తండ్రి అడుగుజాడల్లో ద్రావిడ్ కొడుకు.. కర్నాటక టీమ్ కెప్టెన్‌గా నియామకం..

By Srinivas MFirst Published Jan 20, 2023, 12:09 PM IST
Highlights

భారత్ కు సుదీర్ఘకాలం పాటు క్రికెటర్ గా సేవలందించి  ప్రస్తుతం హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రావిడ్  కొడుకు.. తండ్రి బాటలోనే నడుస్తున్నాడు. రాహుల్ ఇద్దరు కొడుకులూ  క్రికెట్ నే కెరీర్ గా ఎంచుకున్నారు. 

టీమిండియా హెడ్ కోచ్  రాహుల్ ద్రావిడ్  కు ఇద్దరు కొడుకులు.   పెద్ద కొడుకు సమిత్ తో పాటు  చిన్న కుమారుడు అన్వయ్  కూడా  క్రికెట్ నే కెరీర్ గా ఎంచుకున్నాడు.   తాజాగా అతడు అండర్ -14 జట్టుకు  సారథిగా నియమితుడయ్యాడు. ఓ ఇంటర్ జోనల్  అండర్ - 14 టోర్నీకి   అతడు కర్నాటక జట్టుకు సారథిగా వ్యవహరించనున్నాడు. కొంతకాలంగా   జూనియర్ స్థాయిలో విశేషంగా రాణిస్తున్న అన్వయ్.. తాజాగా కెప్టెన్ గా కూడా నియమితుడయ్యాడు. 

ద్రావిడ్ మాదిరిగానే అన్వయ్ కూడా.. వికెట్ కీపర్ బ్యాటరే.  సమిత్ కూడా  క్రికటర్ గా రాణిస్తున్నాడు. అతడు  2019-20 సీజన్లలో  అండర్ - 14 స్థాయిలో రెండు డబుల్ సెంచరీ లు చేసి  రాణించాడు. ఇక అన్వయ్ కూడా బ్యాటర్ గా రాణిస్తూనే  వికెట్ల వెనుక  కీపర్ గానూ రాణిస్తున్నాడు. 

టీమిండియాలో మెరుగైన వికెట్ కీపర్ లేని  కాలంలో  ద్రావిడ్ చాలాకాలం పాటు  భారత జట్టుకు  ఆ లోటును పూడ్చాడు. ధోని గ్లవ్స్ అందుకునేదాకా టీమిండియాకు వికెట్ కీపర్ తో పాటు బ్యాటర్ గా ద్రావిడ్ ఎనలేని సేవలు అందించాడు.  తాజాగా అన్వయ్  కూడా తండ్రి బాటలోనే నడుస్తుండటం గమనార్హం. అయితే అన్వయ్ కూడా  ద్రావిడ్ మాదిరిగానే    జాతీయ జట్టులోకి వచ్చి  తండ్రి రికార్డులు బద్దలుకొడుతాడా..? అనేది కాలమే తేల్చాలి.  జూనియర్ క్రికెట్ తర్వాత దేశవాళీలో రాణించి క్రమంగా  జాతీయ జట్టుకు ఎంపిక కావాల్సి ఉంటుంది.  దీని గురించి ఇప్పుడే మాట్లాడటం అతిశయోక్తే.. 

 

Anvay Dravid, ‘s younger son to lead U-14 team in the inter zonal tournament (South Zone) pic.twitter.com/ynvwtbLN6G

— Manuja (@manujaveerappa)

ఇక ద్రావిడ్ విషయానికొస్తే..  క్రికెట్ నుంచి తప్పుకున్నాక  కొన్నాళ్లు బీసీసీఐతో కలిసి నడిచిన అతడు.. తర్వాత ఎన్సీఏ హెడ్ గా వ్యవహరించాడు.  భారత్ ‘ఏ’ జట్టును  తీర్చిదిద్దాడు.  ప్రస్తుతం టీమిండియాలో ఉన్న  శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, పృథ్వీ షా వంటి స్టార్ ప్లేయర్లు  ద్రావిడ్   ఆధ్వర్యంలో రాటుదేలినవాళ్లే..  ఎన్సీఏలో  ద్రావిడ్ డెడికేషన్ చూసిన బీసీసీఐ, అతడిని జాతీయ జట్టుకు హెడ్ కోచ్ గా నియమించింది.  కీలకమైన ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ లలో పరాజయాలు మినహా  ద్రావిడ్ మెరుగైన పనితీరును కనబరుస్తున్నాడు. ప్రస్తుతం అతడు న్యూజిలాండ్ తో భారత్ ఆడుతున్న వన్డే సిరీస్ లో భాగంగా రాయ్‌పూర్ లో ఉన్నాడు. 

click me!