
ఢిల్లీ క్యాపిటల్స్ లో కరోనా కలవరంతో ఇప్పటికే డిల్లీ - పంజాబ్ ల మధ్య జరుగుతున్న మ్యాచ్ వేదిక మారగా.. తాజాగా మరో మ్యాచ్ కు కూడా వేదిక మారింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 22 (శుక్రవారం) న ఢిల్లీ క్యాపిటల్స్ - రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) లో ఈ మ్యాచ్ నిర్వహించాల్సి ఉండగా.. తాజాగా దీనిని వాంఖెడే కు మార్చారు. ఇక ఢిల్లీ-పంజాబ్ మధ్య మ్యాచ్ బ్రబోర్న్ (ముంబై)లో జరుగుతున్న విషయం తెలిసిందే.
ఇక ఢిల్లీ - రాజస్థాన్ మ్యాచ్ కు సంబంధించి బీసీసీఐ ఈ విషయాన్ని ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. ‘34వ మ్యాచ్ (ఢిల్లీ-రాజస్తాన్) వేదికను పూణే నుంచి వాంఖెడేకు మార్చాం. ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నాం..’ అని బీసీసీఐ తెలిపింది.
కాగా.. ఢిల్లీ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ తర్వాత న్యూజిలాండ్ వికెట్ కీపర్ టిమ్ సీఫర్ట్ కూడా కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. మార్ష్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగా.. సీఫర్ట్ ఐసోలేషన్ లో ఉన్నాడు.
సరిగ్గా మ్యాచ్ కు కొద్దిగంటల ముందే సీఫర్ట్ కు పాజిటివ్ సోకిందన్న విషయంతో పంజాబ్ తో మ్యాచ్ జరుగుతుందా..? లేదా..? అని అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ మ్యాచ్ ఆడటానికి కనీసం 12 మంది సభ్యులు అందుబాటులో ఉండటంతో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ నిర్వహణకే ఐపీఎల్ నిర్వాహకులు మొగ్గు చూపారు.
ఢిల్లీ క్యాపిటల్స్ లో కోవిడ్ బాధితులు :
- పాట్రిక్ ఫర్హర్ట్ : ఫిజియోథెరఫిస్టు (ఏప్రిల్ 15న కరోనా సోకింది. ఐపీఎల్ లో తొలి కరోనా బాధితుడు ఫర్హర్టే..)
- చేతన్ కుమార్ : స్పోర్ట్స్ మసాజ్ థెరపిస్ట్.. (ఏప్రిల్ 16న పాజిటివ్)
- మిచెల్ మార్ష్ : ఢిల్లీ ఆల్ రౌండర్.. (ఏప్రిల్ 18న పాజిటివ్)
- డాక్టర్ అభిజిత్ సాల్వి : టీమ్ డైరెక్టర్.. (ఏప్రిల్ 18న పాజిటివ్)
- ఆకాశ్ మనే : సోషల్ మీడియా కంటెంట్ టీమ్ మెంబర్ (ఏప్రిల్ 118న పాజిటివ్)
- టిమ్ సీఫర్ట్ : ఢిల్లీ జట్టులో ఆటగాడు (ఏప్రిల్ 20 న పాజిటివ్)