వేలంలో అమ్ముడుపోని ఆటగాడు రోహిత్ సేన రాత మారుస్తాడా..? ముంబై ఇండియన్స్ జట్టులోకి హిందీ కామెంటేటర్..

Published : Apr 20, 2022, 08:34 PM IST
వేలంలో అమ్ముడుపోని ఆటగాడు రోహిత్ సేన రాత మారుస్తాడా..? ముంబై ఇండియన్స్ జట్టులోకి హిందీ కామెంటేటర్..

సారాంశం

TATA IPL 2022: ఈ ఐపీఎల్ సీజన్ లో ఒక్క విజయం కోసం వేయి కండ్లతో ఎదురుచూస్తున్న ముంబై ఇండియన్స్ కు తన బౌలర్లపై పూర్తిగా నమ్మకం పోయినట్టుంది.  హిందీ కామెంటేటర్ ను బరిలోకి దింపడానికి ప్రయత్నాలు చేస్తున్నది. 

ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుపొందిన ముంబై ఇండియన్స్  ఈ సీజన్ లో చెత్త ఆటతీరుతో విమర్శలు మూటగట్టుకుంటున్నది. ఐపీఎల్ - 2022 లో ఇప్పటివరకు ఆరు మ్యాచులాడి ఒక్కదాంట్లో కూడా గెలనవి ముంబై.. తాజాగా  కామెంటేటర్ ను తీసుకొచ్చి క్రికెట్ ఆడించాలని చూస్తున్నది.  గతంలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన ఆ జట్టు ఆటగాడు ధవల్ కులకర్ణిని తుది జట్టులోకి తీసుకోవాలని భావిస్తున్నది.  జట్టు సారథి రోహిత్ శర్మ సిఫారసు మేరకు.. అతడిని తిరిగి ముంబైలో చేర్చుకోనున్నట్టు తెలుస్తున్నది. 

ఈ సీజన్ లో అడపా దడపా బ్యాట్ తో రాణిస్తున్న ముంబై.. బౌలింగ్ లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నది. ఒకప్పుడు ట్రెంట్ బౌల్ట్, మిచెల్ జాన్సన్, లసిత్ మలింగ లతో కళకళలాడిన ముంబై బౌలింగ్ యూనిట్.. ఇప్పుడు కళావిహీనమైంది.  ఒక్క జస్ప్రీత్ బుమ్రా తప్ప  మిగతా ఏ బౌలర్ కూడా  రాణించడం లేదు. 

బాసిల్ తంపి, టిమ్ డేవిడ్, టైమల్ మిల్స్ లు ధారాళంగా పరుగులిచ్చుకుంటున్నారు. స్పిన్నర్ మురుగన్ అశ్విన్ కూడా గొప్పగా రాణించింది లేదు. ఈ నేపథ్యంలో బౌలింగ్ దళాన్ని పటిష్టం చేసేందుకు జట్టు యాజమాన్యం  యోచిస్తున్నది. ఇందులో భాగంగానే కులకర్ణిని తిరిగి జట్టులో చేర్చుకోవాలని చూస్తున్నది. 

 

గతంలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన కులకర్ణికి  ముంబై, పూణే పిచ్ లు ఎలా స్పందిస్తాయనేదానిపై  స్పష్టమైన అవగాహన ఉంది. దీంతో అతడిని తిరిగి జట్టులోకి చేర్చుకోవాలని  రోహిత్ భావిస్తున్నాడట.  అతడి  రాకతో అయినా ముంబై కి విజయాలు దక్కుతాయని ఆశగా ఎదురు చూస్తున్నాడట. 

ఇక కులకర్ణి విషయానికొస్తే.. 2008 నుంచి 2013 వరకు  అతడు ముంబైతోనే ఉన్నాడు. ఆ తర్వాత రెండు సీజన్లను రాజస్తాన్ తరఫున ఆడాడు. 2016, 2017 సీజన్లలో గుజరాత్ టైటాన్స్ కు   ప్రాతినిథ్యం వహించాడు.  తిరిగి మూడేండ్ల పాటు రాజస్తాన్ తో కలిశాడు. ఇక 2020 నుంచి 2021 లో మళ్లీ ముంబై తరఫునే ఆడాడు. 2022 మెగా వేలంలో కులకర్ణి అమ్ముడపోలేదు. దీంతో అతడు స్టార్ స్పోర్ట్స్ లో ఐపీఎల్ హిందీ కామెంటేటర్ గా చేరాడు.  ఇప్పుడు అతడిని తిరిగి తీసుకోవాలని రోహిత్ శర్మ  అనుకుంటున్నాడు. 

ఈ మేరకు ముంబై యాజమాన్యం కులకర్ణితో చర్చలు కూడా జరిపినట్టు వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ మాసాంతంలో అతడు ముంబై ఇండియన్స్ తో చేరే అవకాశాలున్నాయని సమాచారం.  ఐపీఎల్  లో ఇప్పటివరకు 92 మ్యాచులాడిన కులకర్ణి.. 86 వికెట్లు తీశాడు. టీమిండియా తరఫున కూడా 12 వన్డేలు, 2 టీ20 లు ఆడి 22 వికెట్లు తీసుకున్నాడు.  

కాగా.. గురువారం (ఏప్రిల్ 21) ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్లుగా పేరున్న ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య రసవత్తర పోరు జరుగనున్నది.  ఐపీఎల్ ఇప్పటివరకు గడిచిన 14 సీజన్లలో 5 సార్లు ముంబై, 4 సార్లు చెన్నైలే కప్ ను నెగ్గాయి. కానీ ఈసారి మాత్రం అనూహ్యంగా ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో 9, 10వ స్థానంలో నిలవడం గమనార్హం. 

PREV
click me!

Recommended Stories

IND vs SA : గిల్ రెడీనా? భారత జట్టులోకి ముగ్గురు స్టార్ల రీఎంట్రీ
Smriti Mandhana: ఔను.. నా పెళ్లి రద్దయింది.. స్మృతి మంధాన, పలాష్ ముచ్ఛల్ సంచలన పోస్టులు