IPL2022: అయినా ముంబై మారలేదు.. వాళ్ల ఆట మారలేదు.. ‘సూర్య ప్రతాపం’ మినహా అంతా తుస్.. ఆర్సీబీకి ఊరించే టార్గెట్

Published : Apr 09, 2022, 09:31 PM ISTUpdated : Apr 09, 2022, 09:36 PM IST
IPL2022: అయినా ముంబై మారలేదు.. వాళ్ల ఆట మారలేదు.. ‘సూర్య ప్రతాపం’ మినహా అంతా తుస్.. ఆర్సీబీకి ఊరించే టార్గెట్

సారాంశం

TATA IPL 2022 - RCB vs MI:  ఐపీఎల్ లో అంతగా అనుభవం లేని జట్లు సైతం ధీటుగా ఆడుతుంటే ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ మాత్రం  అట్టర్ ఫ్లాఫ్ అవుతున్నది. ఆర్సీబీ బౌలర్లకు దాసోహమంటూ మరో ఓటమి ముంగిట నిలిచింది. 

వరుసగా మూడు ఓటములు.. ఇంటా బయటా విమర్శలు.. బెంగళూరుతో కీలక మ్యాచ్.. ఈసారైనా బాగా ఆడతారులే అని ధీమా.. కానీ ముంబై మారలేదు.. వాళ్ల ఆట అస్సలే మారలేదు. ఆ  జట్టు తరఫున మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ మినహా మిగిలిన బ్యాటర్లంతా అట్టర్ ఫ్లాఫ్  అయ్యారు. తప్పక రాణించాల్సిన మ్యాచులో  ఓపెనర్లు ఫర్వాలేదనిపించినా.. మిడిలార్డర్ దారుణంగా విఫలమైంది.  ముగ్గురు కీలక ఆటగాళ్లు పది పరుగుల వ్యవధిలోనే వెనుదిరగడంతో ఆ జట్టు తీవ్ర ఇబ్బందులకు గురైంది.  నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది.  సూర్య కుమార్ యాదవ్  ఆఖర్లో వీర విహారం చేయకుంటే ఆ మాత్రం స్కోరైనా దక్కేది కాదు. 

టాస్ ఓడిన  రోహిత్ సేన బ్యాటింగ్ కు దిగి ఆ జట్టుకు శుభారంభమే అందించింది. ఇషాన్ కిషన్ (28 బంతుల్లో 26.. 3 ఫోర్లు) నెమ్మదిగా ఆడినా  రోహిత్ శర్మ (15 బంతుల్లో 26.. 4 ఫోర్లు, 1 సిక్స్)  మాత్రం ధాటిగా ఆడాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్ కు 50 పరగులు జోడించారు. పవర్ ప్లే ముగిసేసరికి ముంబై వికెట్లేమీ కోల్పోకుండా పటిష్టంగానే ఉంది. 

అప్పుడు మొదలైంది పతనం.. 

కానీ ఏడో ఓవర్ వేసిన హర్షల్ పటేల్ బౌలింగ్ రెండో బంతికి అతడికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు రోహిత్ శర్మ. అప్పుడు మొదలైంది ముంబై వికెట్ల పతనం. హసరంగ వేసిన 9వ ఓవర్లో.. బ్రెవిస్ (8) ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. పదో ఓవరలో ఇషాన్ కిషన్ ను ఆకాశ్ దీప్ ఔట్ చేశాడు. అదే ఓవర్లో తిలక్ వర్మ (0) లేని పరుగు కోసం యత్నించి రనౌట్ అయ్యాడు. మ్యాక్స్ వెల్ అద్భుత త్రో తో తిలక్ వర్మ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. 

ఇక పదో ఓవర్ తొలి బంతికి  పొలార్డ్ (0) కూడా ఖాతా తెరవకుండానే ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.  పొలార్డ్ స్థానంలో వచ్చిన రమన్దీప్ సింగ్ (6) క్రీజులో నిలదొక్కుకోవడానికే ఇబ్బందిపడ్డాడు. హర్షల్ పటేల్ వేసిన 14 వ ఓవర్లో అతడు వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.  రోహిత్ శర్మ ఔటయ్యేటప్పటికి 7 ఓవర్లలో 50 పరగులుగా ఉన్న ముంబై  స్కోరు.. 13.2 ఓవర్లలో 62  రన్స్ కు 6 వికెట్లకు పడిపోయింది. 

సూర్య జోరు.. 

వరుస వికెట్లు పడుతున్నా సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 68.. 5 ఫోర్లు, 6 సిక్సర్లు) మాత్రం తన ఏకాగ్రత కోల్పోలేదు.  ముందు మంచి బంతులను గౌరవించాడు.  క్రీజులో కుదురుకునేదాకా నింపాదిగా ఆడాడు. 14 వ ఓవర్ దాకా నెమ్మదిగా ఆడిన సూర్య.. ఆ తర్వాత గేర్ మార్చాడు. షాబాజ్ వేసిన 15వ ఓవర్లో ఓ  సిక్స్, ఫోర్ కొట్టి తాను హిట్టింగ్ కు దిగే సమయం వచ్చిందని ఆర్సబీకి హెచ్చరికలు పంపాడు.  ఆ ఓవర్లో 12 పరగులొచ్చాయి. తర్వాత హసరంగ, సిరాజ్ లను కూడా శిక్షించాడు.

18వ ఓవర్లో సిరాజ్ బౌలింగ్ లో  సిక్సర్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సూర్య.. ఉనద్కత్ తో కలిసి ఏడో వికెట్ కు 50 పరగుల భాగస్వామ్యాన్ని  పూర్తి చేశాడు. అదే ఓవర్లో ఆఖరి రెండు బంతులలో  మరో సిక్సర్, ఫోర్ బాదాడు. దీంతో ఆ ఓవర్లో  మొత్తంగా 23 పరగులొచ్చాయి. కానీ చివరి ఓవర్లో హర్షల్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు.  ఆ ఓవర్లో ఏడు పరుగులు మాత్రమే వచ్చాయి.  

ఆర్సీబీ బౌలర్లలో  సిరాజ్ భారీగా పరుగులిచ్చికున్నాడు. నాలుగు ఓవర్లు వేసి 51 పరగులిచ్చి వికెట్లేమీ తీయలేదు. హసరంగ తన కోటా పూర్తిగా విసిరి.. 28 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీయగా... ఆకాశ్ దీప్ 4 ఓవర్లలో 20 పరుగులే ఇచ్చి వికెట్ పడగొట్టాడు. హర్షల్ పటేల్.. నాలుగు ఓవర్లలో రెండు వికెట్లు తీసి 23 రన్స్ ఇచ్చాడు.  

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !