Virat Kohli: అయినా.. కోహ్లి మారలేదు.. ఆతని ఆట మారలేదు.. ‘విరాట్’ పర్వం ముగిసినట్టేనా..?

Published : Apr 26, 2022, 10:33 PM IST
Virat Kohli: అయినా.. కోహ్లి మారలేదు.. ఆతని ఆట మారలేదు.. ‘విరాట్’ పర్వం ముగిసినట్టేనా..?

సారాంశం

TATA IPL 2022: ఒక్క మ్యాచ్ లో ఆడకుంటే ఫర్వాలేదంటారు. రెండు మ్యాచులు విఫలమైతే అదృష్టం బాగోలేదంటారు. మూడు, నాలుగు, ఐదు.. ఇలా సీజన్ అంతా అదే అద్వాన్న ఆటతీరుతో విసుగు తెప్పిస్తే ఏమంటారు..? 

సందేహం లేదు.  దిగ్గజాలు సూచిస్తున్న తరుణం వచ్చినట్టుంది.  ఈ సీజన్ నుంచి ఎంత త్వరగా తప్పుకుని  విశ్రాంతి తీసుకుంటే ఆర్సీబీ మాజీ సారథి కోహ్లికి అంత మంచిది. లేకుంటే ‘విరాట్’ పర్వం ముగింపు దశకు చేరుకోవడం తథ్యం..! ఒక్కటా.. రెండా.. మూడా..? వరుసగా సీజన్ (ఇప్పటిరకు 9 మ్యాచులు ఆడాడు) అంతా విఫలమవుతుంటే ఏమనాలి..?  ఒకప్పుడు ఐపీఎల్ అంటేనే పూనకం వచ్చినోడిలా ఆడే ఆ పరుగుల యంత్రం ఇప్పుడు పట్టుమని పది పరుగులు చేయడానికి నానా తంటాలు పడుతోంటే ఏం చేయాలి..? వరుసగా మ్యాచుల్లో  అదే పనిగా విఫలమవుతుంటే.. ఇంటా బయటా విమర్శలు వస్తుంటే.. బాధ్యతతో ఆడాల్సిన ఆటగాడు  బాధ్యతారాహిత్యంగా ఆడుతూ ఔటైతే ఏమనాలి..? 

లక్నో సూపర్ జెయింట్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచులలో విరాట్ కోహ్లి డకౌట్ అయ్యాడు. కోహ్లిని ఇన్నాళ్లు మెచ్చుకున్నోళ్లు, అతడిపై సానుభూతి చూపినోళ్లకు కూడా అతడి ఆటతీరు చూసి ‘ఇదేం ఆటరా దేవుడా..’ అనుకున్నారు. పరిస్థితి గమనించిన ఆర్సీబీ యాజమాన్యం  కోహ్లిని తిరిగి ఓపెనర్ గా పంపించింది. 

ఓపెనర్ గా తోపు రికార్డు.. 

ఐపీఎల్ లో ఓపెనర్ (ఒకటి, రెండు స్థానాలలో) గా కోహ్లికి ఘనమైన రికార్డు ఉంది.  76 ఇన్నింగ్స్ (రాజస్తాన్ తో మ్యాచ్ కు ముందు) లలో 43.7 సగటుతో 2,750 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 18 హాఫ్ సెంచరీలు, 5 సెంచరీలు కూడా ఉన్నాయి.  2016లో కోహ్లి నమోదు చేసిన పరుగుల సునామీ (973) అతడు ఓపెనర్ గా బరిలోకి దిగిందే. అయితే ఈ సీజన్ లో వరుసగా విఫలమవుతుందడటంతో అతడిని తిరిగి ఓపెనర్ గా బరిలోకి దింపింది ఆర్సీబీ. 

 

సర్వత్రా విమర్శలు ఎదుర్కుంటున్న కోహ్లి.. ఈ మ్యాచ్ లో అయినా ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడతాడని, అదీగాక తనకు ఇష్టమైన ఓపెనర్ గా కూడా వస్తుండటంతో కాస్త మెరుగవుతాడని భావించారు. కానీ ఫలితం.. గత మ్యాచుల మాదిరిగానే రిపీట్ అయింది.  తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు కొట్టి ఊపు మీద కనిపించిన కోహ్లి.. ప్రసిద్ కృష్ణ వేసిన రెండో ఓవర్లో  నాలుగో బంతికి రియాన్ పరాగ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఔటయ్యాక కూడా కోహ్లి ముఖంలో గత రెండు మ్యాచులలో కనిపించిన  నవ్వే.. ఏం చేయలేని నిస్సహయత. 

ఐపీఎల్ లో విరాట్ కోహ్లి : 

- ఆడిన మ్యాచులు : 216 
- పరుగులు : 6,411 
- సెంచరీలు : 5
- హాఫ్ సెంచరీలు : 42
- సగటు : 36. 58 
- డకౌట్లు : 8 (ఇందులో 2 ఈ సీజన్ లోవే..)

గత ఆరు సీజన్లలో కోహ్లి విధ్వంసం : 

- 2016లో  16 మ్యాచులలో 81.08 సగటుతో 973 పరుగులు (4 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు) 
- 2017లో 10 మ్యాచులలో 308 పరుగులు.. సగటు 30.80  (4 ఫిఫ్టీలు)
- 2018లో 14  మ్యాచులలో  48.18 సగటుతో 530.. (4 అర్థ శతకాలు) 
- 2019లో 14 మ్యాచులలో 33 సగటుతో 464 రన్స్ (1 సెంచరీ, 2 ఫిఫ్టీలు) 
- 2020లో 15 మ్యాచులలో  466 రన్స్.. (3 హాఫ్ సెంచరీలు) 
- 2021లో 15 మ్యాచులలో 405 రన్స్.. (3 హాఫ్ సెంచరీలు)

ఈ సీజన్ లో ఆడిన 9 మ్యాచులలో కోహ్లి చేసిన స్కోర్లివి : 

- 41నాటౌట్ (పంజాబ్ పై) 
- 12 (కేకేఆర్) 
- 5 (రాజస్తాన్) 
- 48 (ముంబై) 
- 1 (సీఎస్కే) 
- 12 (ఢిల్లీ) 
- 0 (లక్నో) 
- 0 (ఎస్ఆర్హెచ్) 
- 9 (రాజస్తాన్) 

మొత్తం : 128 పరుగులు. ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. గత సీజన్ తో కలుపుకుని కోహ్లి హాఫ్ సెంచరీ చేయక 14 ఇన్నింగ్స్ లు ముగిశాయి. ఇక  అంతర్జాతీయ క్రికెట్ లో  కోహ్లి సెంచరీ చేయక 101 ఇన్నింగ్స్ లు  అయిపోయాయి. 

 

కోహ్లి తాజా వైఫల్యాలు అతడు తీరిక లేని క్రికెట్ ఆడుతుండం వల్లే వస్తున్నాయని, అతడు వీలైనంత త్వరగా రెస్ట్ తీసుకువాలని రవిశాస్త్రి, గవాస్కర్ వంటి పలువురు సీనియర్ క్రికెటర్లు సూచిస్తున్నారు. మరి కోహ్లి వాళ్ల మాటను గౌరవించి కొన్ని రోజులు తప్పుకుంటాడా..? లేక ఇవే తప్పులు చేస్తూ  ఇంకా తన అభిమానుల క్షోభకు కారణమౌతాడా..?  అనేది తేలాల్సి ఉంది. ఐపీఎల్ సంగతి పక్కనబెట్టినా  కోహ్లి ఇదే ప్రదర్శన కంటిన్యూ చేస్తే  అది భారత జట్టు పై తీవ్ర ప్రభావం పడనుందనేది గత కొన్నాళ్లుగా టీమిండియా అభిమానులు నెత్తీ నోరు కొట్టుకుని మొత్తుకుంటున్న విషయం. అయినా.. కోహ్లి మారతాడా..? అతడి ఆట మారుతుందా..?  సమాధానం కాలానికే వదిలేద్దాం. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !