లడక్ లో ధోని పంద్రాగస్ట్ వేడుకలు... సైనికులతో ఆత్మీయ సమ్మేళనం

By Arun Kumar PFirst Published Aug 15, 2019, 2:46 PM IST
Highlights

భారత జట్టు మాజీ కెప్టెన్, ఆర్మీ గౌరవ లెప్టినెంట్ కల్నల్ మహేంద్ర సింగ్  ధోని పంద్రాగస్టు వేడుకలు లడక్ లో జరుపుకున్నాడు. ఈ సందర్భంగా అతడు సైనికులతో ఆత్మీయంగా గడిపాడు.  

టీమిండియా సీనియర్ ప్లేయర్, మాజీ కెప్టెన్  మహేంద్ర సింగ్ ధోని దేశభక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తానెంతో ఇష్టపడే క్రికెట్ ను కూడా వదులుకుని దేశ రక్షణ కోసం పనిచేయాలన్న అతడి సంకల్పానికి ప్రతి భారతీయుడు ఫిదా అయిపోయారు. సురక్షితమైన ప్రాంతంలో కాకుండా ఎప్పుడూ కల్లోలంగా వుండే జమ్మూ కశ్మీర్ లో సైనిక విధులు నిర్వహించాలనుకోవడం అతడి సంకల్పం ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఇలా దేశంకోసం ఎంతో చేస్తున్న అతడిని సాదరంగా గౌరవించాలని భారత ప్రభుత్వం, ఆర్మీ ఉన్నతాధికారులు భావించినట్లున్నారు. అందుకోసమే ఇటీవలే కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన లడక్ లో త్రివర్ణ పతాకదారణ చేసే అవకాశాన్ని ధోనికి   కల్పించారు.  

ధోని 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం లడక్ లో జరుపుకున్నాడు. గౌరవ లెప్టినెంట్ కల్నల్ హోదాలో కశ్మీర్ లోయలో విధులు నిర్వహిస్తున్న అతడు ఉన్నతాధికారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. పారాచూట్ రెజిమెంట్ కు చెందిన తన బృందంతో కలిసి బుధవారం ధోని లడక్ కు చేరుకున్నాడు. అక్కడ ధోని బృందానికి ఘన స్వాగతం లభించింది. 

ఇక ఇవాళ(గురువారం) ఉదయం ధోని స్వాతంత్ర్య దినోత్సవ  వేడుకల్లో పాల్గొన్నాడు. ఉమ్మడి జమ్మూ కశ్మీర్ రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి లడక్  లో మువ్వనెల జెండాను ధోని ఎగరవేశాడు. తోటి సైనికులతో కలిసి అతడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. 

జెండా ఆవిష్కరణ అనంతరం ధోని నేరుగా  ఆర్మీ జనరల్ ఆస్పత్రికి  చేరుకున్నాడు. అక్కడ చికిత్స పొందుతున్న సైనికులు, వారి కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించాడు. వారికి మిఠాయిలు పంచి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇలా ధోని ఉదయం నుండి లడక్ పంద్రాగస్టు వేడుకల్లో బిజీబిజీగా  గడిపాడు.  


 

click me!