
ఐదు సార్లు ఐపీఎల్ విజేత ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో ఇప్పటివరకు ఇంకా బోణీ కొట్టలేదు. ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఆ జట్టుకు ఓటమే ఎదురైంది. టోర్నీలో ప్లేఆఫ్స్ కు అర్హత సాధించడంలో కీలకంగా మారనున్న రానున్న మ్యాచుల్లో ఆ జట్టు తప్పకుండా గెలవాల్సి ఉంది. ఇప్పటికే 3 మ్యాచులు ఓడిన రోహిత్ సేన.. ఇక వాటికి పుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో జరుగబోయే మ్యాచులో తప్పకుండా గెలవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. మరోవైపు వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన బెంగళూరు.. అదే జోరును కొనసాగించాలని చూస్తున్నది. ఈ మేరకు టాస్ గెలిచిన ఫాఫ్ డుప్లెసిస్ సేన తొలుత బౌలింగ్ చేయనుంది. రోహిత్ సేన బ్యాటింగ్ కు రానుంది.
పూణేలోని మహారష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న నేటి మ్యాచులో ఇరు జట్లలో పలు మార్పులు జరిగాయి. ముంబై తరఫున మూడు మార్పులు జరిగాయి. ఇక ఆర్సీబీ లో కొత్త పెళ్లికొడుకు గ్లెన్ మ్యాక్స్వెల్ ఈ మ్యాచ్ తో ఎంట్రీ ఇచ్చాడు.
2022 సీజన్ లో ఓటమితోనే ప్రయాణం ప్రారంభించిన ముంబై ఇండియన్స్ కు బ్యాటింగ్ లో పెద్దగా లోపాలేవీ లేవు. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్ లతో ఆ జట్టు బ్యాటింగ్ బలం పటిష్టంగా ఉంది. పైన పేర్కొన్న వారిలో సారథి రోహిత్ శర్మ మినహా మిగిలిన వారంతా ఫామ్ లో ఉన్నవాళ్లే. కానీ ఆ జట్టును ప్రధానంగా బౌలింగ్ సమస్య వేధిస్తున్నది.
జస్ప్రీత్ బుమ్రా, మురుగన్ అశ్విన్ మినహా ఆ జట్టులో ప్రభావం చూపగలిగే బౌలర్లు కరువయ్యారు. గత మ్యాచులో కోల్కతాతో గెలవాల్సిన స్థితిలో ఉండి కూడా ఆ జట్టు ఓడింది. టిమ్ డేవిడ్ ను ప్యాట్ కమిన్స్.. ఉతికారేశాడు. బాసిల్ తంపి ఫర్వాలేదనిపిస్తున్నా.. ఇంకా మెరుగుపడాల్సి ఉంది. స్పిన్నర్ గా మురుగన్ అశ్విన్ తన జోరు కొనసాగించాలని ముంబై కోరుకుంటున్నది.
ఇక బెంగళూరు విషయానికొస్తే.. తొలి మ్యాచ్ లో ధాటిగా ఆడిన సారథి ఫాఫ్ డుప్లెసిస్.. తర్వాత రెండు మ్యాచుల్లో రాణించలేదు. విరాట్ కోహ్లి పరిస్థితి అంతే. పంజాబ్ తొ మ్యాచ్ లో ఫర్వాలేదనిపించినా.. తర్వాత రెండు మ్యాచుల్లో అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. అయితే మ్యాక్స్వెల్ రావడం ఆ జట్టుకు కొండంత బలం. మిడిలార్డర్ లో షాజాబ్ అహ్మద్ ఆ జట్టు అంచనాలకు అందని రీతిలో రాణిస్తున్నాడు.
బౌలింగ్ లో ఆ జట్టు ప్రధానంగా వనిందు హసరంగ, హర్షల్ పటేల్ పైనే ఆశలు పెట్టుకుంది. సిరాజ్, ఆకాశ్ దీప్ లు కూడా మెరుగ్గా రాణిస్తున్నా వికెట్లు తీయలేకపోతున్నారు. అయితే తొలుత ప్రత్యర్థులను కట్టడి చేస్తున్న ఆర్సీబీ బౌలర్లు.. ఆఖర్లో చేతులెత్తేస్తున్నారు.
ముఖాముఖి : ఇరుజట్టు ఇప్పటివరకు ఐపీఎల్ లో 29 సార్లు పోటీ పడ్డాయి. ఇందులో ఆర్సీబీ 12 సార్లు నెగ్గగా.. ముంబై 17 మ్యాచుల్లో గెలిచింది.
తుది జట్లు :
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), అనూజ్ రావత్, విరాట్ కోహ్లి, గ్లెన్ మ్యాక్స్వెల్, దినేశ్ కార్తీక్, డేవిడ్ విల్లీ, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్
ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, రమన్దీప్ సింగ్, డేవాల్డ్ బ్రేవిస్, మురుగన్ అశ్విన్, జయదేవ్ ఉనద్కత్, బాసిల్ తంపి, జయదేవ్ ఉనద్కత్