ఆసియా కప్ ఫైనల్లో మంచి ఊపుమీదుండి వరుసగా వికెట్లు తీస్తున్న సిరాజ్ తో 10 ఓవర్ల పూర్తి కోటా బౌలింగ్ చేయించలేకపోవడంపై కెప్టెన్ రోహిత్ వివరణ ఇచ్చారు.
కొలంబో : శ్రీలంకను వారి స్వదేశంలోనే మట్టికరిపించి ఆసియా కప్ 2023 టోర్నీ విజేతగా నిలిచింది టీమిండియా. కొలంబో ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఫైనల్లో మొదట బ్యాటింగ్ కు దిగిన ఆతిథ్య లంకతో యువ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఓ ఆటాడుకున్నాడు. కేవలం 7 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన అతడు ఆరు వికెట్లు పడగొట్టాడు. అయితే అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న సమయంలో మిగతా మూడు ఓవర్లు వేయనివ్వకుండా సిరాజ్ ను పక్కనపెట్టారు. పూర్తి కోటా బౌలింగ్ చేసివుంటే అతడికి మరిన్ని వికెట్లు దక్కేవని క్రికెట్ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. కానీ సిరాజ్ తో పూర్తి కోటా బౌలింగ్ చేయించకుండా టీమిండియా ట్రయినర్ అడ్డుకున్నారని రోహిత్ వెల్లడించారు.
ఆసియా కప్ ఫైనల్ ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీమిండియా గెలుపులో బౌలర్ సిరాజ్ కీలక పాత్ర పోషించారంటూ కొనియాడారు. అతడు భారత దేశానికి లభించిన కొత్త హీరోగా రోహిత్ అభివర్ణించాడు. ఒకే ఓవర్ లో నాలుగు వికెట్లు తీసిన సిరాజ్ మొత్తంగా ఏడు ఓవర్లలో ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇలా సిరాజ్ బాల్ తో విజృంభిస్తూ ప్రత్యర్థి జట్టును ముప్పుతిప్పలు పెడుతున్నా పూర్తి కోటా ( 10 ఓవర్లు) బౌలింగ్ చేయించలకపోయామని రోహిత్ తెలిపారు.
వరుసగా వికెట్లు పడగొట్టి మంచి జోరుమీదున్న సిరాజ్ తో పూర్తి కోటా బౌలింగ్ చేయించాలని తాను భావించినట్లు కెప్టెన్ రోహిత్ తెలిపారు. అయితే అతడు ఏడు ఓవర్లు పూర్తిచేయగానే తనకు టీమిండియా ట్రయినర్ నుండి ఇక సిరాజ్ తో బౌలింగ్ వేయించవద్దని సందేశం వచ్చిందన్నారు. దీంతో తనకు ఇష్టంలేకపోయినా, మంచి ఊపుమీదున్న సిరాజ్ ను పక్కనపెట్టాల్సి వచ్చిందన్నారు రోహిత్.
Read More కేవలం ఒక్క పదం 'క్లాస్'...: బౌలర్ సిరాజ్ పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు
వన్డే ప్రపంచ కప్ 2023 నేపథ్యంలోనే సిరాజ్ ను ఆసియా కప్ ఫైనల్లో పూర్తి కోటా బౌలింగ్ చేయించలేదని రోహిత్ తెలిపారు. ఒకే స్పెల్ లో ఏడు ఓవర్లు వేయించడం చాలా ఎక్కువ... అందువల్లే అతడిపై ఒత్తిడి పెంచకూడదనే టీమిండియా కోచింగ్ విభాగం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. అందువల్లే ఏడు ఓవర్లు వేసిన తర్వాత సిరాజ్ ను పక్కనపెట్టినట్లు కెప్టెన్ రోహిత్ వివరించారు.
నిన్న(ఆదివారం) జరిగిన ఆసియా కప్ ఫైనల్్లో ఆతిథ్య శ్రీలంకను రోహత్ సేన మట్టికరిపించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక టాప్ ఆర్డర్ సిరాజ్ దెబ్బకు విలవిల్లాడిపోయింది. తాను వేసిన రెండో ఓవర్లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టిన సిరాజ్ మొత్తం ఆరు వికెట్లతో కెరీర్ లోనే ఉత్తమ గణాంకాలను నమోదు చేసుకున్నాడు. . సిరాజ్ మ్యాజిక్ బౌలింగ్ ముందు నిలవలేక లంక జట్టు కేవలం 15.2 ఓవర్లలో కేవలం 50 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టీమిండియా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే స్వల్ప లక్ష్యాన్ని చేధించి ఆసియా కప్ 2023 విజేతగా నిలిచింది.