IPL 2022: అసలు సమరం ముందుంది.. ఆందోళనపరుస్తున్న టీమిండియా కీలక ఆటగాళ్ల పేలవ ఫామ్

Published : Apr 25, 2022, 11:53 AM IST
IPL 2022: అసలు సమరం ముందుంది.. ఆందోళనపరుస్తున్న టీమిండియా కీలక ఆటగాళ్ల పేలవ ఫామ్

సారాంశం

TATA IPL 2022: ఐపీఎల్ లో సగం సీజన్ ముగిసింది. దాదాపు అన్ని జట్లు ఆయా ప్రత్యర్థులతో ఒక మ్యాచ్ ఆడేశాయి. ఇక  సీజన్ లో రెండో దశ నడుస్తున్నది. అయితే నెల రోజుల పాటు ఆడినా టీమిండియా లోని కీలక ఆటగాళ్ల ఫామ్ మాత్రం ఇంకా ఆందోళనగానే ఉన్నది. 

మహారాష్ట్ర వేదికగా సాగుతున్న ఐపీఎల్-15 రెండో దశ కు చేరింది. సీజనలో అన్ని జట్లు ఆయా ప్రత్యర్థులతో ఒక మ్యాచ్ ఆడి రెండో పోరుకు  సిద్ధమవుతున్నాయి. ఎవరూ ఊహించని రీతిలో గుజరాత్ టైటాన్స్ టేబుల్ టాపర్స్ గా ఉండగా.. ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్  8 మ్యాచులలో ఒక్క విజయం కూడా లేక  పదో స్థానంలో నిలిచింది. అయితే జట్ల ప్రదర్శన ఎలా ఉన్నా ఆయా టీమ్ లలోని ఆటగాళ్ల పర్ఫార్మెన్స్  మాత్రం టీమిండియాను ఆందోళనకు గురిచేస్తున్నది. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, ఇషాన్ కిషన్,  రిషభ్ పంత్ ల ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఈ ఏడాది అక్టోబర్ లో టీ20 ప్రపంచకప్ ఆడాల్సి ఉంది. 

కాగా రాబోయే ఏడాదిన్నర కాలంలో భారత్  రెండు కీలక టోర్నీలు (టీ20 ప్రపంచకప్, 2023లో భారత్ లో వన్డే ప్రపంచకప్) ఆడనున్న నేపథ్యంలో  టీమిండియా మూలస్తంభాలైన ఈ ఆటగాళ్లు ఇలా ఆడితే  అది  మొత్తంగా జట్టు విజయావకాశాలపైనే ప్రభావం చూపనుంది. 

ఈ సీజన్ కు ముందు ముంబై ఇండియన్స్ రూ. 15.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఇషాన్ కిషన్.. ఆ ధరకు మూడో వంతు కూడా  న్యాయం చేయలేకపోతున్నాడు. ఇక ఆ జట్టు సారథి రోహిత్ శర్మ పరిస్థితీ అంతే. జట్టు ప్రదర్శన పక్కనబెడితే వ్యక్తిగతంగా కూడా హిట్ మ్యాన్ దారుణంగా విఫలమవుతున్నాడు.  అదే జట్టులోని జస్ప్రీత్ బుమ్రా కూడా అదే కోవలో ఉన్నాడు. వీటన్నిటికంటే అత్యంత ఆందోళన కలిగించే అంశం  విరాట్ కోహ్లి ఫామ్.  తన కెరీర్ లోనే  ఇంత  అద్వాన్నమైన  ఆటతీరు ప్రదర్శించని కోహ్లి..  ఇలాగే ఆడితే జట్టులో చోటు కూడా కష్టమే...? అన్నంత ఆందోళనకరంగా ఆడుతున్నాడు. 

ఐపీఎల్-15 లో ఈ నలుగురి ప్రదర్శన : 

- విరాట్ కోహ్లి - 8 మ్యాచులు 119 పరుగులు. సగటు 17. ఒక్క అర్థ శతకం కూడా లేదు.  గత రెండు మ్యాచులలో వరుసగా డకౌట్లు 
- రోహిత్ శర్మ - 8 మ్యాచులు 153 పరుగులు. సగటు 19.13. హాఫ్ సెంచరీ ఒక్కటీ లేదు. 
- ఇషాన్ కిషన్ - 8 మ్యాచులు.. 199 పరుగులు.. సగటు 28.43 (ఒక్క ఫిఫ్టీ) 
- జస్ప్రీత్ బుమ్రా - 8 మ్యాచులు.. 45.8 ఓవర్లు వేసి.. 5 వికెట్లు  మాత్రమే తీశాడు. 

ఇలా అయితే ఎలా..? 

ఈ ఏడాది అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా  జరుగబోయే టీ20 ప్రపంచకప్ లో  భారత్ రాణించాలంటే  పైనున్న నలుగురిలో ముగ్గురు తప్పకుండా ఆడాలి.  ఇషాన్ కిషన్ తాజా ప్రదర్శనలతో  అతడు తర్వాత సిరీస్ కు ఎంపికవుతాడా..? అనేది అనుమానమే. ఇక సెలెక్టర్లు అతడికి అవకాశమిచ్చేది కూడా డౌటే.  కానీ కోహ్లి, రోహిత్, బుమ్రా లు మూడు ఫార్మాట్లు ఆడే ఆటగాళ్లు. వీరి ఆట నానాటికీ తీసికట్టుగా మారుతున్నది.  టీమిండియా అభిమానులను  అత్యంత కలవరపరుస్తున్న అంశమిది. విరాట్,  రోహిత్ ల చెత్త ఆట మరీ ఆందోళనకరం. కెప్టెన్సీ భారంతో రోహిత్ ఆడటం లేదంటే మరి ప్రపంచకప్ లో రాణించేది ఎలా..? ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ లో కీలక ఆటగాడైన బుమ్రా.. ఈసారి అత్యంత దారుణంగా విఫలమవుతుండటం కూడా ఆ జట్టు విజయావకాశాలను దెబ్బతీస్తున్నది.

మిడిలార్డర్ పరిస్థితి అంతంత మాత్రమే.. 

ఈ ఐపీఎల్ కు ముందు  ముగిసిన శ్రీలంక తో టీ20 సిరీస్ లలో శ్రేయస్ అయ్యర్ వరుసగా 3 హాఫ్ సెంచరీలతో  మెరిశాడు.  అంతకుముందు వెస్టిండీస్ తో వన్డే, టీ 20 సిరీస్ లో సూర్యకుమార్ యాదవ్ కూడా మెరుగ్గా ఆడాడు.  వీళ్లిద్దరి రాకతో టీమిండియా మిడిలార్డర్ కు  ఢోకాలేదనిపించింది. వీరికి తోడు  నయా ఫినిషర్ రిషభ్ పంత్ మీద కూడా భారీ ఆశలే ఉండేవి.  

అయితే  ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతూ తొలి మూడు మ్యాచులు కాస్త  రాణించిన సూర్య తర్వాత లయ కోల్పోయాడు. శ్రేయస్ అయ్యర్ (8 మ్యాచులలో 248 పరుగులు.. 2 ఫిఫ్టీలు)  పరిస్థితి కూడా అంతంతమాత్రమే. ఇక ఢిల్లీ సారథి రిషభ్ పంత్ (188 పరుగులు) కూడా అడపాదడపా  హిట్టింగ్ లకు దిగుతున్నా నిలకడ లేదు. అయ్యర్, పంత్ లు అప్పుడో ఇప్పుడో మెరుస్తున్నా  అవి కూడా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ అయితే కాదు. 

ఐపీఎల్ లో మనకు కలిసొచ్చిన అంశాలు : 

సగం సీజన్ ముగిసిన ఐపీఎల్ లో మనకు  కలిసొచ్చిన అంశాల్లో అత్యంత ముఖ్యమైనది హార్ధిక్ పాండ్యా పునరాగమనం.  గాయం, ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతూ  జట్టులో స్థానం కోల్పోయిన ఈ బరోడా బాంబర్.. ఐపీఎల్ లో అదరగొడుతున్నాడు.  ఆరు మ్యాచుల్లో 295 పరుగులు  చేసి ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. బౌలింగ్ కూడా భాగానే వేయగలుగుతున్నాడు. అన్నిటికీ మించి గుజరాత్ కు వరుస విజయాలు అందిస్తున్నాడు. 

కెఎల్ రాహుల్ సక్సెస్ : ఐపీఎల్ అంటేనే పూనకం వచ్చినోడిలా ఆడే రాహుల్ కూడా  ఈ సీజన్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ (బ్యాటింగ్ పరంగా..)  అయ్యాడు. 8 మ్యాచుల్లో 368 పరుగులు (రెండు సెంచరీలు) చేసి తిరిగి ఫామ్ ను అందుకున్నాడు. 

కుల్చా  బ్యాక్ ఆన్ ట్రాక్ : టీమిండియా మణికట్టు స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ లు ఈ ఐపీఎల్ లో ఇరగదీస్తున్నారు. ఇప్పటివరకు 7 మ్యాచుల్లో 18 వికెట్లతో పర్పుల్ క్యాప్  దక్కించుకోగా.. కుల్దీప్ యాదవ్ 7  మ్యాచుల్లో 13 వికెట్లు తీశాడు. ఈ ఇద్దరు స్పిన్నర్లుగా రాణిస్తుండటం భారత్ కు కలిసొచ్చేది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !