
మొదటి టీ20లో 150 పరుగుల లక్ష్యాన్ని కొట్టలేక 4 పరుగుల తేడాతో ఓడిన భారత జట్టు, సిరీస్ నిలవాలంటే తప్పక గెలవాల్సిన నాలుగో టీ20లో దుమ్మురేపి చితక్కొట్టింది. 179 పరుగుల భారీ లక్ష్యాన్ని యంగ్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్ కలిసి బాదేశారు.. 2-2 తేడాతో సిరీస్‌ని సమం చేసేసింది భారత జట్టు. దీంతో ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు, సిరీస్ విజేతగా నిలవనుంది.
రెండో టీ20 ఆడుతున్న యశస్వి జైస్వాల్, బౌండరీతో ఇన్నింగ్స్‌ని ఆరంభించాడు. తొలి ఓవర్‌లో 2 ఫోర్లు బాదిన యశస్వి జైస్వాల్, జాసన్ హోల్డర్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో 3 ఫోర్లు బాదాడు. ఆరంభంలో నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన శుబ్‌మన్ గిల్, ఓడియన్ స్మిత్ బౌలింగ్‌లో 6, 6, 4 బాది 16 పరుగులు రాబట్టాడు..
ఈ ఇద్దరూ కలిసి వెస్టిండీస్ బౌలర్లపై బౌండరీలతో దండెత్తడంతో 7 ఓవర్లలోనే 100 పరుగులకు చేరుకుంది టీమిండియా స్కోరు. మొదటి 3 టీ20ల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన శుబ్‌మన్ గిల్, 30 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు..
రెండో టీ20 ఆడుతున్న యశస్వి జైస్వాల్, 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్‌గా టీమిండియా తరుపున టీ20ల్లో హాఫ్ సెంచరీ చేసిన నాలుగో అతి పిన్న వయస్కుడు యశస్వి జైస్వాల్. యశస్వి జైస్వాల్ వయసు ప్రస్తుతం 21 ఏళ్ల 227 రోజులు కాగా రోహిత్ శర్మ, తిలక్ వర్మ, రిషబ్ పంత్ అంత కంటే తక్కువ వయసులోనే టీ20 హాఫ్ సెంచరీలు చేశారు.
అయితే ఓపెనర్‌గా టీ20 హాఫ్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడు యశస్వియే. 62 పరుగుల వద్ద శుబ్‌మన్ గిల్ ఎల్బీడబ్ల్యూగా అవుటైనట్టు అంపైర్ ప్రకటించినా రివ్యూ తీసుకున్న భారత జట్టుకి అనుకూలంగా ఫలితం వచ్చింది. తొలి వికెట్‌కి 165 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత శుబ్‌మన్ గిల్ వికెట్ కోల్పోయింది టీమిండియా..
47 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 77 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, రొమారియో షెఫర్డ్ బౌలింగ్‌లో షై హోప్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే అప్పటికే 27 బంతుల్లో 14 పరుగులు చేయాల్సిన స్థితికి చేరుకుంది భారత జట్టు..
టీ20ల్లో టీమిండియాకి ఇది రెండో అత్యుత్తమ భాగస్వామ్యం. గత ఏడాది దీపక్ హుడా- సంజూ శాంసన్ కలిసి 176 పరుగుల భాగస్వామ్యం జోడించి టాప్‌లో ఉన్నారు. మొదటి వికెట్‌కి ఇది హైయెస్ట్ భాగస్వామ్యం. ఇంతకుముందు శ్రీలంకపై రోహిత్ శర్మ- కెఎల్ రాహుల్ జోడించిన 165 పరుగుల భాగస్వామ్యాన్ని సమం చేశారు యశస్వి జైస్వాల్- శుబ్‌మన్ గిల్..
యశస్వి జైస్వాల్ 51 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 84 పరుగులు చేయగా తిలక్ వర్మ 5 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేశాడు. 17 ఓవర్లలోనే ఒకే ఒక్క వికెట్ కోల్పోయి 179 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది టీమిండియా..
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 178 పరుగుల స్కోరు చేయగలిగింది. కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్‌లో 2 వికెట్లు తీసినా అర్ష్‌దీప్ సింగ్‌కి 3 వికెట్లు దక్కినా సిమ్రాన్ హెట్మయర్ హాఫ్ సెంచరీ, షై హోప్ మెరుపులతో భారీ స్కోరు చేయగలిగింది వెస్టిండీస్..
29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు చేసిన షై హోప్, యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేసిన సిమ్రాన్ హెట్మయర్, అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఆఖరి ఓవర్‌లో అవుట్ అయ్యాడు.