సరిలేరు నీకెవ్వరూ... మరో ప్రపంచ రికార్డు బద్దలుగొట్టిన కోహ్లీ

By Arun Kumar PFirst Published Aug 15, 2019, 4:33 PM IST
Highlights

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగుల దాహానికి మరో ప్రపంచ రికార్డు బద్దలయ్యింది. అంతర్జాతీయ క్రికెట్లో దిగ్గజాలకు సైతం సాధ్యంకాని రికార్డును కోహ్లీ సొంతం చేసుకున్నాడు.   

టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వెస్టిండిస్ తో జరిగిన చివరి వన్డేలో మరో అద్భుత సెంచరీ బాదిన అతడు ఆసిస్ మాజీ క్రికెటర్ రికీ పాటింగ్ రికార్డును బద్దలుగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఓ దశాబ్దకాలంలో అత్యధిక పరుగులు సాధించిన ఘనతను అతడు కైవసం చేసుకున్నాడు. ప్రస్తుత క్రికెటర్లలో కోహ్లీ రికార్డుకు దరిదాపుల్లో కూడా ఏ క్రికెటర్ లేడు. 

అంతర్జాతీయ క్రికెట్లోని టెస్ట్, వన్డే, టీ20 పార్మాటన్నింటిలో కోహ్లీ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఫార్మాట్ ఏదైనా సరే కోహ్లీ బ్యాట్ నుండి పరుగుల వరద పారడం ఖాయం. ఇలా అతడు గత దశాబ్దకాలంగా ఏకంగా 20018 పరుగులను పూర్తిచేసుకున్నాడు. 2008 సంవత్సరంలో వన్డే, 2010 లో టెస్ట్, టీ20లో కోహ్లీ ఆరంగేట్రం చేశాడు.  అతడు అంతర్జాతీయ కెరీర్ మొత్తంలో 20505 పరుగులను పూర్తి చేసుకోగా కేవలం గత పది సంవత్సరాల్లోనే 20018 పరుగులు సాధించడం విశేషం. అంతకు ముందు అతడు కేవలం 484 పరుగులు మాత్రమే చేశాడు. 

ఇలా ఓ దశాబ్దకాలంలో 20వేల పైచిలుకు పరుగులు సాధించిన ఏకైక క్రికెటర్ గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా క్రికెటర్ రికీ పాటింగ్ ఓ దశాబ్దకాలంలో 18,962 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఇదే ప్రపంచ రికార్డు. ఆ రికార్డును వెస్టిండిస్ తో సాధించిన సెంచరీ ద్వారా కోహ్లీ బద్దలుగొట్టాడు. అంతేకాకుండా 20వేల పరుగుల క్లబ్ లో చేరిన ఏకైక క్రికెటర్ గా నిలిచాడు. 

ఇలా ఓకే దశాబ్దంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సౌతాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ కలిస్ 16777 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు. శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల  జయవర్ధనే 16304, కుమార సంగక్కర 15999 పరుగులతో నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్సచిన్ టెండూల్కర్ నిలిచాడు. 15962 పరుగులతో అతడు ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు.  

వెస్టిండిస్ తో జరిగిన మూడు వన్డేల సీరిస్ లో భాగంగా జరిగిన చివరి వన్డేలో కోహ్లీ (114 పరుగుల) సెంచరీ బాది టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. దీంతో భారత జట్టు 2-0 తో వన్డే సీరిస్ ను క్లీన్ స్వీప్ చేసింది. ఇలా  కోహ్లీ మెన్ ఇన్ బ్లూ ఖాతాలో మరో సీరిస్ విజయాన్ని వేయడంతో పాటు తన ఖాతాలోనూ ఓ అరుదైన రికార్డును వేసుకున్నాడు. 

 

click me!