
ఫ్లోరిడాలో జరుగుతున్న నాలుగో టీ20లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 178 పరుగుల స్కోరు చేయగలిగింది. కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్‌లో 2 వికెట్లు తీసినా అర్ష్‌దీప్ సింగ్‌కి 3 వికెట్లు దక్కినా సిమ్రాన్ హెట్మయర్ హాఫ్ సెంచరీ, షై హోప్ మెరుపులతో భారీ స్కోరు చేయగలిగింది వెస్టిండీస్..
అక్షర్ పటేల్‌తో ఓపెనింగ్ ఓవర్ వేయించాడు హార్ధిక్ పాండ్యా. తొలి ఓవర్‌లో అక్షర్ పటేల్ 14 పరుగులు ఇవ్వగా అర్ష్‌దీప్ సింగ్ వేసిన రెండో ఓవర్‌లో కైల్ మేయర్స్ అవుట్ అయ్యాడు. 7 బంతుల్లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 17 పరుగులు చేసిన కైల్ మేయర్స్, సంజూ శాంసన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు..
16 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు చేసిన బ్రెండన్ కింగ్ కూడా అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. పవర్ ప్లే తర్వాత బౌలింగ్‌కి వచ్చిన కుల్దీప్ యాదవ్, తన మొదటి ఓవర్‌లోనే 2 వికెట్లు తీసి వెస్టిండీస్‌ని దెబ్బ తీశాడు. 3 బంతుల్లో 1 పరుగు చేసిన నికోలస్ పూరన్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. టీ20ల్లో కుల్దీప్ బౌలింగ్‌లో అవుట్ కావడం పూరన్‌కి ఇది నాలుగోసారి.
3 బంతుల్లో 1 పరుగు చేసిన రోవ్‌మన్ పావెల్ కూడా కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. 54/1 స్కోరుతో ఉన్న వెస్టిండీస్, 7 బంతుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయి 57/4 స్థితికి చేరుకుంది. ఈ దశలో షై హోప్, సిమ్రాన్ హెట్మయర్ కలిసి ఐదో వికెట్‌కి 49 పరుగుల భాగస్వామ్యం జోడించారు..
29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు చేసిన షై హోప్, యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన రొమారియో షెఫర్డ్, ఆ తర్వాతి బంతికే అవుట్ అయ్యాడు. 4 బంతుల్లో 3 పరుగులు చేసిన జాసన్ హోల్డర్‌ని ముకేశ్ కుమార్ క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో వైపు సిమ్రాన్ హెట్మయర్ 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హెట్మయర్‌కి ఇది నాలుగో టీ20 హాఫ్ సెంచరీ. 39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేసిన సిమ్రాన్ హెట్మయర్, అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఆఖరి ఓవర్‌లో అవుట్ అయ్యాడు.
20వ ఓవర్ మొదటి బంతికి సిక్సర్ బాదిన హెట్మయర్, తర్వాతి బంతికి కూడా అదే రకమైన షాట్ ఆడాడు. బౌండరీ లైన్ దగ్గర తిలక్ వర్మ, డైవ్ చేస్తూ అద్భుత క్యాచ్ అందుకుని... హెట్మయర్‌ని పెవిలియన్ చేర్చాడు.. ఓడియన్ స్మిత్ ఓ సిక్సర్, అకీల్ హుస్సేన్ ఓ ఫోర్ బాదడంతో చివరి ఓవర్‌లో 17 పరుగులు వచ్చాయి.