రెండో వన్డేకి ముందు టీమిండియాకి షాక్... స్లో ఓవర్ రేటు కారణంగా భారీ జరిమానా...

By Chinthakindhi RamuFirst Published Jan 20, 2023, 1:23 PM IST
Highlights

స్లో ఓవర్ రేటు కారణంగా టీమిండియా మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత... షెడ్యూల్ సమయం కంటే 3 ఓవర్లు తక్కువగా వేసిన భారత జట్టు... 

శ్రీలంకతో వన్డే సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా, ప్రస్తుతం న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆడుతోంది. హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో భారత జట్టు 12 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా టీమిండియా మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధిస్తున్నట్టు ప్రకటించింది ఐసీసీ...

ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లో 2.22 ఆర్టికల్ ప్రకారం నిర్ణీత సమయం‌లో ఓవర్లు పూర్తి చేయలేకపోతే షెడ్యూల్ టైమ్ ముగిసిన తర్వాత వేసే ఒక్కో ఓవర్‌కి 20 శాతం జరిమానా పడుతుంది. భారత జట్టు ఏకంగా 3 ఓవర్లు తక్కువగా వేయడంతో 60 ఫైన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది ఐసీసీ...

భారత ప్లేయర్లు, కోచ్‌లతో పాటు సహాయక సిబ్బంది మ్యాచ్ ఫీజులో కూడా ఈ కోత పడనుంది. ఇంతకుముందు గత డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో 80 శాతం మ్యాచ్ ఫీజు ఫైన్‌గా చెల్లించింది టీమిండియా. నెల రోజుల గ్యాప్‌లో టీమిండియాకి రెండోసారి భారీ ఫైన్ పడడం విశేషం.. 


యంగ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ డబుల్ సెంచరీతో చెలరేగడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరు చేసింది... భారీ లక్ష్యఛేదనలో 131 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్... భారత జట్టుకి భారీ విజయం దక్కడం ఖాయం అనుకుంటున్న సమయంలో మైకెల్ బ్రాస్‌వెల్, మిచెల్ సాంట్నర్ కలిసి అద్భుతంగా పోరాడారు.

ఈ ఇద్దరూ ఏడో వికెట్‌కి రికార్డు స్థాయిలో 162 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ జోడిని విడదీసేందుకు టీమిండియా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు...

మహ్మద్ సిరాజ్ 10 ఓవర్లలో 2 మెయిడిన్లతో 46 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా మహ్మద్ షమీ 10 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 69 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు...

అయితే హార్ధిక్ పాండ్యా 7 ఓవర్లలో ఏకంగా 70 పరుగులు సమర్పించాడు. శార్దూల్ ఠాకూర్ 7.2 ఓవర్లలో 54 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. 45 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 57 పరుగులు  చేసిన మిచెల్ సాంట్నర్‌ని మహ్మద్ సిరాజ్ అవుట్ చేయడంతో మ్యాచ్ మళ్లీ టీమిండియా వైపు మళ్లింది...

అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో దూకుడు ఏ మాత్రం తగ్గించని బ్రాస్‌వెల్, భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. 78 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్సర్లతో 140 పరుగులు చేసిన మైకెల్ బ్రాస్‌వెల్‌ని శార్దూల్ ఠాకూర్ ఆఖరి ఓవర్‌లో ఎల్బీడబ్ల్యూ చేయడంతో భారత జట్టుకి 12 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం దక్కింది...  మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారం, రాయిపూర్‌లో రెండో వన్డే జరగనుంది. 

click me!