నన్ను బుమ్రాతో పోల్చాడు.. రెచ్చిపోయి బౌలింగ్ చేశా: దీపక్ చాహర్

By sivanagaprasad KodatiFirst Published Nov 12, 2019, 2:40 PM IST
Highlights

కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలతో పాటు హ్యాట్రిక్ వికెట్లు తీసిన చాహర్ టీమిండియా సిరీస్‌ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు

నాగ్‌పూర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి టీ20 నుంచి దీపక్ చాహర్ పేరు మారుమోగిపోతోంది. కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలతో పాటు హ్యాట్రిక్ వికెట్లు తీసిన చాహర్ టీమిండియా సిరీస్‌ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను గెలుచుకున్నాడు.

అయితే లక్ష్యఛేదన సందర్భంగా బంగ్లాదేశ్ బ్యాటింగ్ సమయంలో మిథున్, నయిమ్ విజృంభించడంతో ఒక దశలో పర్యాటక జట్టు పటిష్ట స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ బంతిని చాహర్‌కు అప్పగించాడు.

ఈ సమయంలో రోహిత్ అతనికి ఒకే ఒక్క విషయం చెప్పాడట. ‘‘కీలక ఓవర్లలో నువ్వు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ఇవాళ్టీకి నువ్వే మా బుమ్రావి అని చెప్పడంతో.. ఆ మాటలే తనలో స్ఫూర్తిని కలిగించాయని దీపక్ చెప్పాడు.

Also Read:sourav ganguly: గంగూలీ పదవీ కాలం పొడిగించనున్నారా..?

తనపై కెప్టెన్ పెట్టిన బాధ్యతను ఎప్పుడూ గౌరవంగానే భావిస్తానని.. ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా తన వంతు పాత్రను పోషిస్తానని వెల్లడించాడు. నిజంగా మనం వారి నమ్మకాన్ని నిలబెట్టకపోతే మనపై మనకే చెడు భావన కల్గుతుందని దీపక్ పేర్కొన్నాడు. ఈ క్రమంలో రోహిత్ చెప్పిన మాటలు తనకు బాధ్యతను కలిగించాయని వెల్లడించాడు.

కాగా.. బంగ్లాదేశ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన నిర్ణయాత్మక చివరి టీ20లో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు పేసర్ దీపక్ చాహర్. హ్యాట్రిక్‌తో పాటు ఆరు వికెట్లను తన ఖాతాలో వేసుకుని సరికొత్త గణాంకాలను నమోదు చేశాడు.

మ్యాచ్ అనంతరం చాహర్ మీడియాతో మాట్లాడుతూ.. తానెప్పుడూ ఈ తరహా ప్రదర్శన చేస్తానని కలలో కూడా అనుకోలేదని.. కాకపోతే తన కష్టానికి తగిని ఫలితం వచ్చిందని హర్షం వ్యక్తం చేశాడు. తన చిన్నతనం నుంచి క్రికెట్‌లో రాణించడం కోసం శ్రమిస్తూనే ఉన్నానని.. అందుకు ఫలితం ఇన్నాళ్లకు వచ్చిందేమోనని తెలిపాడు.

కాగా.. ఈ మ్యాచ్‌లో ఒకదశలో బంగ్లాదేశ్‌తో ఓడిపోయి సిరీస్‌ సైతం కోల్పోయే స్థితిలో భారత్ నిలిచింది. 43 బంతుల్లో 65 పరుగులు చేస్తే గెలిచే స్థితిలో నిలిచిన బంగ్లాను దీపక్ చాహర్ ఓడించాడు. దీపక్ చాహర్ తన తొలి ఓవర్లో 2 వికెట్లు తీసి 1 పరుగు మాత్రమే ఇచ్చాడు.

కొంత విరామం తర్వాత మళ్లీ కీలకమైన మిథున్ వికెట్ తీయడంతో పాటు నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. 18వ ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన దీపక్.. షఫీయుల్ వికెట్‌ను.. చివరి ఓవర్ తొలి రెండు బంతులకు ముస్తఫిజుర్, అమీనుల్‌ను పెవిలియన్‌కు చేర్చి హ్యాట్రిక్ సాధించాడు.

Also Readధోనీ వల్లే ఇదంతా... ఆనందంలో మునిగితేలుతున్న చాహర్ తండ్రి

తద్వారా భారత్ తరపున అంతర్జాతీయ టీ20ల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా సిరీస్ మొత్తంలో 10.2 ఓవర్లు వేసి 56 పరుగులు ఇచ్చి 8 వికెట్లు తీశాడు. తద్వారా చివరి టీ20లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డుతో పాటు మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌ అవార్డులను గెలుచుకున్నాడు. 

click me!