
కామన్వెల్త్ క్రీడలలో 24 ఏండ్ల తర్వాత తొలిసారి ప్రవేశపెట్టిన క్రికెట్ పోటీలలో ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు సెమీస్ కు ప్రవేశించింది. ఆదివారం బార్బడోస్ తో మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా.. ఆ జట్టును చిత్తుగా ఓడించి సెమీస్ కు చేరింది. ఆసీస్ స్పిన్నర్ అలానా కింగ్ ధాటికి 20 ఓవర్లలో 64 పరుగులకే కుప్పకూలింది. తర్వాత ఆసీస్.. స్వల్ప లక్ష్యాన్ని 8.1 ఓవర్లలోనే ఛేదించింది.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన బార్బడోస్ కు కంగారూలు చుక్కలు చూపించారు. బార్బడోస్ ఓపెనర్ డాటిన్ (22 బంతుల్లో 8) క్రీజులో నిలదొక్కుకునేందుకే ఇబ్బంది పడింది. ఆమెను అలానా కింగ్.. ఎల్బీడబ్ల్యూ గా వెనక్కి పంపింది. కెప్టెన్ హేలీ మాథ్యూస్.. (13 బంతుల్లో 18, 4 ఫోర్లు) ధాటిగా ఆడినా ఆమె కూడా ఎక్కువసేపు నిలువలేకపోయింది. వీళ్లిద్దరూ తప్ప బార్బడోస్ ఇన్నింగ్స్ లో చెప్పుకోవడానికేం లేదు.
మాథ్యూస్ తర్వాత వచ్చిన ఏ ఒక్క బ్యాటర్ కూడా రెండంకెల స్కోరును చేయలేదు. మూడో స్థానం నుంచి పదో నెంబర్ వరకు బార్బడోస్ ఆటగాళ్ల స్కోర్లను ఒకసారి చూస్తే.. 9, 5, 8, 0, 8, 0, 0, 2, 1 గా ఉన్నాయి. అదీగాక ఓపెనర్ల తర్వా త బార్బడోస్ జట్టులో ఏ ఒక్కరూ బంతిని బౌండరీ దాటించలేదంటే ఆ జట్టు ఎంత దరిద్రంగా ఆడిందో అర్థం చేసుకోవచ్చు.
ఇక స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్.. 8.1 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. ఆ జట్టు ఓపెనర్ అలీసా హీలీ (23 నాటౌట్), మెగ్ లానింగ్ (36 నాటౌట్) లు త్వరగా ఆసీస్ కు విజయాన్ని అందించారు.
తాజా విజయంతో ఆసీస్.. గ్రూప్-ఏలో టాప్ లో నిలిచింది. భారత్, ఆస్ట్రేలియా, బార్బడోస్, పాకిస్తాన్ లతో కూడిన ఈ గ్రూప్ లో ఆడిన రెండు మ్యాచుల్లో విజయం సాధించిన ఆసీస్.. నాలుగు పాయింట్లతో పాటు మంచి నెట్ రన్ రేట్ తో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో ఆ జట్టు సెమీస్ కు అర్హత సాధించింది. ఇదే గ్రూప్‌లో భారత్, బార్బోడస్ జట్లు ఒక విజయం, ఒక పరాజయంతో రెండేసి పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఒక్క మ్యాచ్ కూడా గెలవని పాకిస్తాన్ నాలుగో స్థానంలో ఉంది. ఇండియా తమ తర్వాతి మ్యాచ్ లో బార్బడోస్ (ఈనెల 3న) తో పోటీ పడనుంది. ఆ మ్యాచ్‌లో గెలిచిన వాళ్లు సెమీస్‌కు అర్హత సాధిస్తారు.