
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ తో పాటు జాతీయ కోచ్ లు తమను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ గత రెండ్రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన సాగిస్తున్న రెజ్లర్లు పోరును ఉధృతం చేస్తున్నారు. అయితే రెజ్లర్లు ఆందోళన సాగిస్తున్న రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తాజాగా ఫేస్‌బుక్ వేదికగా ఆసక్తికర పోస్టు చేశారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారో నేటి (శుక్రవారం) సాయంత్రం మీడియా ముందు వెల్లడిస్తానని పేర్కొన్నారు.
రెజ్లర్ల ఆరోపణల నేపథ్యంలో బ్రిజ్ భూషణ్ తన ఫేస్‌బుక్ లో ఓ పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన.. ‘ఈ కుట్ర వెనుక ఎవరున్నారు..? ఎంపీ (బ్రిజ్ భూషణ్) అసలు విషయాన్ని బయటపెట్టనున్నాడు..’ అని పేర్కొన్నాడు. యూపీలోని గోండా జిల్లా నవాబ్‌గంజ్ లో గల రెజ్లింగ్ ట్రైనింగ్ సెంటర్ లో సాయంత్రం నాలుగు గంటలకు రావాలని మీడియా ప్రతినిధులకు సూచించారు.
లైంగిక వేధింపులతో పాటు పలువురు రెజ్లర్లకు బ్రిజ్ భూషణ్ తో పాటు ఆయన అనుచరుల నుంచి ప్రాణ హానీ ఉందని బాధితులు వాపోతున్న నేపథ్యంలో ఆయన ఏం చెబుతారో...? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వినేశ్ పోగట్ తొలి రోజు బ్రిజ్ భూషణ్ మీద చేసిన ఆరోపణల సమయంలో ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆమె ఆరోపిస్తున్నవన్నీ అవాస్తవాలేనని, ఈ కుట్ర వెనుక ఓ బడా పారిశ్రామికవేత్త ఉన్నాడని తెలిపారు. రెజ్లర్లు చేసిన ఆరోపణలు నిజమని తేలితే తాను ఉరివేసుకుంటానని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో నేటి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు బ్రిజ్ భూషణ్ వ్యవహార తీరుపై కూడా విమర్శలు వస్తున్నాయి. గతంలో ఆయన ఓ సభలో దురుసు ప్రవర్తన, పలు ఇంటర్వ్యూలలో చేసిన మాటలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
ఇదిలాఉండగా.. రెండ్రోజులుగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లు గురువారం కేంద్ర క్రీడాశాఖల మంత్రి అనురాగ్ ఠాకూర్ ను కలిశారు. వినేశ్ పోగట్, భజరంగ్ పునియా, సాక్షి మాలిక్, రవి దహియా వంటి అగ్రశ్రేణి అథ్లెట్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నిరసన విరమించాలని అనురాగ్ కోరినా.. రెజ్లర్లు మాత్రం డబ్ల్యూఎఫ్ఐని రద్దు చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకునేదాకి పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. కాగా, రెజ్లర్ల ఆందోళన నేపథ్యంలో నిన్న కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కూడా డబ్ల్యూఎప్ఐకి 72 గంటల డెడ్ లైన్ విధించి ఆలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించిన విషయం తెలిసిందే..