IPL 2022: బట్లర్ బాదుడు లేదు + శాంసన్ మెరవలేదు = రాజస్తాన్ రాణించలేదు.. ఆర్సీబీ ముందు ఈజీ టార్గెట్

Published : Apr 26, 2022, 09:19 PM ISTUpdated : Apr 26, 2022, 09:20 PM IST
IPL 2022: బట్లర్  బాదుడు లేదు + శాంసన్ మెరవలేదు = రాజస్తాన్ రాణించలేదు.. ఆర్సీబీ ముందు ఈజీ టార్గెట్

సారాంశం

TATA IPL 2022 RCB vs RR: ఈ సీజన్ లో బట్లర్ బాదకుంటే, శాంసన్ మెరవకుంటే ఏమవుతుందో ఏమవుతుందో రాజస్తాన్  రాయల్స్ బ్యాటర్స్ కు తెలిసొచ్చింది. వీళ్లిద్దరూ విఫలమైన చోట  ఆ జట్టు బ్యాటర్లు బొక్కబోర్లా పడ్డారు. ఆర్సీబీ బౌలర్లు  అద్భుతంగా బౌలింగ్ చేశారు. 

ఈ సీజన్ లో అత్యధిక పరుగులు (499) చేసిన  ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న జోస్ బట్లర్ వైఫల్యం ఆ జట్టుపై ఎంతగా ప్రభావం చూపుతుందో రాజస్తాన్ రాయల్స్ ఆటగాళ్లకు తెలిసినట్టుంది.  గత రెండు మ్యాచులలో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో దూసుకుపోతున్న బట్లర్ ఆటలు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ లో సాగలేదు. సీజన్ లో అతడికి తోడుగా పలు అదిరిపోయే ఇన్నింగ్స్ లు ఆడుతున్న ఆ జట్టు సారథి సంజూ శాంసన్ కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. ఆఖర్లో మెరుస్తాడనుకున్న షిమ్రన్ హెట్మెయర్ కూడా మెరవలేదు. ఫలితం..  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్తాన్ బ్యాటింగ్ లో రాణించలేదు. నిర్ణీత 20 ఓవర్లలో  ఆ జట్టు.. 8 వికెట్ల నష్టానికి 144  పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆర్సీబీ 145 పరుగులు చేయాల్సి ఉంది.

ఆర్సీబీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ కు వచ్చిన  రాజస్తాన్ రాయల్స్..   రెండో ఓవర్లోనే  ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (7) వికెట్ ను కోల్పోయింది.   మహ్మద్ సిరాజ్ వేసిన రెండో ఓవర్లో తొలి బంతికే సిక్సర్  కొట్టిన  పడిక్కల్.. అదే ఓవర్లో నాలుగో బంతికి ఎల్బీడబ్ల్యూ గా వెనుదిరిగాడు. 

పడిక్కల్ నిష్క్రమించిన తర్వాత  అనూహ్యంగా అశ్విన్ (17) ను క్రీజులోకి పంపింది రాజస్తాన్. సిరాజ్ వేసిన అదే ఓవర్లో రెండు వరుస బౌండరీలు బాదిన అశ్విన్..  అతడే వేసిన  నాలుగో ఓవర్లో కూడా అదే రిపీట్ చేశాడు. కానీ  అదే ఓవర్లో ఆఖరి బంతికి సిరాజ్ కే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లో బట్లర్ (8) కూడా మిడాన్ లో ఉన్న  సిరాజ్ కు క్యాచ్ ఇచ్చి  నిష్క్రమించాడు. 5 ఓవర్లు ముగిసేసరికి  రాజస్తాన్.. 3 వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది. 

ఆ క్రమంలో సంజూ శాంసన్ (21 బంతుల్లో 27.. 1 ఫోర్, 3 సిక్సర్లు) కాస్త  ధాటిగా ఆడి స్కోరు బోర్డును పెంచే ప్రయత్నం చేశాడు. డారిల్ మిచెల్ (16) తో కలిసి నాలుగో వికెట్ కు 35 పరుగులు  జోడించాడు. హసరంగ వేసిన ఆరో ఓవర్లో 4, 6 కొట్టి ఊపుమీద కనిపించిన శాంసన్.. షాబాజ్ అహ్మద్ వేసిన 8వ ఓవర్లో కూడా రెండు సిక్సర్లు బాదాడు. కానీ హసరంగ వేసిన 10వ ఓవర్ మూడో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

 

ఇక ఆ తర్వాత  రాజస్తాన్ ఇన్నింగ్స్ లో రియాన్ పరాగ్ (31 బంతుల్లో 56.. 3 ఫోర్లు, 4 సిక్సర్లు) తప్ప చెప్పుకోవడానికి పెద్దగా ఏమీలేదు.  రావడమే సిక్సర్ బాది  ఆట ఆరంభించిన  పరాగ్.. కాస్త ఆదుకున్నాడు.  15వ ఓవర్లో మిచెల్ నిష్క్రమించాక వచ్చిన హెట్మెయర్ (3) మెరుపులు మెరిపిస్తాడనుకుంటే అతడు కూడా నిలువలేదు. అదీగాక ప్రధాన బ్యాటర్లంతా పెవిలియన్ చేరడంతో రాజస్తాన్ స్కోరు కూడా ముందుకు సాగలేదు. 13 వ ఓవర్ నుంచి 18వ ఓవర్ వరకు రాజస్తాన్ 24 పరుగులు మాత్రమే చేసింది. బౌల్ట్ (5), ప్రసిధ్ కృష్ణ (2) కూడా  రాణించలేకపోయారు.  ఆఖర్లో పరాగ్ కాస్త బ్యాట్  ఝుళిపించడంతో ఆ మాత్రం స్కోరైనా దక్కింది. హర్షల్ పటేల్ వేసిన 20వ ఓవర్లో పరాగ్.. 4, 2, 6, 6 బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడమే గాక జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. 

ఆర్సీబీ బౌలర్లలో  మహ్మద్ సిరాజ్, జోష్ హెజిల్వుడ్, వనిందు హసరంగ లు తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు. హర్షల్ పటేల్ కు ఒక వికెట్ దక్కింది.

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !