Cricketer S Sreesanth: స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు విషయంలో ఉత్తర కేరళ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రముఖ భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు రాజీవ్ కుమార్, వెంకటేశ్ కినిలపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.
Sreesanth booked in cheating case: ప్రపంచ ఛాంపియన్ ప్లేయర్, టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఎస్. శ్రీశాంత్ మళ్లీ చిక్కుల్లో పడ్డాడు. కేరళ పోలీసులు శ్రీశాంత్‌తో పాటు మరో ఇద్దరిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. కన్నూర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 420 కింద శ్రీశాంత్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో శ్రీశాంత్‌ను మూడో నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు.
ఎందుకీ కేసు.. ?
శ్రీశాంత్ పై నమోదైన చీటిగ్ కేసు మొత్తం వ్యవహారం క్రికెట్ అకాడమీకి సంబంధించినదని పోలీసులు తెలిపారు. కేరళలోని కన్నూర్ జిల్లా చుండా నివాసి సరీష్ గోపాలన్.. నిందితులు రాజీవ్ కుమార్, వెంకటేష్ కినిలు ఏప్రిల్ 25, 2019 నుండి ఇప్పటివరకు తన నుంచి మొత్తం రూ.18.70 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. రాజీవ్, వెంకటేష్ కర్ణాటకలోని కొల్లూరులో స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తామనీ, అందులో భారత మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ కూడా భాగస్వామిగా ఉంటారని పేర్కొన్నారు. తనకు కూడా ఆ అకాడమీలో భాగస్వామి అయ్యే అవకాశం రావడంతో ఆ డబ్బును పెట్టుబడి పెట్టినట్లు గోపాలన్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.
వివాదాలు మధ్య శ్రీశాంత్‌పై నిషేధం..
క్రికెటర్ ఎస్. శ్రీశాంత్ గతంలో కూడా వివాదాల్లో చిక్కుకున్నాడు. ఐపీఎల్ 2013లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఎస్. శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం పడింది. కానీ 2020 సంవత్సరంలో, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) అంబుడ్స్‌మన్ అతనిపై విధించిన నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గించారు. దీని తర్వాత, కేరళకు దేశవాళీ క్రికెట్‌లో పునరాగమనంతో మళ్లీ శ్రీశాంత్ సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం శ్రీశాంత్ లెజెండ్స్ లీగ్ క్రికెట్ (LLC) 2023లో పాల్గొంటున్నాడు.
ప్రపంచ ఛాంపియన్ కీలక ప్లేయర్ గా..
ఎస్. శ్రీశాంత్ 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్‌లలో విజేతగా నిలిచిన భారత జట్టులో సభ్యునిగా ఉన్నాడు. 2007 T20 ప్రపంచ కప్ ఫైనల్‌లో, మిస్బా-ఉల్-హక్ అద్భుతమైన క్యాచ్‌ను శ్రీశాంత్ పట్టుకున్నాడు.. దీనిని భారత అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. శ్రీశాంత్ భారత్ తరఫున 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20ల్లో పాల్గొన్నాడు. ఈ సమయంలో అతను మొత్తం 169 వికెట్లు తీశాడు.
శ్రీశాంత్ ఐపీఎల్ రికార్డు ఇలా..
ఎస్ శ్రీశాంత్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. దీని తర్వాత అతను కొచ్చి టస్కర్స్, రాజస్థాన్ రాయల్స్ (RR) తరఫున ఆడాడు. శ్రీశాంత్ 44 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 29.9 సగటుతో 40 వికెట్లు పడగొట్టాడు.