IPL 2022: కరోనాను ఎదిరించి.. పంజాబ్ ను మట్టి కరిపించి.. ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ విక్టరీ

Published : Apr 20, 2022, 10:22 PM IST
IPL 2022: కరోనాను ఎదిరించి.. పంజాబ్ ను మట్టి కరిపించి.. ఢిల్లీ  క్యాపిటల్స్ సూపర్ విక్టరీ

సారాంశం

TATA IPL 2022 - DC vs PBKS: సహచర ఆటగాళ్లు ఇద్దరు కరోనా బారీన పడ్డ నేపథ్యంలో ఢిల్లీ ఆటగాళ్ల మనోస్థైర్యం దెబ్బతింటుందేమనని భావించిన  ఆ జట్టు అభిమానుల  అనుమానాలను పటాపంచాలు చేస్తూ  రిషభ్ పంత్ సేన  అదిరిపోయే ప్రదర్శన చేసింది.  

నాలుగు రోజుల క్రితం తొలి కరోనా కేసు.. సరిగ్గా పంజాబ్ తో మ్యాచ్ కు ముందు మరో ఆటగాడికి కరోనా. అసలు ఢిల్లీ ఈ మ్యాచ్ ఆడుతుందా..? ఇప్పటికే ఇద్దరు ఆటగాళ్లతో పాటు నలుగురు సిబ్బంది కూడా కరోనా బారిన పడిన నేపథ్యంలో ఈ మ్యాచ్ ఆడేందుకు ఢిల్లీకి ఆటగాళ్లు దొరుకుతారా..?  అసలు మ్యాచ్ జరుగుతుందా..? అని సందేహాలు. కానీ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ ఢిల్లీ అద్బుత ఆటతీరుతో ముందుకు కదిలింది. పంజాబ్ ను ముందు తక్కువ స్కోరుకే పరిమితం చేసి తర్వాత బ్యాట్ తో దుమ్ము రేపింది.  ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (30 బంతుల్లో 60 నాటౌట్.. 10 ఫోర్లు, 1 సిక్సర్), పృథ్వీ షా (20 బంతుల్లో 41.. 7 ఫోర్లు, 1 సిక్సర్) ల సుడిగాలి ఇన్నింగ్స్ తో పది ఓవర్ల (10.3) లోనే మ్యాచ్ ను ముగించింది. 

స్వల్ప లక్ష్య ఛేదనలో  ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ ను ధాటిగా ఆరంభించింది.  తొలి ఓవర్లోనే పృథ్వీ షా మూడు ఫోర్లు కొట్టాడు. రెండో ఓవర్లో వార్నర్, షా లు తలో ఫోర్ కొట్టి తమ ఉద్దేశాన్ని చాటారు. ఇక వైభవ్ అరోరా వేసిన మూడో ఓవర్లో వార్నర్ రెండు ఫోర్లు బాదగా.. షా ఒక సిక్సర్ కొట్టాడు. రబాడా వేసిన నాలుగో ఓవర్లో.. వార్నర్ మూడు బౌండరీలు బాదాడు. దీంతో ఢిల్లీ స్కోరు 3.3 ఓవర్లలోనే 50 పరుగులు దాటింది. 

అర్షదీప్ వేసిన ఐదో ఓవర్లో కూడా ఈ ప్రవాహం కొనసాగింది. బంతి బౌలర్లు, ఫీల్డర్ల చేతిలో కంటే  బౌండరీ లైన్ వద్దే ఎక్కువ సేపు నిలిచింది.  వచ్చిన బంతిని వచ్చినట్టు బాదడమే పనిగా పెట్టుకున్నారు  ఢిల్లీ ఓపెనర్లు..  దీంతో పవర్ ప్లే లో 81 పరుగులొచ్చాయి. ఐపీఎల్ లో  ఢిల్లీకి ఇదో రికార్డు. వీళ్ల జోరు చూస్తే పది ఓవర్లలోపే ఓపెనర్లు మ్యాచ్ ను ముగించేలా కనిపించారు. 

అయితే ధాటిగా ఆడే క్రమంలో రాహుల్ చాహర్ వేసిన ఏడో  ఓవర్లో మూడో బంతిని భారీ షాట్ ఆడిన షా.. డీప్ మిడ్ వికెట్ వద్ద ఉన్న నాథన్ ఎల్లిస్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.  దీంతో 83 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి  తెరపడింది.  కానీ వార్నర్  మాత్రం.. సర్ఫరాజ్ ఖాన్ (12 నాటౌట్) తో కలిసి లాంఛనాన్ని పూర్తి చేశాడు.  

 

ఈ క్రమంలో  వరుసగా మూడో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడమే గాక ఐపీఎల్ లో ఒక ఫ్రాంచైజీపై వెయ్యి పరుగులు సాధించిన రరెండో ఆటగాడిగా నిలిచాడు. పంజాబ్ పై 56 పరుగులు చేయగానే వార్నర్.. ఆ ఫ్రాంచైజీ పై వెయ్యి పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ తడబడింది. మయాంక్ అగర్వాల్ (15 బంతుల్లో 24.. 4 ఫోర్లు) కాస్త ధాటిగా ఆడేందుకు ప్రయత్నించినా.. శిఖర్ ధావన్ (9) మాత్రం ఇబ్బంది పడ్డాడు.క్రీజులోకి వస్తూనే రెండు బౌండరీలు బాదిన జానీ బెయిర్ స్టో (9), సన్ రైజర్స్ తో జరిగిన గత మ్యాచ్ లో మెరిసిన లివింగ్ స్టోన్ (2) లు కూడా  ఎక్కువ సేపు నిలువలేకపోయారు. వికెట్ కీపర్ జితేశ్ శర్మ (23 బంతుల్లో 32.. 5 ఫోర్లు) పంజాబ్ ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఢిల్లీ స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పంజాబ్.. 115 పరుగులకే పరిమితమైంది. 

ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ కు 2 వికెట్లు దక్కగా.. స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, లలిత్ యాదవ్ కు తలో రెండు వికెట్లు తీశారు.  అక్షర్ పటేల్.. నాలుగు ఓవర్లు వేసి 10 పరుగులే ఇవ్వడం గమనార్హం. 

PREV
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !