
ద్వీప దేశం శ్రీలంక లో ఆర్థిక పరిస్థితులు నానాటికీ అడుగంటుతున్నాయి. మాంద్యం కోరల్లో చిక్కుకున్న దేశంలో ఏర్పడిన ఆర్థిక అత్యవసర పరిస్థితులు.. ఆ దేశ ప్రజల బతుకులను రోడ్డుకీడ్చాయి. దినదినగండంగా.. అన్నమో రామచంద్ర అంటూ బతుకులీడుస్తున్న ప్రజలు.. రోడ్ల మీదకు వచ్చి చేసేదేమీ లేక ప్రభుత్వంపై నిరసన తెలుపుతున్నారు. ఇంత కష్టాల పాలవుతున్న ప్రజలు.. రెండు నెలల పాటు తమ పక్క దేశంలో అంగరంగ వైభవంగా జరిగే క్రికెట్ మ్యాచులను వీక్షిస్తారా..? తెల్లారితే ఏ వస్తువు ధర ఎంత పెరుగుతుందో అని ఆలోచించే అభాగ్యులు తమ అభిమాన ఆటగాళ్ల ఆటను చూసి ఆకలిని చంపుకుంటారా..? అసలు విద్యుత్ కూడా లేని గ్రామాల్లో ఐపీఎల్ ప్రసారాలు ఎలా వస్తాయి..? లంక ఆర్థిక వ్యవస్థను బంగాళఖాతంలో విసిరేసిన మాంద్యం.. అక్కడి ఐపీఎల్ ప్రసారాలను కూడా ముంచింది.
లంకలో ఐపీఎల్ ప్రసారాలు బంద్ అయ్యాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఆర్థిక సంక్షోభం కారణంగా అక్కడి మీడియా.. ఇండియాలో క్రికెట్ వేడుక కంటే వారి దేశ ప్రజల బాధల పైనే ఫోకస్ చేసింది. రాజధాని కొలంబో లో గల ప్రఖ్యాత ఇండిపెండెన్స్ స్క్వేర్ వద్ద సాగుతున్న నిరసనలతో ఆ దేశం హోరెత్తుతున్నది.
అక్కడ ఐపీఎల్ మ్యాచులను ప్రసారం చేస్తున్న ఛానెళ్లు ఈ క్యాష్ రిచ్ లీగ్ ప్రసారాలను నిలిపేశాయి. పత్రికలు పేపర్ కాస్ట్ పెరగడంతో ప్రింటింగ్ మానేశాయి. డిజిటల్ పేపర్ల రూపం (ఈ పేపర్) లో వార్తలు వెలువడుతున్నా వాటిలో ఐపీఎల్ గురించిన వార్తలే లేవు. అక్కడి జానీ న్యూస్ నివేదిక ప్రకారం.. ‘జీతాలివ్వలేక టీవీ ఛానెళ్లు చాలా వరకు మూతపడ్డాయి. కాగితం ధర కొండెక్కడంతో ప్రింట్ మీడియా కూడా పేపర్లను ప్రచురించడం లేదు. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో రోజంతా అధికారిక కరెంటు కోతలే కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ ను చూసి ఎంజాయ్ చేసే మూడ్ లో లంక ప్రజలు లేరు...’ అని తెలిపింది.
లంకలో ఐపీఎల్ ప్రసారాలయ్యేది ఈ ఛానెళ్లలోనే..
శ్రీలంకలో ఐపీఎల్ ప్రసారాలను యుప్ టీవీ, ఎస్ఎల్ఆర్సీ, డయలాగ్ టీవీ, పియో టీవీ లలో వీటిని ప్రసారం చేశారు.
ఐపీఎల్ లో లంక ప్లేయర్లు :
- వనిందు హసరంగ : ఆర్సీబీ
- భానుక రాజపక్స : పీబీకేఎస్
- దుష్మంత చమీర : లక్నో సూపర్ జెయింట్స్
- చమీక కరుణరత్నే : కోల్కతా నైట్ రైడర్స్
ఐపీఎల్ లో లంక కోచ్ లు :
- ముత్తయ్య మురళీధరన్ : సన్ రైజర్స్ హైదరాబాద్ మెంటార్ అండ్ బౌలింగ్ కోచ్
- మహేళ జయవర్ధనే : ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్
- కుమార సంగక్కర : రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్
- లసిత్ మలింగ : రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్
ఇండియాలో సాయంత్రమైతే చాలు టీవీల ముందు ఐపీఎల్ ను చూస్తూ ప్రజలు ఎంజాయ్ చేస్తుండగా.. మన పక్క దేశంలో మాత్రం ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రజల బతుకులు నానాటికీ దిగజారుతుండటం విషాదకరం.