ఆలస్యమైందని... రెండో టీ20లో టీమిండియా తొందరపాటు, విండీస్ ముందు ఈజీ టార్గెట్...

By Chinthakindhi RamuFirst Published Aug 2, 2022, 12:46 AM IST
Highlights

India vs West Indies 2nd T20I: ఆరు వికెట్లు తీసి భారత జట్టుకి దెబ్బ తీసిన ఓబెడ్ మెక్‌కాయ్... 138 పరుగులకి టీమిండియా ఆలౌట్... 

షెడ్యూల్ కంటే మూడు గంటలు ఆలస్యమైందనేమో రెండో టీ20లో భారత బ్యాటర్లు ఆవేశపడ్డారు. వచ్చినవాళ్లు వచ్చినట్టు భారీ షాట్లు ఆడాలని ప్రయత్నించి వరుసగా పెవిలియన్‌కి క్యూ కట్టారు. దీంతో మ్యాచ్ ఆలస్యమైనా భారత జట్టు తొందరపాటు కారణంగా పూర్తిగా 20 ఓవర్ల పాటు కూడా తొలి ఇన్నింగ్స్ సాగలేదు. 19.4 ఓవర్లలో 138 పరుగులకి ఆలౌట్ అయ్యింది టీమిండియా... 

ఇన్నింగ్స్ మొదటి బంతికే కెప్టెన్ రోహిత్ శర్మను ఓబెడ్ మెక్‌కాయ్ అవుట్ చేశాడు. టీ20ల్లో రోహిత్ శర్మకి ఇది 8వ గోల్డెన్ డకౌట్. టీ20 మ్యాచ్‌లో తొలి బంతికే డకౌట్ అయిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు రోహిత్ శర్మ. ఇంతకుముందు శ్రీలంకపై పృథ్వీ షా ఇలా గోల్డెన్ డకౌట్ అయ్యాడు...

టీ20ల్లో గోల్డెన్ డకౌట్ అయిన రెండో భారత కెప్టెన్‌‌గానూ చెత్త రికార్డు నెలకొల్పాడు రోహిత్ శర్మ.ఇంతకుముందు శిఖర్ ధావన్‌పై 2021 శ్రీలంక పర్యటనలో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. రోహిత్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ 5 బంతుల్లో పరుగులేమీ చేయలేకపోవడంతో మొదటి ఓవర్‌ 0/1గా ముగిసింది...

రెండో ఓవర్‌లో సిక్సర్‌ బాది స్కోరు బోర్డును తెరిచిన సూర్యకుమార్ యాదవ్ 6 బంతుల్లో 11 పరుగులు చేసి ఓబెడ్ మెక్‌కాయ్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు...

11 బంతుల్లో ఓ సిక్సర్‌తో 10 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, అల్జెరీ జోసఫ్ బౌలింగ్‌లో అవుట్ కాగా 12 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 24 పరుగులు చేసిన రిషబ్ పంత్, అకీల్ హుస్సేన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో 61 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది భారత జట్టు...

హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా కలిసి కాసేపు వికెట్ల పడకుండా అడ్డుకోగలిగారు. 31 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 31 పరుగులు చేసిన హర్ధిక్ పాండ్యాని జాసన్ హోల్డర్ అవుట్ చేయగా 30 బంతుల్లో ఓ సిక్సర్‌తో 27 పరుగులు చేసిన రవీంద్ర జడేజా కూడా ఓబెడ్ మెక్‌కాయ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

మెరుపులు మెరిపిస్తాడని ఆశపడిన దినేశ్ కార్తీక్ 7 పరుగులు, రవిచంద్రన్ అశ్విన్ 6 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు, భువనేశ్వర్ 1 పరుగు చేసి ఓబెడ్ మెక్‌కాయ్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరారు. 4 బంతుల్లో ఓ సిక్సర్‌తో 8 పరుగులు చేసిన ఆవేశ్ ఖాన్‌ని క్లీన్ బౌల్డ్ చేసిన జాసన్ హోల్డర్... భారత జట్టు ఇన్నింగ్స్‌‌కి తెరదించాడు.

4 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 17 పరుగులు మాత్రమే ఇచ్చిన ఓబెడ్ మెక్‌కాయ్ 6 వికెట్లు తీసి కెరీర్ బెస్ట్ గణాంకాలను నమోదు చేశాడు... భారత జట్టుపై టీ20ల్లో 5+ వికెట్లు తీసిన మొట్టమొదటి బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు ఓబెడ్ మెక్‌కాయ్.. 

click me!