
వెస్టిండీస్ టూర్‌లో టీ20 సిరీస్ ఓటమి తర్వాత భారత జట్టు ఘనంగా రీఎంట్రీ ఇచ్చింది. ఐర్లాండ్ టూర్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లో గెలిచి, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. 186 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 20 ఓవర్లు బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్, 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. 33 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం అందుకుంది.
186 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఐర్లాండ్‌కి మూడో ఓవర్‌లోనే డబుల్ షాక్ తగిలింది. కెప్టెన్ పాల్ స్టిర్లింగ్‌ని డకౌట్ చేసిన ప్రసిద్ధ్ కృష్ణ, లోర్కన్ టక్కర్‌ని కూడా డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. 7 పరుగులు చేసిన హారీ టెక్టర్‌ని, 18 పరుగులు చేసిన కర్టీస్ కంపార్‌ని రవి భిష్ణోయ్ అవుట్ చేశాడు.
13 పరుగులు చేసిన జార్జ్ డాక్‌రెల్ రనౌట్ అయ్యాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో కుదురుకుపోయిన ఓపెనర్ ఆండ్రూ బాల్బరీన్ 51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 72 పరుగులు చేసి అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో సంజూ శాంసన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
2 పరుగులు చేసిన మెక్‌కార్తీని అవుట్ చేసిన జస్ప్రిత్ బుమ్రా, 15 బంతుల్లో 3 సిక్సర్లతో 23 పరుగులు చేసిన మార్క్ అదైర్‌ని కూడా పెవిలియన్ చేర్చాడు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, రవి భిష్ణోయ్, జస్ప్రిత్ బుమ్రా రెండేసి వికెట్లు తీయగా అర్ష్‌దీప్ సింగ్‌కి ఓ వికెట్ దక్కింది.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 185 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది.. 11 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 18 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్, విల్ యంగ్ బౌలింగ్‌లో కాంపర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన తిలక్ వర్మ, మొదటి బంతికి సింగిల్ తీసి రెండో బంతికి భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. జోషువా లిటిల్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో 4, 4, 4, 6 బాదిన సంజూ శాంసన్ 18 పరుగులు రాబట్టాడు. 26 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 40 పరుగులు చేసిన సంజూ శాంసన్, బెంజమిన్ వైట్ బౌలింగ్‌లో వికెట్లపైకి షాట్ ఆడి అవుట్ అయ్యాడు..
మరో ఎండ్‌లో ఇన్నింగ్స్ నిర్మించడానికి సమయం తీసుకున్న రుతురాజ్ గైక్వాడ్, 39 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 43 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 58 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్.. బరీ మెక్‌కార్తీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులు చేసిన రింకూ సింగ్, మార్క్ అదైర్ బౌలింగ్‌లో విల్ యంగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. శివమ్ దూబే 16 బంతుల్లో 2 సిక్సర్లతో 22 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.