
ఐపీఎల్ ప్రారంభమై 15 ఏళ్లు గడిచిపోయింది. భారత క్రికెట్ ప్రస్థానంలోనే కాకుండా ప్రపంచ క్రికెట్‌లోనే పెను మార్పులు తీసుకొచ్చింది ఇండియన్ ప్రీమియర్ లీగ్. పురుషుల ఐపీఎల్ ప్రారంభమై 15 ఏళ్లు దాటినా, మహిళల ఐపీఎల్ గురించి ఎటూ తేల్చలేదు బీసీసీఐ...
ఐపీఎల్ ద్వారా జస్ప్రిత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, ప్రసిద్ధ్ కృష్ణ,సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, నటరాజన్, వెంకటేశ్ అయ్యర్... ఇలా పదుల సంఖ్యలో టాలెంటెడ్ ప్లేయర్లు భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు, సత్తా చాటుతున్నారు.
ఒకప్పుడు పాకిస్తాన్, శ్రీలంకతో సమానంగా ఓ యావరేజ్ టీమ్‌గా ఉన్న భారత పురుషుల క్రికెట్ జట్టు, ఇప్పుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో పోటీపడే టాప్ టీమ్‌గా మారిందంటే కారణం ఐపీఎల్... అందుకే మహిళల క్రికెట్‌ను బాగుచేసేందుకు వుమెన్స్ ఐపీఎల్ తీసుకురావాలని క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచే డిమాండ్ చేస్తూనే ఉన్నారు...
వుమెన్స్ ఐపీఎల్ నిర్వహించేందుకు తగినంత మంది ప్లేయర్లు అందుబాటులో లేరని, అప్పుడప్పుడు ‘వుమెన్స్ టీ20 ఛాలెంజ్’ పేరుతో మూడు టీమ్‌లు, నాలుగు మ్యాచులతో మహిళల టీ20 లీగ్ నిర్వహించి చేతులు దులుపుకుంటూ వచ్చింది బీసీసీఐ...
అయితే ఐసీసీ వుమెన్స్ వరల్డ్ కప్ 2022 టోర్నీకి ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన కారణంగా మహిళల ఐపీఎల్ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది భారత క్రికెట్ బోర్డు. తాజాగా బీసీసీఐ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్‌లో వుమెన్స్ ఐపీఎల్ గురించి చర్చించిన అధికారులు, వచ్చే ఏడాది వేసవిలో ఆరు జట్లతో ప్రారంభించేందుకు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారట...
‘వచ్చే ఏడాది వుమెన్స్ ఐపీఎల్ ప్రారంభించాలని భావిస్తున్నాం. దానికి కావాల్సిన పనులు ఇప్పటికే మొదలైపోయాయి. ఎన్ని జట్లు ఉండాలి? ఏ టైమ్‌లో నిర్వహించాలి? అనే విషయాలను త్వరలో ఫైనల్ చేయబోతున్నాం... మొదటి సీజన్‌లో ఆరు జట్లు ఉండేలా, వేలం పద్దతిలోనే ప్లేయర్లను చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం...’ అని బీసీసీఐ అధికారి తెలియచేశారు...
పురుషుల ఐపీఎల్ ముగిసిన తర్వాత మహిళల ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ ప్లానింగ్ చేస్తున్నట్టు సమాచారం. అయితే మార్చి ఆఖరిన ప్రారంభమయ్యే పురుషుల ఐపీఎల్ ముగిసే సమయానికి వర్షా కాలం వచ్చేస్తుంది. వర్షా కాలంలో మ్యాచుల నిర్వహణ సరిగా జరగదు...
పురుషుల ఐపీఎల్ సమయంలోనే వుమెన్స్ ఐపీఎల్ మ్యాచులు కూడా పెడితే, పెద్దగా ఆదరణ దక్కకపోవచ్చు. కాబట్టి పురుషుల ఐపీఎల్ కంటే ముందు ఫ్రిబవరి- మ ార్చి నెలల్లో లేదా వర్షా కాలం ముగిసిన తర్వాత ఆగస్టు నెలలో వుమెన్స్ ఐపీఎల్ నిర్వహించే ఎలా ఉంటుంది? అనే దిశగా భారత క్రికెట్ బోర్డు ఆలోచిస్తోందని సమాచారం...
ఐపీఎల్ తర్వాత వచ్చిన బిగ్ బాష్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్‌ల్లో కూడా వుమెన్స్ కోసం ప్రత్యేకంగా వుమెన్స్ బీబీఎల్, వుమెన్స్ సీపీఎల్ ఇప్పటికే ప్రారంభమై మంచి ఆదరణ కూడా దక్కించుకున్నారు. భారత ప్లేయర్ల స్మృతి మంధానా, హర్మన్‌ప్రీత్ కౌర్, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ వంటి ప్లేయర్లు వుమెన్స్ బీబీఎల్‌లో పాల్గొన్నారు...