Team India in Finals: వరల్డ్ కప్ ఫైనల్‌లోకి టీమిండియా గ్రాండ్ ఎంట్రీ! పోరాడి ఓడిన న్యూజిలాండ్...

By Chinthakindhi Ramu  |  First Published Nov 15, 2023, 10:29 PM IST

గత ప్రపంచ కప్ సెమీస్‌లో పరాజయానికి ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా.. 7 వికెట్లు తీసిన మహ్మద్ షమీ.. 


భారీ అంచనాలతో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీని మొదలెట్టిన భారత క్రికెట్ జట్టు, ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మొదటి సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 70 పరుగుల తేడాతో గెలిచింది భారత్. గత ప్రపంచ కప్ సెమీస్‌లో న్యూజిలాండ్ చేతుల్లో 18 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా, నాలుగేళ్ల తర్వాత ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్టైంది.. 397 పరుగుల లక్ష్యఛేదనలో న్యూజిలాండ్, 48.5 ఓవర్లలో 327 పరగులకి ఆలౌట్ అయ్యింది. 

398 పరుగుల భారీ లక్ష్యఛేదనలో న్యూజిలాండ్‌కి ఆరంభంలోనే షాక్ తగిలింది. 15 బంతుల్లో 3 ఫోర్లతో 13 పరుగులు చేసిన డివాన్ కాన్వేని అవుట్ చేసిన మహ్మద్ షమీ, ఆ తర్వాతి ఓవర్‌లో రచిన్ రవీంద్రను పెవిలియన్ చేర్చాడు. 39 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్..

Latest Videos

undefined

కెప్టెన్ కేన్ విలియంసన్, డార్ల్ మిచెల్ కలిసి మూడో వికెట్‌కి 181 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 73 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 69 పరుగులు చేసిన కేన్ విలియంసన్‌ని అవుట్ చేసిన మహ్మద్ షమీ, టీమిండియాకి బ్రేక్ అందించాడు..

అదే ఓవర్‌లో టామ్ లాథమ్‌ని డకౌట్ చేశాడు మహ్మద్ షమీ. గ్లెన్ ఫిలిప్స్, డార్ల్ మిచెల్ కలిసి ఐదో వికెట్‌కి 75 పరుగులు జోడించారు. 33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులు చేసిన గ్లెన్ ఫిలిప్స్‌ని జస్ప్రిత్ బుమ్రా అవుట్ చేశాడు. మార్క్ చాప్‌మన్ 2 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

119 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లతో 134 పరుగులు చేసిన డార్ల్ మిచెల్ కూడా మహ్మద్ షమీ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. న్యూజిలాండ్ టాపార్డర్‌లో ఐదుగురు బ్యాటర్లు మహ్మద్ షమీ బౌలింగ్‌లో అవుట్ కావడం విశేషం.. మిచెల్ సాంట్నర్ 9, టిమ్ సౌథీ 9 పరుగులు, లూకీ ఫర్గూసన్ 6 పరుగులు చేసి అవుట్ అయ్యారు.  మహ్మద్ షమీ 7 వికెట్లు తీసి అదరగొట్టాడు. 

అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా, 397/4 పరుగుల భారీ స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో 50వ సెంచరీ చేయగా శ్రేయాస్ అయ్యర్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేశారు. రోహిత్ శర్మ 47, శుబ్‌మన్ గిల్ 80, కెఎల్ రాహుల్ 39 పరుగులు చేశారు. 

click me!