Sri Lanka: ఇంగ్లాండ్ పొమ్మంది.. శ్రీలంక రమ్మంది.. లంకకు కొత్త కోచ్ గా సిల్వర్ వుడ్

Published : Apr 09, 2022, 07:59 PM IST
Sri Lanka: ఇంగ్లాండ్ పొమ్మంది.. శ్రీలంక రమ్మంది.. లంకకు కొత్త కోచ్ గా సిల్వర్ వుడ్

సారాంశం

Sri Lanka Cricket Head Coach: ఏడాది కాలంగా ప్రధాన కోచ్ లేక నెట్టుకొస్తున్న  శ్రీలంక జట్టు.. కొత్త హెడ్ కోచ్ ను నియమించుకుంది. ఇంగ్లాండ్ జట్టు వద్దనుకున్న   వ్యక్తిని లంక.. తమ జట్టుకు  ప్రధాన శిక్షకుడిగా నియమించుకోవడం విశేషం. 

శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) తమ జాతీయ జట్టుకు కొత్త కోచ్ ను నియమించింది. గతంలో ఇంగ్లాండ్ తరఫున  ప్రధాన కోచ్ గా పనిచేసిన క్రిస్ సిల్వర్ వుడ్.. ఇప్పుడు లంకు  హెడ్ కోచ్ గా  బాధ్యతలు చేపట్టనున్నాడు. ఏడాది కాలంగా హెడ్ కోచ్ లేక నెట్టుకొస్తున్న లంక.. ఎట్టకేలకు  సిల్వర్ వుడ్ ను  ఆ బాధ్యతల్లో నియమించడం విశేషం.  గతేడాది కోచ్ గా వ్యవహరించిన మిక్కీ ఆర్థర్.. ఆ బాధ్యతల నుంచి వైదొలిగాక ఆ జట్టు రుమేశ్ రత్నాయకే (తాత్కాలిక కోచ్) తో  బండి లాగిస్తున్నది. కొత్త కోచ్.. త్వరలో బంగ్లాదేశ్ తో జరుగబోయే సిరీస్  నుంచి జట్టుతో కలవనున్నాడు. రెండేండ్ల పాటు సిల్వర్ వుడ్ ఈ పదవిలో ఉంటాడు. 

ఇటీవలే ముగిసిన యాషెస్ తో పాటు  స్వదేశంలో న్యూజిలాండ్ తో సిరీస్, గతేడాది భారత్ తో   సిరీస్ కోల్పోయింది ఇంగ్లాండ్.  దీంతో జట్టులో ప్రధాన ఆటగాళ్లతో పాటు  సిల్వర్ వుడ్ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి.  సిల్వర్ వుడ్ ను సాగనంపాల్సిందేనని  సీనియర్ల నుంచి  ఇంగ్లాండ్ అభిమానులు బోర్డు మీద ఒత్తిడి తెచ్చారు. దీంతో యాషెస్ అనంతరం  సిల్వర్ వుడ్ కు స్వస్తి చెప్పింది ఇంగ్లాండ్.

అయితే ఇప్పుడు  అతడే లంకకు ప్రధాన కోచ్ గా వ్యవహరించనున్నాడు.  కొత్త కోచ్ త్వరలో బంగ్లాదేశ్ తో జరిగే రెండు మ్యాచుల టెస్టు సిరీస్ తో బాధ్యతలు చేపట్టనున్నాడు.  ఈ మేరకు  ఎస్ఎల్సీ ట్విట్టర్ లో ఈ విషయాన్ని వెల్లడించింది.  ‘క్రిస్ ను జాతీయ జట్టుకు  ప్రధాన కోచ్ గా నియమించడం పట్ల మేము సంతోషంగా ఉన్నాము. అతడు చాలా అనుభవజ్ఞుడైన కోచ్. ఆటగాళ్ల ఎంపికతో పాటు జట్టును ముందుకు తీసుకెళ్లడంలో అతడు కీల పాత్ర పోషిస్తాడని మేము భావిస్తున్నాం’ అని తెలిపింది. 

 

మరోవైపు సిల్వర్ వుడ్ కూడా.. ‘నేను శ్రీలంక బోర్డుతో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నాను. కొలంబోకు ఎప్పుడెప్పుడు వెళ్దామా.. అని ఆసక్తిగా ఉన్నాను. ఆ జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు.  వారందరితో కలిసి పనిచేసేందుకు నేను ఎదురుచూస్తున్నాను..’ అని  తెలిపాడు. 

కాగా.. సిల్వర్ వుడ్  2019లో ఇంగ్లాండ్ పురుషుల జట్టు ప్రధాన కోచ్ గా నియమితుడయ్యాడు. ఆ ఏడాది ఇంగ్లాండ్.. తన క్రికెట్ చరిత్రలో తొలసారి ప్రపంచకప్ గెలుచుకున్నది.  అయితే ఆ జట్టుకు ప్రధాన కోచ్ ట్రెవర్ బేలిస్ ఆధ్వర్యంలో సిల్వర్ వుడ్ బౌలింగ్ కోచ్ గా పనిచేశాడు.  ప్రపంచకప్ ముగిశాక  బేలిస్.. ఆ బాధ్యతల నుంచి వైదొలగగా.. సిల్వర్ వుడ్ ను ఆ పదవి వరించింది. ఇక ప్రపంచకప్ తర్వాత మాత్రం ఇంగ్లాండ్ కు పెద్దగా చెప్పుకోదగ్గ విజయాలేమీ దక్కలేదు. 

ఇంగ్లాండ్ హెడ్  కోచ్ గా కాక ముందే సిల్వర్ వుడ్.. ఇంగ్లాండ్ తరపున ఆరు టెస్టులు, ఏడు వన్డేలు  కూడా ఆడాడు. కౌంటీలలో యార్క్ షైర్, మిడిల్ సెక్స్ జట్ల తరఫున ఆడిన సిల్వర్ వుడ్.. ఆ తర్వాత కోచ్ గా స్థిరపడ్డాడు. ఎసెక్స్ కౌంటీ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ గా విజయవంతమై ఆ తర్వాత  వడివడిగా ఇంగ్లాండ్ జాతీయ జట్టుకు హెడ్ కోచ్ అయ్యే స్థాయికి ఎదిగాడు.  

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !