
వరుసగా రెండు మ్యాచులలో టాస్ ఓడాక కూడా విజయం సాధించిన జట్టుగా దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ తమ మూడో మ్యాచులో కూడా అదే తరహా విజయాన్ని అందుకోనుందా..? ఎందుకంటే ముంబైలోని వాంఖెడే వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో జరుగుతున్న మ్యాచులో ఆ జట్టు మళ్లీ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కే రానుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో పాటు ముంబై ఇండియన్స్ ను టాస్ ఓడినా మ్యాచ్ ఫలితంలో బోల్తా కొట్టించిన రాజస్థాన్.. ఇప్పుడు బెంగళూరుపై కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేయనుందా..? ఇరు జట్లు గత మ్యాచులో ఆడిన జట్లతోనే బరిలోకి దిగుతున్నాయి.
రాయల్ ఛాలెంజర్స్ జట్టు బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో రాజస్థాన్ తో సమానంగానే ఉంది. విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ వంటి స్టార్ బ్యాటర్లు, దినేశ్ కార్తీక్, షాబాజ్ అహ్మద్, రూథర్ఫర్డ్ వంటి హిట్టర్లతో బెంగళూరు బ్యాటింగ్ బలంగానే ఉంది.
ఇక బౌలింగ్ లో డెత్ ఓవర్ స్పెషలిస్టు హర్షల్ పటేల్, గత మ్యాచులో నాలుగు వికెట్లు తీసిన వనిందు హసరంగ, యువ పేసర్ ఆకాశ్ దీప్ తో పాటు సీనియర్ బౌలర్ మహ్మద్ సిరాజ్ లు రాణిస్తున్నారు.
బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు అన్ని విభాగాల్లో రాజస్థాన్ పటిష్టంగా ఉంది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినా తొలి పవర్ ప్లే లో భారీగా పరుగులు పిండుకుంటున్నాడు. గత మ్యాచులో సెంచరీతో కదం తొక్కిన జోస్ బట్లర్ ఆ ఫామ్ ను కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాడు. మిడిలార్డర్ లో వచ్చే సంజూ శాంసన్, సిమ్రన్ హెట్మెయర్, దేవదత్ పడిక్కల్ తో ఆ జట్టు బ్యాటింగ్ దుర్బేధ్యంగా ఉంది.
ఇక బౌలింగ్ లో పేసర్లు ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్ లు ప్రత్యర్థి జట్లకు ఆదిలోనే చుక్కలు చూపిస్తున్నారు. వీళ్లను తప్పించుకున్నా.. యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్ లు కూడా తమ స్పిన్ దుమ్ము దులుపుతున్నారు.
ముఖాముఖి : ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఐపీఎల్ లో 24 సార్లు తలపడ్డాయి. ఇందులో ఆర్సీబీ 12 మ్యాచుల్లో నెగ్గగా.. 10 మ్యాచులను రాజస్థాన్ గెలుచుకుంది. రెండు మ్యాచుల్లో ఫలితం తేలలేదు.
వాంఖెడే లో..
వాంఖెడేలో ఇప్పటివరకు ఆర్సీబీ 12 మ్యాచులాడగా.. ఏడింటిలో గెలిచింది. ఇక రాజస్థాన్.. 13 మ్యాచులాడి ఆరింటిలో మాత్రమే విజయం సాధించింది.
తుది జట్లు :
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), అనూజ్ రావత్, విరాట్ కోహ్లి, దినేశ్ కార్తీక్, షెర్ఫేన రూథర్ఫర్డ్ , షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగ, డేవిడ్ విల్లే, హర్షల్ పటేల్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్
రాజస్థాన్ రాయల్స్ : జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, సంజూ శాంసన్ (కెప్టెన్), హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, నవదీప్ సైనీ, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్