ఆ సమయంలో కళ్లు, చెవులు మూసుకుంటావేం.. అదేం వేడుక..? లక్నో సారథి పై సన్నీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published : Apr 18, 2022, 04:33 PM IST
ఆ సమయంలో కళ్లు, చెవులు మూసుకుంటావేం.. అదేం వేడుక..? లక్నో సారథి పై సన్నీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

సారాంశం

TATA IPL 2022: క్రికెట్ లో సెంచరీ చేశాక ఒక్కో ఆటగాడిది ఒక్కో రకమైన సెలబ్రేషన్ స్టైల్.  ఈ జాబితాలో కెఎల్ రాహుల్ శతక వేడులకపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

ఐపీఎల్ లో భాగంగా ఇటీవలే ముంబైలోని బ్రబోర్న్ స్టేడియం వేదికగా జరిగిన ముంబై ఇండియన్స్ - లక్నో సూపర్ జెయింట్స్ మధ్య  ముగిసిన మ్యాచ్ లో లక్నో సారథి కెఎల్ రాహుల్ సెంచరీ చేశాడు. ఐపీఎల్ కెరీర్ లో మూడో సెంచరీ, ముంబై ఇండియన్స్ పై  కెప్టెన్ గా రెండో శతకం చేసిన రాహుల్.. వంద పరుగులు పూర్తయ్యాక  చేసుకున్న సెలబ్రేషన్స్.. ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. మాములుగా సెంచరీ పూర్తయ్యాక రాహుల్.. కళ్లు, చెవులు మూసుకుని ఏదో ప్రార్థన చేస్తున్నవాడిలా కనిపిస్తాడు. తాజాగా దీనిపై  భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

ఐపీఎల్ కెరీర్ లో వందో మ్యాచ్ ఆడిన రాహుల్.. ఈ తరహా సెలబ్రేషన్స్ చేసుకోవడం ఇదేం కొత్త కాదు. ఇది  తనపై వస్తున్న విమర్శలకు, చేస్తున్న విమర్శకులకు  తన సమాధానమని రాహుల్ గతంలో కూడా వెల్లడించాడు. 

చెవులను మూసుకుని విమర్శకులు ఏం చెప్పింది తాను వినదల్చుకోవడం లేదని చెప్పడం.. కళ్లు కూడా మూసుకుని తనపై  వచ్చే విమర్శలను పట్టించుకోనని తెలియజేయడం ఈ సెలబ్రేషన్  స్టైల్  ప్రత్యేకత. పనికిరాని విమర్శలతో తనను కిందికి దిగజార్చేవారికి ఇదే  సమాధానం అని రాహుల్ గతంలో చెప్పాడు. 

 

ఇక దీనిపై తాజాగా గవాస్కర్ మాట్లాడుతూ.. ‘ఇదేంటో నాకైతే అర్థం కావడం లేదు. వంద పరుగులు చేశాక చెవులు, కళ్లు మూసుకోవడం ఏమిటి..? ఆ సమయంలో ప్రేక్షకుల అభినందనను నువ్వు (కెఎల్) కళ్లారా చూడాలి. వారి చప్పట్లను నువ్వు మనసారా వినాలి. నువ్వు  ఫోర్, సిక్సర్ కొట్టినప్పుడు ఇలా చేసినా తప్పులేదు. కానీ సెంచరీ అనేది మ్యాచ్ లో గొప్ప విషయం కదా.  దానిని ఆస్వాదించకుంటే ఎలా..?’అని సన్నీ ప్రశ్నించాడు. 

కాగా.. ముంబైతో మ్యాచ్ లో  రాహుల్ సెంచరీతో వీర విహారం చేశాడు. 60 బంతుల్లోనే 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 103 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ముంబై అంటేనే చెలరేగి ఆడే రాహుల్..ఆ జట్టుపై ఆడిన 15 ఇన్నింగ్స్ లలో 764 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలున్నాయంటే అతడికి ఆ జట్టు అంటే ఎంతిష్టమో అర్థం చేసుకోవచ్చు. ఇక రాహుల్ సెంచరీతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. మనీష్ పాండే (38), డికాక్ (24) లు రాణించారు. భారీ లక్ష్య ఛేదనలో ముంబై..  20 ఓవర్లలో 181 పరుగులు మాత్రమే చేయగలిగింది. డెవాల్డ్ బ్రెవిస్ (31), సూర్యకుమార్ యాదవ్ (37), పొలార్డ్ (26) లు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. 

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !