IPL 2022: ఆర్సీబీ కథ అయిపోలేదు.. గుజరాత్ పై అలవోక విజయం.. ఇక ఆశలన్నీ ముంబై మీదే..

By Srinivas MFirst Published May 19, 2022, 11:29 PM IST
Highlights

TATA IPL 2022 RCB vs GT:  ఐపీఎల్-15 లో ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే  తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఆర్సీబీ ఆల్ రౌండ్ ఆటను ప్రదర్శించింది.   ముందు బౌలింగ్ లో ఆ తర్వాత బ్యాటింగ్ లో రాణించింది. 
 

ఐపీఎల్-15 లో ప్లేఆఫ్ ఆశలను ఆర్సీబీ సజీవంగా ఉంచుకుంది.  గుజరాత్ టైటాన్స్ ను అన్ని విభాగాల్లో కట్టడి చేసి అపూర్వ విజయాన్ని అందుకుంది. గుజరాత్ నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలుండగానే  ఛేదించింది.  కోహ్లి, డుప్లెసిస్, మ్యాక్స్వెల్ రాణించడంతో.. ఆ జట్టు గుజరాత్ ను 8 వికెట్ల తేడాతో ఓడించింది.  ఈ మ్యాచ్ విజయంతో పాయింట్ల పట్టికలో కూడా ఆర్సీబీ మళ్లీ నాలుగో స్థానానికి చేరింది. ఈ సీజన్ లో ప్లేఆఫ్స్ కు అర్హత సాధించిన తొలి జట్టుగా ఉన్న గుజరాత్ టైటాన్స్.. లీగ్ దశను మాత్రం  ఓటమితో ముగించింది. ఆ జట్టు 14 మ్యాచులలో 10 గెలిచి.. నాలుగు ఓడింది. 

మరోవైపు 14 మ్యాచులాడి 8 విజయాలతో 16 పాయింట్లు సాధించిన ఆర్సీబీ.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరినా  ఆ జట్టు  నెట్ రన్ రేట్ (-0.253) గా ఉంది.  అయితే ఆ జట్టు ప్లేఆఫ్  చేరాలంటే ముంబై-ఢిల్లీ మధ్య మే 21 న జరుగబోయే మ్యాచ్ లో ఢిల్లీ ఓడాలి. ఢిల్లీ  ప్రస్తుతం 13 మ్యాచులాడి 7 గెలిచి.. 14 పాయింట్లతో ఉంది.  కానీ ఆ జట్టు నెట్ రన్ రేట్ (+0.255)గా ఉంది. 

ఇక మెస్తారు లక్ష్య ఛేదనలో ఆర్సీబీ ఆది నుంచి పట్టుదలగా ఆడింది. ఎట్టి  పరిస్థితుల్లోనూ వికెట్లు కోల్పోకూడదనే లక్ష్యం తో ఆడిన ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లి (54 బంతుల్లో 73.. 8 ఫోర్లు, 2 సిక్సర్లు), డుప్లెసిస్ (38 బంతుల్లో 44.. 5 ఫోర్లు)  వీలు చిక్కినప్పుడల్లా మాత్రం  బౌండరీలు బాదారు.  విఫల ఫామ్ తో విమర్శలు ఎదుర్కుంటున్న విరాట్..  ఈ మ్యాచ్ లో ఎలాగైనా నిలిచి నిరూపించుకోవాలనే పట్టుదలతో ఆడాడు. 

షమీ వేసిన మూడో ఓవర్లో రెండు ఫోర్లు బాదిన కోహ్లి.. హార్ధిక్ వేసిన నాలుగో ఓవర్లో కూడా అదే సీన్ రిపీట్ చేశాడు. ఈ రెండు ఓవర్లలో డుప్లెసిస్ కూడా రెండు ఫోర్లు కొట్టాడు.  5 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ స్కోరు వికెట్ నష్టపోకుండా  49 పరుగులు. 

ఆ తర్వాత ఆర్సీబీ స్కోరు నెమ్మదించింది. రషీద్ ఖాన్ వేసిన పదో ఓవర్ తొలి బంతికి సిక్సర్  కొట్టిన కోహ్లి.. 33 బంతుల్లో హాఫ్  సెంచరీ సాధించాడు. ఈ సీజన్ లో కోహ్లికి ఇది రెండో ఫిఫ్టీ. ఈ రెండూ గుజరాత్ మీదే సాధించినవి కావడం గమనార్హం. 12 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ స్కోరు వంద పరుగులు దాటింది.  13వ ఓవర్లో.. నాలుగో బంతికి సింగిల్ తీయడం ద్వారా కోహ్లి ఐపీఎల్ లో 7వేల పరుగులు మైలురాయిని దాటాడు.

అయితే సాఫీగా లక్ష్యం వైపునకు సాగుతున్న ఆర్సీబీ ఇన్నింగ్స్ కు రషీద్ ఖాన్ వరుస షాక్ లు ఇచ్చాడు. అతడు వేసిన 15వ ఓవర్లో మూడో బంతికి డుప్లెసిస్ ను ఔట్ చేశాడు.  రషీద్.. ఆ తర్వాత ఓవర్లోనే కోహ్లిని కూడా పెవిలియన్ కు పంపాడు. 

మోత మోగించిన  మ్యాక్సీ.. 

వరుస రెండు వికెట్లు తీసిన ఆనందం గుజరాత్ కు ఎక్కువ కాలం నిలవలేదు. డుప్లెసిస్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన మ్యాక్స్వెల్ (18 బంతుల్లో 40.. 6 పోర్లు, 2 సిక్స్ లు).. సిక్సర్లు, ఫోర్లతో మోతెక్కించాడు.  హార్ధిక్ వేసిన 16వ ఓవర్లో 6, 4, 6 బాది లక్ష్యాన్ని సులభతరం చేశాడు.  ఇక ఫెర్గూసన్ వేసిన 19వ ఓవర్లో వరుస బంతుల్లో మూడు ఫోర్లు కొట్టి ఆర్సీబీకి విజయాన్ని అందించాడు.   

అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ ను ఆర్సీబీ బౌలర్లు కట్టడి చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్.. 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు మత్రమే చేయగలిగింది. ఆ జట్టులో హార్ధిక్ పాండ్యా (62 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిల్లర్ (34), సాహా (31) ఫర్వాలేదనిపించారు.
 

click me!