T20WC Semi-final 1 NZvsENG: మొయిన్ ఆలీ హాఫ్ సెంచరీ... ఫైనల్ చేరేందుకు న్యూజిలాండ్ ముందు...

By Chinthakindhi RamuFirst Published Nov 10, 2021, 9:15 PM IST
Highlights

టీ20 వరల్డ్‌కప్ 2021 మొదటి సెమీఫైనల్: నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసిన ఇంగ్లాండ్... మొయిన్ ఆలీ హాఫ్ సెంచరీ...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ మొదటి సెమీ ఫైనల్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. టోర్నీలో ఇప్పటిదాకా ఓపెనర్‌గా రాణించిన జాసన్ రాయ్, గత మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడడంతో అతని స్థానంలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్ స్టోని ఓపెనర్‌గా ప్రమోట్ చేసింది ఇంగ్లాండ్. అయితే పవర్ ప్లేలో న్యూజిలాండ్ బౌలర్లను ఎదుర్కోవడానికి కాస్త ఇబ్బంది పడినట్టు కనిపించిన బెయిర్ స్టో 17 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసి ఆడమ్ మిల్నే బౌలింగ్‌లో కేన్ విలియంసన్ పట్టిన అద్భుత క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు. 

37 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్. ఆ తర్వాత 24 బంతుల్లో 4 ఫోర్లతో 29 పరుగులు చేసిన జోస్ బట్లర్, ఇష్ సోదీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. బట్లర్ రివ్యూ తీసుకున్నా, ఫలితం లేకపోయింది. ఆ తర్వాత డేవిడ్ మలాన్, మొయిన్ ఆలీ కలిసి మూడో వికెట్‌కి 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 30 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 42 పరుగులు చేసిన డేవిడ్ మలాన్, టిమ్ సౌథీ బౌలింగ్‌లో కాన్వేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో 269 పరుగులు చేసిన జోస్ బట్లర్, ఒకే సీజన్‌లో 250+ పరుగులు పూర్తి చేసుకున్న మొట్టమొదటి ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. 2016 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో జోస్ బట్లర్ 249 పరుగులు చేయడమే ఇప్పటిదాకా ఇంగ్లాండ్‌ తరుపున అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది...

ఆడమ్ మిల్నే వేసిన 18వ ఓవర్‌లో మొయిన్ ఆలీ, లివింగ్‌స్టోన్ చెరో సిక్సర్ బాది 16 పరుగులు రాబట్టారు. జేమ్స్ నీశమ్ వేసిన ఆఖరి ఓవర్‌లో మొదటి బంతికి సింగిల్ రాగా, రెండో బంతికి భారీ షాట్‌కి ప్రయత్నించిన లియామ్ లివింగ్‌స్టోన్ అవుట్ అయ్యాడు.

10 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 17 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు లివింగ్‌స్టోన్. ఆ తర్వాతి బంతికి బౌండరీ బాది హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు మొయిన్ ఆలీ... 37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు మొయిన్ ఆలీ. ఆఖరి బంతికి మొయిన్ ఆలీ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను ఫిలిప్స్ డ్రాప్ చేయడంతో మరో రెండు పరుగులు వచ్చాయి.

ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు యూఏఈలోని అబుదాబీ క్రికెట్ స్టేడియంలో క్యూరేటర్‌గా వ్యవహరించిన మోహన్ సింగ్‌కి నివాళిగా క్రికెటర్లు, ప్రేక్షకులు అందరూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అలాగే ఇరు జట్ల క్రికెటర్లు నల్ల బ్యాడ్జీలతో బరిలో దిగారు.

ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఆఖరి గ్రూప్ మ్యాచ్‌కి ముందు అబుదాబి  క్రికెట్ స్టేడియానికి క్యూరేటర్‌గా వ్యవహరించిన మోహన్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నారు. అబుదాబీ షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియానిక 15 ఏళ్లుగా క్యూరేటర్‌గా వ్యవమరిస్తున్న మోహన్ సింగ్, అంతకుముందు 10 ఏళ్ల పాటు మోహాలీలో కోచ్‌గా, స్టాఫ్‌గా తదితర విభాగాల్లో పనిచేశారు. 

click me!