
ఐపీఎల్ లో మిగతా నగరాల మాదిరే తమ రాష్ట్రానికి చెందిన పేరు కూడా ఉండాలని కోరుకున్న ఉత్తరప్రదేశ్, గుజరాత్ అభిమానుల కల నెరవేరుతున్నది. యూపీ నుంచి లక్నో (లక్నో సూపర్ జెయింట్స్), గుజరాత్ నుంచి అహ్మదాబాద్ (గుజరాత్ టైటాన్స్) నగరాలకు చెందిన ఫ్రాంచైజీలు ఐపీఎల్ అడుగుపెట్టాయి. ఈ రెండూ జట్లే నేడు ముంబై లోని వాంఖెడే వేదికగా తలపడుతున్నాయి. ఐపీఎల్ లో ఘనమైన ఆరంభం కోసం ఎదురుచూస్తున్న ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచులో హార్థిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. జీటీ ఆహ్వానం మేరకు ఎల్ఎస్జీ జట్టు బ్యాటింగ్ కు రానుంది.
శనివారం ఆరంభ మ్యాచ్ (సీఎస్కే వర్సెస్ కేకేఆర్) లో భాగంగా ఇక్కడ తొలుత బౌలింగ్ చేసిన జట్టే గెలిచింది. దాంతో పాటు ఆదివారం ఢిల్లీ వర్సెస్ ముంబై, పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ తో మ్యాచులో కూడా తొలుత టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న జట్టునే విజయం వరించింది. మరి ఈ మ్యాచులో కూడా అదే ఫలితం రానుందా..?
ఐపీఎల్ లో సుమారు రూ. 12 వేల కోట్ల (లక్నో రూ. 7,090 కోట్లు, అహ్మదాబాద్ రూ. 5,625 కోట్లు)తో ఈ రెండు జట్లను దక్కించుకున్నాయి ఆర్పీఎస్జీ, సీవీసీ సంస్థలు. వేలంలో ఆటగాళ్ల కోసం కూడా దండిగానే ఖర్చు చేశాయి. వేలం కంటే ముందే రిటెన్షన్ ప్రక్రియలో లక్నో.. కెఎల్ రాహుల్ కు రూ. 17 కోట్లు చెల్లించి రిటైన్ చేసుకుంది. వీళ్లతో పాటు స్టాయినిస్ (రూ. 9.20 కోట్లు), రవి బిష్ణోయ్ (రూ. 4 కోట్లు)లను దక్కించుకుంది. మరోవైపు గుజరాత్ కూడా హార్థిక్ పాండ్యా ను రూ. 15 కోట్లతో రిటైన్ చేసుకుంది. ఇక పాండ్యాతో సమానంగా రషీద్ ఖాన్ కూ రూ. 15 కోట్లు చెల్లించగా.. శుభమన్ గిల్ కు రూ. 8 కోట్లు వెచ్చించింది.
ఇరుజట్లకు మెగా సీజన్ లో ఇదే తొలి మ్యాచ్ కావడంతో ఈ పోరు ఆసక్తికరంగా జరగడం ఖాయంగా కనిపిస్తున్నది. లక్నోకు కెఎల్ రాహుల్, ఎవిన్ లూయిస్, మనీష్ పాండే రూపంలో బ్యాటర్లు ఉన్నారు. దీపక్ హుడా, కృనాల్ పాండ్యాలు కూడా బ్యాటింగ్ చేసే సామర్థ్యమున్నవారే. ఇక బౌలింగ్ బాధ్యతలను అవేశ్ ఖాన్, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్ మోయనున్నారు.
గుజరాత్ గుబాళించేనా..?
హార్థిక్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ లో శుభమన్ గిల్ ఇన్నింగ్స్ ను ఓపెన్ చేయనున్నాడు. అతడికి తోడుగా మాథ్యూ వేడ్ రానున్నాడు. ఇక మూడు, నాలుగు స్థానాల్లో విజయ్ శంకర్, అభినవ్ మనోహర్ లు బ్యాటింగ్ కు రావొచ్చు. మిడిలార్డర్ లో హార్థిక్ పాండ్యా, రాహుల్ తెవాటియా, మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతున్నారు. బౌలింగ్ లో ఆ జట్టు లాకీ ఫెర్గూసన్, మహ్మద్ షమీ తో పాటు స్పిన్నర్ రషీద్ ఖాన్ మీదే భారీ ఆశలు పెట్టుకుంది.
తుది జట్లు :
గుజరాత్ టైటాన్స్ : శుభమన్ గిల్, మాథ్యూ వేడ్, విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, హార్థిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, వరుణ్ ఆరోన్, లాకీ ఫెర్గూసన్
లక్నో సూపర్ జెయింట్స్ : కెఎల్ రాహుల్ (కెప్టెన్) క్వింటన్ డికాక్, ఎవిన్ లూయిస్, మనీష్ పాండే, కృనాల్ పాండ్యా, దీపక్ హుడా, మోహ్సిన్ ఖాన్, అయుష్ బదోని, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, దుష్మంత చమీర