రెండో టెస్టులో అతడ్ని తప్పించి సిరాజ్ ను ఆడించాలి.. వాళ్లిద్దర్నీ ఇప్పుడే తీసేస్తే అది ప్రమాదమే : వసీం జాఫర్

By team teluguFirst Published Dec 1, 2021, 4:40 PM IST
Highlights

India Vs New Zealand: టీమిండియా-న్యూజిలాండ్ మధ్య ఈనెల 3 నుంచి 7 దాకా ముంబై వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో  భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. తదుపరి టెస్టులో టీమిండియా కూర్పుపై ఆసక్తికర  వ్యాఖ్యలు చేశాడు. 

విరాట్ కోహ్లి సారథ్యంలోని టీమిండియా (Team India).. న్యూజిలాండ్ (New Zealand) తో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (World Test Championship) లో భాగంగా జరుగుతున్న  రెండు టెస్టుల సిరీస్ లో  ఇటీవలే ముగిసిన కాన్పూర్ మ్యాచ్ డ్రా అయిన విషయం తెలిసిందే.  డిసెంబర్ 3-7 మధ్య ముంబైలో రెండో టెస్టు జరుగనున్నది.  ఒక్క వికెట్ తేడాతో తొలి టెస్టులో విజయం దూరం కాగా.. ఈసారి మాత్రం కివీస్ కు ఆ అవకాశమివ్వొద్దని టీమిండియా (Team India) భావిస్తున్నది.  ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. అయితే ఈ మ్యాచ్ కు  పేసర్ ఇషాంత్ శర్మ (Ishant Sharma) బదులు  హైదరాబాద్ ఆటగాడు మహ్మద్ సిరాజ్ (Mohammad Siraj) ను ఎంపిక చేయాలని  టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. 

Wasim jaffer మాట్లాడుతూ.. ఇషాంత్ శర్మ స్థానంలో సిరాజ్ ను ఆడిస్తే బావుంటుందని తెలిపాడు. కాన్పూర్ టెస్టులో ఆడిన ఇషాంత్.. ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. న్యూజిలాండ్ తో రోహిత్ శర్మ సారథ్యంలో జరిగిన టీ20 సిరీస్ తొలి మ్యాచ్ ఆడిన సిరాజ్..  గాయంతో తర్వాత రెండు మ్యాచుల నుంచి విరామం తీసుకున్నాడు. తొలి  టెస్టులో  సిరాజ్ ను ఆడిస్తారని  అనుకున్నా అనూహ్యంగా ఉమేశ్, ఇషాంత్ లు చోటు దక్కించుకున్నారు. అయితే ముంబై టెస్టులో మాత్రం సిరాజ్ ను ఆడిస్తేనే  టీమిండియాకు మేలని జాఫర్ అన్నాడు.అంతేగాక.. కాన్పూర్ టెస్టులో విఫలమైన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ను తప్పించి.. అతడి  స్థానంలో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాతో ఓపెనింగ్ చేయించాలని జాఫర్ సూచించాడు.

ఇప్పుడే వద్దు..  

ఇక తొలి టెస్టులో విఫలైమన సీనియర్లు ఛతేశ్వర్ పుజారా,  అజింక్యా రహానే లను ఇప్పుడే జట్టు నుంచి తప్పించాల్సిన అవసరం లేదని జాఫర్ అభిప్రాయపడ్డాడు.  రాబోయే  కొద్దిరోజుల్లో దక్షిణాఫ్రికా పర్యటన ఉన్న నేపథ్యంలో  సీనియర్లపై వేటు వేయడం సరికాదన్నాడు. వారిని తప్పించడం అని డిమాండ్ చేయడం తొందరపాటు చర్య అని అన్నాడు. సౌతాఫ్రికా టూర్ ముగిసిన తర్వాత ఎవరిని కొనసాగించాలి..? ఎవరిని తప్పించాలన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశముందని జాఫర్ పేర్కొన్నాడు. 

సాహా స్థానంలో భరత్..?

టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా రెండో టెస్టుకు దూరం కానున్నాడా..? మెడనొప్పి గాయంతో  ఇబ్బందిపడుతున్న సాహా..  ముంబై టెస్టుకల్లా కోలుకునే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. తొలి  టెస్టులో కూడా సాహా.. మెడనొప్పి గాయం కారణంగా కీపింగ్ కు రాకపోవడంతో అతడి  స్థానంలో ఆంధ్రా కుర్రాడు కెఎస్ భరత్ వచ్చాడు.  అయితే  మరో రెండ్రోజుల్లో  ప్రారంభం కాబోయే రెండో టెస్టుకల్లా సాహా సిద్ధం కాకుంటే.. ఆ స్థానంలో భరత్ ను ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే దీనిపై కెప్టెన్ కోహ్లీ, కోచ్ ద్రావిడ్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 

click me!