రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకున్న తమీమ్ ఇక్బాల్.. ప్రధాని కోరికను కాదనలేనంటూ...

Published : Jul 08, 2023, 12:07 PM IST
రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకున్న తమీమ్ ఇక్బాల్.. ప్రధాని కోరికను కాదనలేనంటూ...

సారాంశం

ప్రధాని షేక్ హాసినా కోరడంతో రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించిన తమీమ్ ఇక్బాల్.. ఆరు వారాల విశ్రాంతినిస్తూ బంగ్లా క్రికెట్ బోర్డు నిర్ణయం.. 

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి 3 నెలల ముందు రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించిన తమీమ్ ఇక్బాల్, రెండు రోజులకే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఆఫ్ఘాన్‌తో మొదటి వన్డే మ్యాచ్ ఓడిన తర్వాత తమీమ్ ఇక్బాల్, అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు.. 

ఈ నిర్ణయంతో బంగ్లా క్రికెట్ బోర్డు షాక్‌కి గురైంది. ఈ నిర్ణయం తర్వాత బంగ్లా మాజీ కెప్టెన్, బంగ్లా పార్లమెంట్ సభ్యుడు ముషరఫే మోర్తాజా, బంగ్లా ప్రధాని షేక్ హసీనాలను కలిసిన తమీమ్ ఇక్బాల్, రిటైర్మెంట్ నుంచి వెనక్కి వస్తున్నట్టు ప్రకటించాడు..

‘నేను ఎవ్వరికైనా no చెప్పగలను కానీ దేశానికి అతి ముఖ్యమైన మనిషికి మాత్రం చెప్పలేను. సుదీర్ఘ చర్చల తర్వాత తిరిగి క్రికెట్ ఆడాల్సిందిగా ఆమె, నన్ను కోరారు. అందుకే నా రిటైర్మెంట్‌ని వెనక్కి తీసుకుంటున్నా...’ అంటూ ఢాకాలోని ప్రధాని కార్యాలయం ముందు ప్రకటించాడు తమీమ్ ఇక్బాల్.. 

అయితే తమీమ్ ఇక్బాల్‌కి ఆరు వారాల విశ్రాంతిని ఇస్తూ బంగ్లా క్రికెట్ బోర్డు డైరెక్టర్ జలాల్ యూనస్ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో ఆఫ్ఘాన్‌తో జరిగే వన్డే సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లకు లిటన్ దాస్ కెప్టెన్సీ చేయబోతున్నాడు. తమీమ్ ఇక్బాల్ రీఎంట్రీ ఇచ్చేవరకూ లిటన్ దాస్, బంగ్లాదేశ్‌ వన్డే సారథిగా వ్యవహరిస్తాడు.  


2007లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన తమీమ్ ఇక్బాల్, 16 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లో 69 టెస్టులు, 238 వన్డేలు, 78 టీ20 మ్యాచులు ఆడాడు.. టెస్టుల్లో 10 సెంచరీలతో 5082 పరుగులు చేసిన తమీమ్ ఇక్బాల్, వన్డేల్లో 14 సెంచరీలతో 8224 పరుగులు చేశాడు. టీ20ల్లో ఓ సెంచరీ, 3 హాఫ్ సెంచరీలతో 1758 పరుగులు చేశాడు.  2020లో బంగ్లాదేశ్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తమీమ్ ఇక్బాల్, 37  మ్యాచులకు కెప్టెన్సీ చేసి 21 విజయాలు అందుకున్నాడు. 

జనవరి 2022లో టీ20ల నుంచి ఆరు నెలల బ్రేక్ తీసుకున్న తమీమ్ ఇక్బాల్, 2022 జూన్‌లో టీ20ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. 

బంగ్లాదేశ్ టీమ్ తరుపున 10 వేలకు పైగా అంతర్జాతీయ పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసిన తమీమ్ ఇక్బాల్, 14 వేలకు పైగా అంతర్జాతీయ పరుగులు చేసిన ఏకైక బంగ్లా బ్యాటర్‌గా ఉన్నాడు. 

బంగ్లాదేశ్ తరుపున 6 వేలకు పైగా వన్డే పరుగులు చేసిన బ్యాటర్ కూడా తమీమ్ ఇక్బాలే. మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ చేసిన ఏకైక బంగ్లా బ్యాటర్‌గా ఉన్న తమీమ్ ఇక్బాల్, మూడు ఫార్మాట్లలో కలిసి 25 సెంచరీలు చేసి అత్యధిక సెంచరీలు చేసిన బంగ్లా బ్యాటర్‌గా ఉన్నాడు..

2007 వన్డే వరల్డ్ కప్‌ టోర్నీలో టీమిండియా,  బంగ్లాదేశ్ చేతుల్లో దారుణ పరాజయాన్ని అందుకుని, గ్రూప్ స్టేజీ నుంచే తప్పుకుంది. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన తమీమ్ ఇక్బాల్, మొదటి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు..

 వన్డేల్లో 8313 పరుగులు చేసిన తమీమ్ ఇక్బాల్, ప్రస్తుత తరంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత అత్యధిక వన్డే పరుగులు చేసిన బ్యాటర్‌గా మూడో స్థానంలో ఉన్నాడు. తమీమ్ ఇక్బాల్ కెప్టెన్సీలో వన్డే వరల్డ్ కప్ 2023 సూపర్ లీగ్‌ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన బంగ్లాదేశ్, ఇండియాలో జరిగే ప్రపంచ కప్‌కి నేరుగా అర్హత సాధించింది. 

PREV
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !