
ఐపీఎల్ గత సీజన్ రన్నరప్ ట్యాగ్ తో లీగ్ లో చెన్నైతో జరిగిన తొలి మ్యాచును అద్భుత విజయంతో సొంతం చేసుకున్న కోల్కతా నైట్ రైడర్స్ తమ రెండో మ్యాచులో మాత్రం చేతులెత్తేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన లో స్కోరింగ్ గేమ్ లో చివరివరకు ఉత్కంఠ రేగినా.. విజయం మాత్రం ఆర్సీబీకే దక్కింది. ఆ ఓటమిని మరిచి టోర్నీలో ముందుకు సాగేందుకు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని కేకేఆర్.. నేడు పంజాబ్ తో ఢీ కొడుతున్నది. మయాంక్ అగర్వాల్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్.. తొలి మ్యాచులో ఆర్సీబీ నిర్దేశించిన కొండంత లక్ష్యాన్ని అవలీలగా ఛేదించి జోరు కొనసాగించాలని చూస్తున్నది. ఈ రెండు జట్లు వాంఖెడే వేదికగా తలపడుతున్న మ్యాచులో కేకేఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమానంగా ఉన్నాయి. పంజాబ్ కు శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, భానుక రాజపక్స వంటి టాపార్డర్ బ్యాటర్లతో పాటు లియామ్ లివింగ్ స్టోన్, రాజ్ బవ లతో మిడిలార్డర్ కూడా పటిష్టంగా ఉంది. షారుక్ ఖాన్, ఒడియన్ స్మిత్ ల వంటి హిట్టర్లు కూడా పంజాబ్ సొంతం. గత మ్యాచులో పైన పేర్కొన్న ఆటగాళ్లలో ఒక్క రాజ్ బవ తప్ప మిగిలినవారంతా కీలక పాత్ర పోషించారు.
ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచులో బౌలింగ్ లో కాస్త తడబడిన పంజాబ్.. ఈ మ్యాచులో దానిని అధిగమించాలని భావిస్తున్నది. ఆర్సీబీ తో మ్యాచులో అర్షదీప్ సింగ్, ఒడియన్ స్మిత్, హర్ప్రీత్ బ్రర్ లు భారీగా పరుగులిచ్చుకున్నారు. అయితే ఈ మ్యాచులో ఆ జట్టుతో స్టార్ పేసర్ కగిసొ రబాడా కలుస్తుండటం శుభపరిణామం.
కోల్కతా విషయానికొస్తే.. తొలి మ్యాచులో ఫర్వాలేదనిపించిన వెంకటేశ్ అయ్యర్, అజింక్యా రహానే, నితీశ్ రాణాలు ఆర్సీబీతో మ్యాచులో తేలిపోయారు. శ్రేయస్ అయ్యర్ కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేదు. సామ్ బిల్లింగ్స్, ఆండ్రీ రసెల్ లు హిట్టింగ్ కు దిగితే పంజాబ్ కు చుక్కలే.
బౌలింగ్ లో ఆ జట్టు బలంగానే ఉంది. ఉమేశ్ యాదవ్ సూపర్ స్పెల్స్ తో అదరగొడుతున్నాడు. అతడికి తోడుగా సీనియర్ పేసర్ టిమ్ సౌథీ ఆకట్టుకుంటున్నాడు. స్పిన్ లో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. బౌలింగ్ ను మరింత పటిష్టం చేసేందుకు కేకేఆర్.. శివమ్ మావిని జట్టులోకి తీసుకుంది. షెల్డన్ జాక్సన్ కు విశ్రాంతినిచ్చింది.
ముఖాముఖి :
ఇరు జట్లు ఇప్పటివరకు 29 సార్లు పోటీ పడ్డాయి. ఇందులో కేకేఆర్ దే ఆధిక్యం. 19 మ్యాచులలో కోల్కతా గెలవగా.. 10 మ్యాచులలో పంజాబ్ ను విజయం వరించింది.
తుది జట్లు :
కోల్కతా నైట్ రైడర్స్ : వెంకటేశ్ అయ్యర్, అజింక్యా రహానే, నితీశ్ రాణా, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), సామ్ బిల్లింగ్స్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, టిమ్ సౌథీ, ఉమేశ్ యాదవ్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి
పంజాబ్ కింగ్స్ : మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, లియామ్ లివింగ్ స్టోన్, భానుక రాజపక్స, షారుఖ్ ఖాన్, ఒడియన్ స్మిత్, రాజ్ బవ, అర్షదీప్ సింగ్, హర్ప్రీత్ బ్రర్, కగిసొ రబాడ, రాహుల్ చాహర్