస్ చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఇదే ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఐసీసీ తొలి టెస్టు ప్రపంచ ఛాంపియన్షిప్ లో కూడా న్యూజిలాండ్ చేతిలో ఓడింది. 

click me!